
కులం గురించి మాట్లాడినవారికి చెప్పు చూపాలని చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం సూచించారు. కులం పునాదుల మీద రాజకీయాలలోకి వచ్చి, కులం గోడలను అడ్డు పెట్టుకుని రాజకీయాలలో కొనసాగుతున్న చంద్రబాబు ఇలా మాట్లాడటం ఆసక్తికరమైన అంశమే. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కూడా! కాకపోతే ఇందులో ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఎంతన్నదే చర్చనీయాంశం. ఒకవైపు కులం, మతం గురించి మాట్లాడవద్దని అంటారు. మరోవైపు తానే ఆ విషయాలను ప్రస్తావిస్తుంటారు. ఆయన లెక్కలో తాను మాట్లాడితే అది దేశం, సమాజం హితవు గురించి అని జనం అనుకోవాలి! ఇతరులు మాట్లాడినా, మాట్లాడకపోయినా వీలైనంత బురద రాయాలి. ఇదే ఆయన థియరీ.
అధికారంలో ఉంటే సుద్దులు, అధికారంలో లేకపోతే శాపనార్థాలు. ఈ రకంగా విజయ వంతంగా రాజకీయం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు గత మూడేళ్లుగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆయన మాట్లాడే మాటలలోని వైరుధ్యాలను, గతంలో ఆయన అవే అంశాలపై భిన్నంగా మాట్లాడిన తీరును గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు వచ్చేస్తున్నాయి. విశేషం ఏమిటంటే, ఏ సభలో అయితే కులం గురించి మాట్లాడితే చెప్పు చూపాలని చంద్రబాబు అన్నారో, అదే సభలో వైసీపీని విమర్శిస్తూ, ఆయనే కుల ప్రస్తావనను పదే పదే తేవడం! తన కులం వారితోనే తనను తిట్టిస్తున్నారని చెప్పడం! అక్కడితో ఆగలేదు. పవన్ కల్యాణ్‌ను కూడా ఆయన కులంవారితో తిట్టిస్తున్నారట.
తన గురించి చెప్పుకున్నారంటే పోనీలే అనుకోవచ్చు. పవన్‌ను వైసీపీ వారు ఎవరో విమర్శిస్తే, అది కూడా కులం కోణంలోనే చంద్రబాబు చూడడం, తన పార్టీవారు కాకపోయినా, ఆయనతో ఇంకా పొత్తు లేకపోయినా, ఇప్పటినుంచే కాకా పడుతున్నట్లుగా మాట్లాడటం దేనికి సంకేతం? అసలు కులం గురించి, మతం గురించి ఈ మూడేళ్లలో చంద్రబాబు గానీ, ఆయన దత్తపుత్రుడని వైసీపీ విమర్శించే జనసేన అధినేత పవన్ కల్యాణ్ గానీ మాట్లాడినంతగా మరొకరు మాట్లాడలేదని చెప్పవచ్చు. పవన్ ఒకసారి అచ్చంగా కులభావన ఉండాలనీ, మరోసారి వద్దనీ, ఇంకోసారి ఫలానా ఫలానా కులాలవారు తనకు మద్దతు ఇవ్వాలనీ అంటుంటారు. మరి ఆయనకు చంద్రబాబు చెప్పు చూపిస్తారా? లేక, ఎస్సీలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని అన్నందుకు... తాను కమ్మ కాబట్టే ప్రభుత్వం ఇలా చేస్తోంది, అలా చేస్తోందని అన్నం దుకు తనకు తాను చెప్పు చూపించుకుంటారో తెలియదు.
నిజానికి చంద్రబాబు రాజకీయ జీవితం ఆరంభం అయిందే కులం పునాదుల మీద. ఆయన ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే కమ్మ కులం తరఫున వకాల్తా పుచ్చుకుని ఆ వర్గం నాయ కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే కోటాలో ఆయన కాంగ్రెస్(ఐ) తరపున 1978లో టికెట్ పొందారు. అప్పటి ప్రముఖ నేత రాజ గోపాలనాయుడు ఆశీస్సులతో టికెట్ పొందగలిగారు. సీపీఐ నేత నారాయణ కూడా యూనివర్సిటీలో చంద్రబాబు కుల రాజకీయాలు చేశారని చెప్పారా, లేదా? చంద్రబాబు 1983లో చంద్రగిరిలో ఓడి పోయిన తర్వాత కుప్పం నియోజకవర్గానికి ఎందుకు మారారు? అప్ప టికే అక్కడ ఉన్న కమ్మ వర్గానికి చెందిన రంగస్వామి నాయుడును తప్పించి తను ఎందుకు పోటీ చేశారు? అక్కడ బీసీ వర్గాలవారికి ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానాన్ని తాను క్యాష్ చేసుకోవడానికి కాదా? ఒకవేళ నిజంగానే చంద్రబాబుకు బీసీ వర్గాలవారిపై అంత ప్రేమ ఉండి ఉన్నట్లయితే ఆ సీటును వారికి వదిలిపెట్టి, చంద్రగిరి కాకపోతే, తాను చదువుకున్న తిరుపతిలోనో, చిత్తూరు, శ్రీకాళహస్తి వంటి చోటో ఎందుకు పోటీ చేయలేదు?
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కులాలకు అతీతంగా గుడివాడతో పాటు తిరుపతి, నల్లగొండ, టెక్కలి, హిందుపూర్, కల్వ కుర్తిలలో పోటీచేశారు.
కల్వకుర్తిలో మాత్రం ఓడిపోయారు. హిందుపూర్ నుంచే ఆయన మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన మరణం తర్వాత ఆ గుడ్ విల్‌ను ఆయన కుమారులు హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ వాడుకోగలుగుతున్నారు. ఎన్టీఆర్ ఏ కులం వారు ఎక్కడ ఉన్నారో చూసి పోటీ చేయ లేదు. ధైర్యంగా ఎక్కడైనా తనకు ఆదరణ లభిస్తుందని నమ్మి రాజకీయం చేశారు. మరి చంద్రబాబు అలా ఎన్నడైనా చేయగలిగారా? ఒకే చోటు నుంచి పోటీచేయడం తప్పని అనడం లేదు. కానీ కులం సుద్దులు చెబు తున్నారు కనుక ఇవన్నీ ప్రస్తావించవలసి వస్తోంది. బహుశా ఇప్పుడు కుప్పంలో ఏర్పడిన గడ్డు పరిస్థితి నేప థ్యంలో నియోజకవర్గం మారతారేమో చూడాలి.
మరికొన్ని విషయాలు కూడా చెప్పుకోవాలి. వంగవీటి రంగా హత్య తర్వాత కమ్మవర్గం వారిపై ఎందుకు దాడులు జరిగాయి? చంద్రబాబుకు కులతత్వం లేకపోతే రంగా హత్యకు ఎందుకు కమ్మ వర్గం నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణకు గురయ్యారు? ఈ విషయాన్ని కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య స్వయంగా తన పుస్తకంలో రాసుకున్నారు కదా! హైదరాబాద్, అనంతపురంలలో తాను చేసిన అభివృద్ధి గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ భవనం నిర్మించారు, నిజమే. కానీ ఆ చుట్టు పక్కల భూములన్నీ ముందుగానే ఎక్కువ మంది తన వర్గానికి చెందినవారు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నిస్తున్నవారు ఇప్పటికీ ఉన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ఒక పరిశోధకురాలు తన వ్యాసంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? అనంతపురం జిల్లా పెనుగొండ వద్ద కియా ఫ్యాక్టరీ రావడానికి ముందు టీడీపీ నేతలు, ముఖ్యంగా కమ్మ వర్గం నేతలే భూములు కొనుగోలు చేశారనీ, ఆ దందా వల్లే పెను గొండలో టీడీపీ ఓడిపోయిందన్న విమర్శ వాస్తవమో, కాదో చంద్ర బాబే చెప్పాలి. తాను కమ్మ కులం కాబట్టే అమరావతిలోని రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పింది చంద్రబాబు కాదా? అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ కింద భూములు కొనుగోలు చేసిన వారిలో అధికులు ఆ వర్గం వారే ఎందుకు ఉన్నారు?
ముఖ్యమంత్రి జగన్‌కు రెడ్డి వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాలు అత్యధిక సంఖ్యలో ఎందుకు సపోర్టు చేస్తున్నాయి? జగన్ కుటుంబంలో వివిధ కులాలకు చెందినవారు ఉన్న విషయం మర్చిపోకూడదు. జగన్‌ను క్రిస్టియన్ అని ఎన్నోసార్లు మతపరంగా ప్రస్తావించి దూషిం చిన బాబు ఇప్పుడు కులం, మతం అంటూ నీతులు చెబుతున్నారు. కొన్ని ఆలయాలపై దుండగులు దాష్టీకాలకు పాల్పడితే జగన్ ప్రభుత్వంపై ఎన్ని మతపరమైన ఆరోపణలు చేశారు? మరో సంగతి చెప్పాలి. బాబుకు తన కులానికి చెందిన మీడియా సంస్థలే ఎందుకు అంత ప్రముఖంగా మద్దతు ఇస్తు న్నాయి? రామోజీరావు, రాధా కృష్ణ, బీఆర్ నాయుడు వంటివారు కులంతో కాకుండా మెరిట్ ప్రకారం చంద్రబాబుకు మద్దతు ఇస్తు న్నారా? కడుపు చించుకుంటే కాళ్లమీద పడు తుందన్న చందంగా చంద్రబాబు అనవసర విషయాలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.
హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో గురించి మాట్లాడుతూ, బట్టలిప్పితే కేంద్ర మంత్రి పదవి ఇస్తారా అని అంటు న్నారు. పోలీసుల వివరణ తర్వాత కూడా చంద్రబాబు ఈ విషయం పదే పదే మాట్లాడడం సరైనదేనా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఆడియో ఒరిజినల్ కాదని ఏ పోలీసు వ్యవస్థ అయినా నిర్ధారిం చిందా? కనీసం తాను అయినా అది తన వీడియో కాదని చెప్ప గలిగారా? తన ఫోన్ టాప్ చేస్తారా అని అన్నారే తప్ప తాను టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే యత్నం చేయలేదని చెప్పలేకపోయారే! మరి తన బావమరిది నందమూరి బాలకృష్ణ ఏకంగా ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి, లేదా కడుపు అయినా చేయాలని సలహా ఇచ్చారు కదా? అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి హిందుపూర్ ఎమ్మెల్యేను చేశారు కదా. తన కుమారుడు లోకేశ్ అరడజను మంది విదేశీ యువతులతో చిందులు వేసిన ఫొటోలను సభ్య సమాజం ఆమోదిం చిందని ఆయనకు మంత్రి పదవి ఇచ్చారా? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు ఉన్నాయి.
ఏ రాజ కీయ పార్టీ అయినా బాధ్యతగా ఉండాలి. ఏ నేత అయినా జవాబుదారీగా ఉండాలి. సుదీర్ఘకాలం రాజకీయాలలో ముఖ్యమైన పదవు లలో ఉన్న చంద్రబాబు వంటివారు హద్దులు మీరి మాట్లాడితే పోయేది వారి పరువే. జగన్ ప్రభుత్వంపై విధాన పరమైన విమర్శలు చేయలేక, ఇలాంటి దిక్కుమాలిన విషయాలపై చంద్ర బాబు ఆధార పడే దీన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అనుకుంటే అందులో తప్పేం ఉంటుంది!
కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment