రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి అత్యంత దారుణంగా, అప్రజాస్వామికంగా, అమానవీయంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర క్రియాశీలకంగా ఉండాలి. కానీ అది విశృంఖలంగా మారిన పుడు సమస్యలు జటిలం అవు తాయి. అధికారంలో ఉన్నవారు తీసుకొనే నిర్ణయాలను ప్రతిపక్షం ప్రశ్నించవచ్చు, ప్రశ్నించాలి కూడా! కానీ, ప్రతిపక్షం అదేపనిగా ప్రభుత్వం తీసుకొనే ప్రతి చర్య ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందంటూ ఏకపక్షంగా తీర్పులివ్వడం, వాటిపై శ్రుతి మించిన ఆందోళనలు చేయడం; ప్రజలను కుల, మత, ప్రాంత ప్రాతిపదికన రెచ్చగొట్టడం ఏ విధంగా సమంజసం? జరగని తప్పులు జరిగాయని, అడ్డగోలుగా దోచు కొంటున్నారని, రాష్ట్రం దివాళా తీసిందని... ఇలా రకరకా లుగా దుష్ప్రచారం సాగిస్తూ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని తెలుగుదేశం చేస్తున్న యాగీ వల్ల... ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు అధికారకాంక్షను అర్థం చేసుకోవచ్చు.
ప్రతిపక్షం బాధ్యత ఏమిటంటే, ఏదైనా ఒక అంశాన్ని తీసుకొంటే.. దానిని ఒకస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలలో చర్చ జరిగేందుకు ఆస్కారం ఇవ్వాలి. దానిపై మంచి చెడుల్ని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ, నేడు రాష్ట్రంలో జరుగు తున్నదేమిటి? ప్రతి అంశాన్నీ రాజకీయం చేయడమే! ప్రతి పథకంలో అవినీతి ఉందని దుష్ప్రచారం చేయడమే! చంద్రబాబు ఒక్కడికే పాలన చేతనవుతుందని, ఆయనొ క్కడే రాజకీయ వ్యవస్థలో ‘సుద్దపూస’ అనే ప్రచారాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా అదేపనిగా సాగిస్తోంది. బాబు 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఎవరికి తెలియదు? (చదవండి: రంధ్రాన్వేషణే... ప్రతిపక్షం పనా?)
చంద్రబాబు తన జీవితంలో మేనేజ్‌మెంట్ పాలిటిక్స్ నడిపారే తప్ప కేసీఆర్ మాదిరిగా, మమతా బెనర్జీ లాగా పోరాటాలు చేశారా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాగా ప్రజల్ని మెప్పించి అధికారంలోకి వచ్చారా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ మీద యుద్ధం చేస్తానన్న చంద్రబాబు ఆనాడు ఏం చేశారు? తనకున్న పలుకుడిని ఉపయోగించి ఢిల్లీలోని ఆంధ్రభవన్‌కు కొంతమంది జాతీయ పార్టీల నేతలను పిలిపించుకొని ఓ సభ పెట్టి, వారితో మోదీపై విమర్శలు చేయించారు. నల్ల బెలూన్లు ఎగరేశారు. దానిని పోరాటం అనగలమా? ఈవీఎంలను మోదీ హ్యాక్ చేయించి అడ్డదారుల్లో విజయం సాధిస్తున్నారని తీవ్రమైన ఆరోపణ చేయడమే కాక... దానిపై సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని బాబు సవాళ్లు విసరడం ఎవరు మర్చి పోగలరు? ఏమయిందా న్యాయ పోరాటం? మోదీ తిరిగి పెద్ద మెజారిటీతో అధికారంలోకి వచ్చారు కనుక భయ పడ్డారా? కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలతో కలిసి మోదీ నియంతృత్వం మీద పోరాటం చేస్తానని రాహుల్‌గాంధీ నివాసం ‘10 జన్‌పథ్’ ముందు నిలబడి జాతీయ మీడియా సాక్షిగా శపథం చేశారు కదా? ఏమైంది? 2019 ఎన్నికల తర్వాత తటస్థవైఖరి అని ఎందుకు వెనక్కి తగ్గినట్లు?
తను దేశంలో లేని సమయంలో తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు... బీజేపీలో విలీనం అయిన పుడు చంద్రబాబు ఏమని ప్రకటించారు? న్యాయ పోరాటం చేస్తానన్నారు కదా! సుప్రీం కోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? తెలుగుదేశం రాజ్యసభాపక్షం మొత్తం బీజేపీ రాజ్యసభాపక్షంలో విలీనం అయినట్లు రాజ్యసభ చైర్మన్ అయిన వెంకయ్యనాయుడు అధికారికంగా ప్రకటించిన తర్వాత... తెలుగుదేశం తరఫున సభ్యుడిగా కనక మేడల రవీంద్రకుమార్ ఎలా కొనసాగుతున్నట్లు? ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెబుతారు? (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!)
చంద్రబాబు చేసే పోరాటాలన్నీ చాటుమాటు వ్యవహారాలే. సొంత మీడియాను అడ్డుపెట్టుకొని, ఇతర పార్టీలలో తన ప్రయోజనాలను కాపాడే వ్యక్తులతో కలిసి ఆడే డ్రామాలే ఆయన సాగించే పోరాటాలు. చంద్రబాబు అనుసరించే ‘మోడస్ ఆపరేండీ’ ఎలా ఉంటుందంటే... సీఎం వైఎస్ జగన్ మీదనో లేక ప్రభుత్వం తీసుకున్న ఏదైనా ఒక నిర్ణయానికి వ్యతిరేకంగానో... తన సొంత మీడియాలో ముందుగా వార్తలు రాయిస్తారు. ఆ వార్తలను ఆధారంగా చేసుకొని ముందుగా ఇతర పార్టీలవారితో విమర్శలు, ఆరోపణలు చేయిస్తారు. ఆ పార్టీల వారి విమర్శలకు బలం ఎక్కువని, వాటిని ప్రజలు తేలిగ్గా నమ్ముతారన్నది బాబు దురాలోచన. ఆ తర్వాతనే తన పార్టీ వారిని రంగంలోకి దించుతారు. అలాగే తన మీడియాను, సామాజిక మాధ్యమాలను వారికి వెన్నుదన్నుగా మోహరిస్తారు. రాష్ట్రంలో ఏదో జరగరానిది జరిగిపోయినట్లు కలరింగ్ ఇస్తారు. అదే సమయంలో చంద్రబాబును దూరం చేసుకొని ప్రజలు ఘోరమైన తప్పిదం చేశారంటూ ఇంకోవైపు నుండి మరోరకమైన ప్రచారం.
ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం కోసం ఫ్లెక్సీలు ఇతరత్రా ప్రచార సామగ్రిని రాష్ట్ర కార్యాలయం నుండే పంపుతారు. ఈ కార్యక్రమాల నిర్వహణ సామాన్య పార్టీ నేతల వల్ల సాధ్యం కాదు కనుక... భూతద్దం వేసి ఎవరు డబ్బు బాగా ఖర్చు పెడతారో కనిపెడతారు. వారిని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలుగా నియమిస్తారు. సదరు నాయకులు పార్టీ టిక్కెట్లు తమకే వస్తాయన్న ఆశతో... కోట్లు తగలేసుకొంటారు. చివరికొచ్చే సరికి ఇంకా బిగ్ ఫిష్‌ల కోసం చంద్రబాబు ఎదురు చూస్తుంటారు. చంద్రబాబు దైనందిన రాజకీయ జీవితంలో ఇదంతా ఓ భాగం. ఆయనకు వ్యక్తుల పట్ల మమకారం ఉండదు. వ్యవస్థల పట్ల గౌరవం ఉండదు. ప్రతిదీ రాజకీయమే! అధికారపక్షంలో బలంగా గొంతుక విన్పించే కొడాలి నాని వంటి వారిని టార్గెట్ చేయడానికి కారణం ప్రభుత్వాన్ని నైతికంగా దెబ్బ తీయాలన్న కుటిల వ్యూహమే. గుడివాడలో క్యాసినో నిర్వహించారంటూ తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీ తేల్చిందట. పార్టీ పరంగా... ప్రత్యర్థి పార్టీ మీద కమిటీ వేయడం ఏమిటి? ఆ కమిటీ ఏమి తేలుస్తుందో ప్రజలు అర్థం చేసుకోరా? ఆయన చేసే ప్రతి పనీ ఇలాగే ఉంటుంది. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తగిన సమయంలో తగిన విధంగా ఆయనకు గుణపాఠం చెబుతారు.
- సి. రామచంద్రయ్య
శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment