కృత్రిమ మేధ విసరనున్న సవాళ్లు | Challenges While Using Artificial Intelligence Like Chatgpt, Bard | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధ విసరనున్న సవాళ్లు

Published Fri, May 26 2023 12:58 AM | Last Updated on Fri, May 26 2023 1:03 AM

Challenges While Using Artificial Intelligence Like Chatgpt, Bard - Sakshi

ఛాట్‌ జీపీటీ, బార్డ్, బింగ్, డాల్‌–ఈ! ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీల పేర్లు ఇవి. వాణిజ్యం, భద్రత విషయాల్లో ఈ సాఫ్ట్‌వేర్ల ప్రభావం ఏమిటన్న విషయంపై ఇప్పుడు విస్తృత∙చర్చ జరుగుతోంది. జనరేటివ్‌ ఏఐ సాఫ్ట్‌వేర్లు ఎంత పురోగతి సాధించినా... వాటికి మనిషికున్న విచక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి వాటంతట అవే మనిషికి చెడు చేయలేకపోవచ్చు కానీ... చెడుబుద్ధి కలిగిన మనిషి వల్ల మాత్రం జరిగే ప్రమాదం ఉంది. కంప్యూటర్ల రాకతో మేలూ జరిగింది, సైబర్‌ మోసాలూ పెరిగాయి. జనరేటివ్‌ ఏఐ విషయంలోనూ రాగల అపార అవకాశాలకు రానున్న తరాలను సిద్ధం చేయడం, ఎదురుకాగల ప్రమాదాలను వీలైనంత వరకూ తగ్గించడం ఇప్పుడు మనం చేయాల్సిన పని!

సాధారణంగా మనం ఉపయోగించే సాఫ్ట్‌ వేర్‌ ఏదైనా సొంతంగా సృష్టించేది ఏమీ ఉండదు. అయితే కొన్ని సాధారణ కృత్రిమ మేధ(ఏఐ) సాఫ్ట్‌వేర్లు మన రాతల్లోని తప్పులను దిద్దడమే కాకుండా... తరువాత ఉపయోగించగల పదాలను సూచించగలవు. ఛాట్‌జీపీటీ వంటివి వీటికంటే అత్యాధునికమైనవి. సొంతంగా వ్యాసాలు, కవితలు రాసి పెట్ట గలవవు. ఈ లాంగ్వేజ్‌ జనరేటెడ్‌ కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్లు మనం వేసిన ప్రశ్నలను సమర్థంగా అర్థం చేసుకోవడమే కాకుండా ఇంట ర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం మొత్తాన్ని మధించి సవివ రమైన సమాధానాన్ని సిద్ధం చేయగలవు. ఇతరుల గొంతులను అనుకరించేందుకు, గ్రాఫిక్స్‌ కోసం కూడా వీటిని వాడుకోవచ్చు. గత ఏడాది అక్టోబరులో సామాన్యులకూ అందుబాటులోకి వచ్చిన ఛాట్‌ జీపీటీ చాలా తక్కువ కాలంలో వ్యాప్తి చెందింది. సెకన్ల కాలంలోనే సంక్లిష్టమైన ప్రశ్నలకూ జవాబులు చెబుతూ అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో చాలామందిలో కృత్రిమ మేధపై ఆందోళన వ్యక్తమయ్యేందుకూ కారణమైంది. 

ఈ నేపథ్యంలో నేనూ ఛాట్‌ జీపీటీకి ఒక ప్రశ్న సంధించా. ఉద్యో గాలపై అత్యాధునిక కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్ల ప్రభావం ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఛాట్‌ జీపీటీ సంతులనంతో కూడిన జవాబిచ్చింది. డేటా ఎంట్రీ, అసెంబ్లీ లైన్, కస్టమర్‌ కేర్‌ వంటి రంగాల్లోని రిపిటీటివ్‌ పనులు (ఒకే పనిని పదేపదే చేయడం) చేయడంలో కృత్రిమ మేధకు అపారమైన సామర్థ్యముందని చెబుతూనే... గ్రాఫిక్‌ డిజైనింగ్, అడ్వ రై్టజ్‌మెంట్, కంటెంట్‌ క్రియేషన్‌  వంటి సృజనాత్మక విషయాల్లోనూ జనరేటివ్‌ ఏఐ మంచి ప్రభావం చూపగలదని తెలిపింది. ఈ సమాధానంలోనే ఛాట్‌ జీపీటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ధనిక, పేద అంతరాన్ని కూడా ప్రస్తావించడం గమనార్హం. నైపుణ్య లేమి లేదా మధ్యమ స్థాయి నైపుణ్యాలు మాత్రమే ఉన్న పనివారికి నష్టం జరిగే అవకాశముందని తేల్చి చెప్పింది. మెషీన్‌  లెర్నింగ్, డేటా అనా లసిస్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి కొత్త, వినూత్న ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యం కూడా జనరేటివ్‌ ఏఐకి ఉందని వివరించింది.

సాంకేతిక పరిజ్ఞానంలో జరిగే మార్పులు అప్పటికే ఉన్న ఉద్యో గాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అదే సమయంలో కొత్త కొత్త ఉద్యోగాలను కూడా సృష్టిస్తాయి. ఎడ్లబండ్ల స్థానంలో మోటారు వాహనాలు వచ్చినట్లు అన్నమాట! భారతదేశంలో జనరేటివ్‌ ఏఐ దానికున్న సృజనాత్మక సామర్థ్యాన్ని బట్టి చూస్తే బిజినెస్‌ ప్రాసెసింగ్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ రంగాల్లోని ఉద్యోగాలపై కచ్చితంగా ప్రతి కూల ప్రభావం చూపనుంది. ఈ రంగాల్లోని పనులను జనరేటివ్‌ ఏఐ ప్రోగ్రామ్స్‌ చాలా సులువుగా చేయగలవు. కాకపోతే వీటితో పని చేయించేందుకు కొంత సాయం, ప్రాంప్టింగ్‌ అవసరం. మన ఐటీ, బీపీవో కంపెనీలు ఈ సామర్థ్యాలను అందుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... జనరేటివ్‌ ఏఐ ఈ విషయంలోనూ మనకు సాయపడగలదు. తక్కువ నైపుణ్యం ఉన్నవారికి తగిన శిక్షణ ఇవ్వగలదు. ఉదాహరణకు ఇంగ్లీషు భాషా నైపుణ్యాన్ని పెంచు కునేందుకు, తద్వారా మార్కెటింగ్‌ లేదా మరే ఇతర రంగంలోనైనా రాణించేందుకు ఏఐని వాడుకోవచ్చు. 

ఇప్పుడు చర్చ మొత్తం భద్రత పైనే...
జనరేటివ్‌ ఏఐ విషయంలో ఇప్పుడు చర్చ మొత్తం భద్రతాంశాల పైనే. ఛాట్‌ జీపీటీ రాక నేపథ్యంలో ఇది మరింత ముదురుతోంది. మనుషుల ప్రమేయం లేకుండానే ఈ జనరేటివ్‌ ఏఐ సాఫ్ట్‌వేర్లు ఇమే జెస్, వీడియో, టెక్ట్స్‌లను సృష్టించగలవు. ప్రఖ్యాత రచయిత యువాన్‌  హరారి అభిప్రాయం ప్రకారం, మానవ సంస్కృతికి భాష అనేది ప్రాథమిక ప్రాతిపదిక. భాష విషయంలో ప్రావీణ్యం కలిగి ఉన్న జనరేటివ్‌ ఏఐ... సంస్కృతి వృద్ధి, విశ్వాసాలను తన చేతుల్లోకి తీసు కోలదని యువాన్‌  అంటారు. అయితే జనరేటివ్‌ ఏఐకి తనదైన చేతన ఉండదు. ఏదో సాధించాలన్న కాంక్ష కూడా కరవు. స్పష్టంగా చెప్పా లంటే... కొంతమంది మనుషులు ఇతరులపై తమ ప్రభవాన్ని మరింత పెంచుకునేందుకు జనరేటివ్‌ ఏఐ వంటివాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. 

ఈ జనరేటివ్‌ ఏఐ సాఫ్ట్‌వేర్లు చాలా వరకూ ఓపెన్‌  సోర్స్‌. అంద రికీ అందుబాటులో ఉండేవి. అంటే రకరకాల అభిప్రాయాలు, నమ్మకాలు ప్రచారంలోకి వచ్చేందుకు అవకాశమున్నవి. కాబట్టి సమస్య అంత పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. కానీ అసలైన సవాలు కృత్రిమ మేధను మానసిక ప్రకోపాలతో ఉపయోగించడంతోనే ఉంది. ఛాట్‌ జీపీటీ ఇచ్చిన సమాధానం ప్రకారమే... కృత్రిమ మేధ ఆధారంగా నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, సంప్రదాయ భద్రత ఏర్పాట్లను తప్పించుకుని సైబర్‌ దాడులకు తెగబడేలా ఏఐని వాడు కోవడం, కృత్రిమ మేధను ఉపయోగించుకుని మానవులపై ఆయుధ దాడి చేయడం వంటివాటికి అవకాశం ఉంది. అంతేకాకుండా... నకిలీ వార్తలు, మోసాల వంటివాటిని మరింత తీవ్రతరం చేసేందుకు కూడా ఈ జనరేటివ్‌ ఏఐ అక్కరకొచ్చే ప్రమాదముంది. గొంతులను అను కరించే సామర్థ్యం కూడా ఉండటం వల్ల భవిష్యత్తులో మన కుటుంబ సభ్యుల గొంతులోనే డబ్బులడిగే మోసాలకు తెరలేవవచ్చు. 

దుర్వినియోగాన్ని అరికట్టడం ఎలా?
జనరేటివ్‌ ఏఐ కారణంగా ఒకవేళ ఉద్యోగాలు తగ్గిపోతే సార్వత్రిక కనీస ఆదాయం వంటి వాటి ద్వారా జరిగే నష్టాన్ని కొంతైనా తగ్గించవచ్చునని ఛాట్‌ జీపీటీ çసృష్టికర్త సామ్‌ ఆల్ట్‌మ్యాన్‌  అంటారు. కానీ భద్రతపరమైన అంశాలతోపాటు ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడం ఎలా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. కృత్రిమ మేధ వాడకానికి, నియంత్రణకు ప్రత్యేక సంస్థ ఒకదాన్ని ఏర్పాటు చేయాలన్న ఏకాభిప్రాయం కూడా ఇప్పుడిప్పుడే ఏర్పడుతోంది. ఈ విషయమై జీ7 దేశాలు ఓ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూండగా, యూరోపియన్‌ యూనియన్‌  ఇప్పటికే నియంత్రణ మార్గదర్శకాల తయారీలో నిమ గ్నమైంది. అయితే ఈ నియంత్రణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగితే రాజకీయ దుర్వినియోగమన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కృత్రిమ మేధ అభివృద్ధిపై చైనా ఇప్పటికే కొన్ని నియంత్రణలను అమల్లో పెట్టిన విషయం ప్రస్తావనార్హం. 

భారత్‌ సిద్ధం కావాలి
దశాబ్దాల క్రితం కంప్యూటరీకరణ మాదిరిగానే... జనరేటివ్‌ ఏఐ రేపటితరం టెక్నాలజీ అన్న విషయాన్ని భారత్‌ అంగీకరించాల్సిన అవసరముంది. కాబట్టి అలాంటి సాఫ్ట్‌వేర్లను స్థానికంగా అభివృద్ధి చేయాలి, వాడటాన్ని ప్రోత్సహించాలి. జనరేటివ్‌ ఏఐకి భాషే ప్రాతి పదిక కాబట్టి.. బోలెడన్ని భాషలు మాట్లాడే భారత్‌లో వాటి వినియోగం పెద్ద సవాలే. పైగా ఏఐ సర్వీసులకు పెద్ద పెద్ద సర్వర్‌ వ్యవస్థల అవసరం ఉంటుంది. ఇది పెద్ద పెద్ద కంపెనీలకు అనుకూ లమైన అంశం. అలాగే... వీలైనంత తొందరగా ఇన్ఫోటెక్‌ పరిశ్రమను, ఏఐని అనుసంధానించాల్సిన అవసరముందని... తద్వారా మాత్రమే ఏఐ మార్కెట్‌లో స్థానం సంపాదించవచ్చునని తాజా అంచనా. కంప్యూటర్ల రాకతో కష్టతరమైన లెక్కలు వేసే బాధ తప్పి అంతకంటే ఎక్కువ ప్రయోజనకరమైన పనులపై దృష్టి పెట్టడం సాధ్యమైంది. సైబర్‌ మోసాలూ పెరిగాయి. ఇదే విధంగా జనరేటివ్‌ ఏఐ కూడా భవిష్యత్తు తరాలకు కూడా కొంత మంచి, కొంత చెడు అనుభవాలను చూపించనుంది. ఈ పరిణామాలకు, రాగల అపార అవకాశాలకు రానున్న తరాలను సిద్ధం చేయడం... ఎదురు కాగల ప్రమాదాలను వీలైనంత వరకూ తగ్గించడం ఇప్పుడు మనం చేయాల్సిన పని!


నితిన్‌ దేశాయి ,వ్యాసకర్త ఆర్థికవేత్త
(‘ద బిజినెస్‌ స్టాండర్డ్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement