నూతన యుద్ధ కూటమిలకు నాందిపలకడం, తాను చేసే ప్రతి యుద్ధానికి ఒక కారణం చూపి నామకరణం చేసి ప్రజలను నమ్మించడంలో ఆరితేరిన దేశం అమెరికా. ఇటీవలిదాకా ప్రాచుర్యంలోకి వచ్చిన క్వాడ్ (అమెరికా,జపాన్, ఆస్ట్రేలియా, భారత్) కూటమి కానీ, ఇప్పుడు కొత్తగా దాని నాయకత్వంలో ఏర్పడిన ‘ఆకస్’ (ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా) కూటమి కానీ అమెరికన్ యుద్ధతంత్రంలో సరికొత్త వ్యూహాలేనని చెప్పాలి. అసియా–పసిఫిక్‌లో ‘భద్రత, శ్రేయస్సు’ కోసమని ఎప్పటిలాగే అమెరికా బొంకుతున్నప్పటికీ, చైనా విస్తరణ బూచిని చూపెట్టి కొత్త యుద్ధరంగాన్ని సిద్ధం చేస్తున్న వ్యూహంలో భాగమే ‘అకస్’ అని స్పష్టమవుతోంది.
గత కొన్నేళ్లుగా చతుర్బుజ కూటమి క్వాడ్ (అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్) పేరిట పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఆధిపత్య రాజకీయాలకు అమెరికా తెరతీసింది. కానీ 8 వేలకు పైచిలుకు అణ్వస్త్రాలను కలిగి ఉన్న అమెరికాకు, కేవలం 300 అణ్వస్త్రాలు గల చైనాతో భద్రతకు ముప్పంటే పసిపిల్ల వాడు కూడా నమ్మలేడు. ఆసియా పసిఫిక్ ప్రాంతం లోని డిగోగార్షియా, బహ్రైన్, డ్జిబౌటీ, గువామ్, తైవాన్, జపాన్, ఫిలిప్ఫైన్స్, జపాన్, దక్షిణ కొరియాలలో అమెరికా ఇప్పటికే సైన్యాన్ని, క్షిపణులను, యుద్ధనౌకలను మోహరించింది. ఇప్పటివరకూ హాట్ టాపిక్‌గా ఉన్న ‘క్వాడ్’ (అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్) కూటమికి ఈనెల 24న అధ్యక్షుడు బైడెన్ ఆతిథ్యమిచ్చారు.
అయితే అంతకంటే ముందుగా ఈ కూటమిని కాస్తా చల్లారబర్చి నూతన త్రిభుజ కూటమిగా (ఆస్ట్రేలియా, యూకే, అమెరికా) ‘అకస్’ను అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్, ఆస్ట్రేలియా ప్రధానులు ప్రకటించారు. దీంట్లో భాగంగా ఆస్ట్రేలియా జలాంతర్గాములకు అణుఇంధనంతో నిర్మించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా, బ్రిటన్‌లు అంది స్తాయి. ఈ కొత్త కూటమి ఏర్పాటు అసియా–పసిఫిక్‌లో ‘భద్రత, శ్రేయస్సు’ కోసమని ఎప్పటిలాగే అమెరికా బొంకుతోంది. అందుకే ఆకస్ ఒప్పందం వెనుక అమెరికా ప్రచ్ఛన్నయుద్ధ మనస్తత్వమే దాగి ఉందని చైనా ఆరోపించింది.
వాస్తవం ఏమిటంటే, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆసియా ఖండంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోటానికి భారత్, చైనాలను యుద్ధ ముగ్గులోకి దింపి, పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుగా అమెరికా వ్యవహరిస్తోంది. దీనికోసం 2011లోనే ‘ఆసియా పివోట్’ పథకాన్ని అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యూహాత్మకంగా ఆస్ట్రేలియాలో ప్రకటిం చాడు. ప్రశాంతంగా ఉండే ఆసియా–పసిఫిక్ ప్రాంతం నాటినుంచే ఉద్రిక్తతల నడుమ పయనిస్తోంది.
‘అకస్’ ఏర్పాటుతో నాటో యుద్ధ కూటమిలో, ఈయూ దేశాల్లో లుకలుకలు ప్రారంభమైనాయి. ఫ్రాన్స్ తన రాయబారులను అమెరికా, ఆస్ట్రేలియాలనుంచి వెనకకు రప్పించి, ఇది అమెరికా వెన్నుపోటని తీవ్రంగా హెచ్చరించింది. బ్రిటన్‌తో రక్షణశాఖ చర్చలను రద్దు చేసుకొంది. ఈ ఆకస్ ఒప్పందం అసలు ఉద్దేశం భద్రతకు సంబంధించినది కానేకాదు, అమెరికా యుద్ధ పరిశ్రమల కార్పొరేట్లకు లాభాలను ఆర్జిం చడం కోసమే. ఆస్ట్రేలియాతో ఫ్రాన్స్ లోగడ 2016లో డీజిల్‌తో నడిపే 12 జలాంతర్గాములను 36,400 కోట్ల డాలర్లతో ఎగుమతి చేయటానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తాజా ‘ఆకస్’ ఒప్పందంతో ఫ్రాన్స్ ఒప్పందం చిత్తు కాగితంగా మారింది. ఈ కూటముల జోలికి పోకుండా భారత్ తటస్థంగా ఉండి, అలీనోద్యమాన్ని ప్రోత్సహించటమే శ్రేయస్కరం.
బుడ్డిగ జమిందార్
వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,
కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969
Comments
Please login to add a commentAdd a comment