ఇంత ఆక్రోశం ఎందుకు బాబూ? | Ramachandraiah Guest Column On TDP Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఇంత ఆక్రోశం ఎందుకు బాబూ?

Published Sat, Jan 11 2020 12:05 AM | Last Updated on Sat, Jan 11 2020 12:05 AM

Ramachandraiah Guest Column On TDP Chandrababu Naidu - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ లోని మిగతా ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు. అమరావతిలో కొల్లగొట్టిన బినామీల భూములకు విలువ పెరగాలన్నదే చంద్రబాబు పంతం. విజన్‌ 2020 నుంచి రాజధాని వరకు ప్రతి దశలోనూ ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడమే లక్ష్యంగా బాబు పనిచేస్తూవచ్చారు. అమరావతిలో కూడా హైదరాబాద్‌ ఫార్ములా అమలు చేయడానికి ప్లాన్‌ చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా కారు చౌకగా సుమారు నాలుగున్నర వేల ఎకరాల భూములను కొనుగోలు చేయించారు. దాన్ని కాపాడుకోవడానికి రాజధాని రైతులను అడ్డంపెట్టుకుని కృత్రిమ ఉద్యమానికి గొడుగుపడుతున్నారు. విజ్ఞులైన ప్రజలు అన్నీ గ్రహిస్తారు!

తెలుగునాట ‘సాక్షి’ మీడియా, సోషల్‌ మీడియా సామాన్యులకు అందుబాటులోకి రాని రోజుల్లో చంద్రబాబు అనుకూల మీడియా వ్యూహాత్మకంగా వ్యాప్తి చేసిన అనేక మిథ్యలలో ‘చంద్రబాబు గొప్ప పరిపాలనాదక్షుడు’ అనేది ఒకటి. ఈ భుజకీర్తిని తగి లించుకొనే 2014లో చంద్రబాబు స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో అధికారంలోకి రాగలిగారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 5 ఏళ్ల చంద్రబాబు పాలన ప్రజలకు ఓ పీడకలగా మారి ఆయన పరిపాలన దక్షతలోని డొల్లతనం ప్రజలకు తెలిసొచ్చింది, అనేక వర్గాల ప్రజలకు చేదు అనుభవాలను అందించింది. ఇందులో.. రాజధానికి భూములిచ్చిన రైతులూ ఉండటం విషాదం. కానీ ప్రజలు చిత్తుగా ఓడించినా చంద్రబాబుకు అహంకారం తగ్గలేదు. జ్ఞానోదయం కాలేదు. ప్రజలను వంచించానన్న పశ్చాత్తాపం ఏ కోశానా కనపడటం లేదు. ఇంకా తన ‘విజన్‌’ గొప్పదని.. రాష్ట్రాన్ని అభివృద్ధి పర్చడం తనకొక్కడికే సాధ్యం అంటూ.. ఇటీవల ప్రతిరోజూ మీడియా ముందుకొచ్చి గంటలకొద్దీ ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు. పరిపాలనాదక్షత అంటే పేద, సామాన్య, బడుగు బలహీన వర్గాలు, రైతాంగానికి ప్రయోజనం చేకూర్చడం. అంతేతప్ప.. స్వప్రయోజనాలు, స్వపక్ష ప్రయోజనాలకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడం కాదు.  

జిమ్మిక్కులతో ‘కృత్రిమ ఇమేజ్‌’ 
1995 ఆగస్ట్‌లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను గద్దెదింపి అడ్డదారిలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన చంద్రబాబుకు అత్యవసరంగా తాను ఎన్టీఆర్‌ కంటే మించిన నేతగా ప్రజలముందుకు వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడింది. ఆ క్రమంలో పబ్లిసిటీతో ఇమేజ్‌ పెంచుకోవడానికి రోజుకో జిమ్మిక్కు చేయడం.. దానికి అనుకూల మీడియా గొడుగుపట్టడం రివాజుగా ఉండేది. ఏ కార్యక్రమం నిర్వహించినా తనకొక్కడికే పేరు రావాలన్న తాపత్రయం చంద్రబాబుది. అధికారాన్ని పూర్తిగా కేంద్రీకృతం చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే. వీడియో కాన్ఫరెన్స్‌లంటూ కలెక్టర్లు మొదలుకొని హెచ్‌ఓడి స్థాయి అధికారులతో నేరుగా తానే గంటల తరబడి మాట్లాడేవారు.

జిల్లా ఎస్పీలు, డీఎస్పీలకు కూడా తానే ఆదేశాలిచ్చేవారు. క్యాబినెట్‌ మంత్రులు నిమిత్తమాత్రులుగా, ప్రేక్షకుల్లా మిగిలిపోయేవారు. మంత్రులెవరైనా కలెక్టర్‌కో, ఎస్పీకో ఫోన్‌ చేస్తే.. ‘‘ముఖ్యమంత్రిగారు మాతో మాట్లాడారు’’ అనే సమాధానం వారికి లభించేది. చంద్రబాబు తమకు ఎటువంటి గౌరవం లేకుండా చేస్తున్నారంటూ మంత్రులు లోలోపల వాపోయే పరిస్థితి ఉండేది. చంద్రబాబు వెళ్లకపోతే.. ఏ కార్యాలయంలో కూడా దుమ్ము దులపడం లేదనేటట్లుగా ప్రచారం సాగింది. ‘జన్మభూమి’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ఒక్కడే కష్టపడుతున్నట్లు మిగతా క్యాబినెట్‌ మంత్రులు, అధికార యంత్రాంగానికి పాత్ర ఏమీలేనట్లు కొన్ని పత్రికలు రాసేవి.

అసెంబ్లీ సమావేశాల్లో కూడా చంద్రబాబు ఏకపాత్రాభినయం నిరాఘాటంగా సాగిపోయేది. అది  గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం కావచ్చు.. బడ్జెట్‌పై చర్చ కావచ్చు.. ద్రవ్యవినిమయబిల్లుపై ముగింపు ఉపన్యాసం కావచ్చు.. చివరకు మంత్రులకు సభ్యులు వేసిన ప్రశ్నకు సైతం.. జవాబును సంబంధిత మంత్రితో మొదలుపెట్టించడం.. 5 నిమిషాలు గడవకముందే చంద్రబాబు జోక్యం చేసుకొని.. గంటల తరబడి మాట్లాడటం షరామామూలుగా ఉండేది. రాజకీయం మొత్తం అంతా తన చుట్టూనే తిరగాలన్న బాబు యావ వల్ల.. ప్రభుత్వంలో ఎవ్వరూ తమ శాఖలపై మనసుపెట్టి పనిచేయని పరిస్థితి. రాష్ట్రంలో తుపాన్లు, వరదలు వస్తే బాబు తక్షణం అక్కడకు వెళ్లిపోయేవారు. తుపాను ప్రాంతంలో కూర్చొని అధికార యంత్రాంగంతో పునరావాస పనులను తానొక్కడే కష్టపడి పనిచేయిస్తున్నట్లు వార్తలు రాయించుకునేవారు. 2015లో సంభవించిన ‘హుద్‌హుద్‌’ తుపాను వల్ల విశాఖ దెబ్బతింటే.. అక్కడే తను ఉండి.. విశాఖను బాగుచేశానని, అది తన ఘనతేనని చంద్రబాబు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఎవరికీ పేరు రాకూడదు. తానొక్కడే హైలైట్‌ కావాలి. ఇదీ బాబు ఆలోచనా విధానం.

విజన్‌లేని చంద్రబాబు
చంద్రబాబు గొప్ప ‘విజన్‌’ ఉన్న నాయకుడన్న ప్రచారం కూడా అనుకూల మీడియా సృష్టే. చంద్రబాబు 1999లో ‘విజన్‌ 2020’ అనే ఓ దార్శనిక పత్రాన్ని మెకిన్సే అనే విదేశీ సంస్థతో తయారు చేయిం చారు. 20 ఏళ్లల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్వర్ణగ్రామాలు (బంగారు గ్రామాలు)గా, అన్ని పట్టణాలను స్వర్ణపట్టణాలు చేసి.. అంతి మంగా రాష్ట్రాన్ని స్వర్ణమయం చేస్తానని అందుకు కొన్ని లక్ష్యాలను ఏర్పర్చుకున్నానంటూ గొప్ప కలను ఆవిష్కరించారు. దీంతో 20 ఏళ్లూ తనకే ప్రజలు  అధికారాన్ని అప్పజెబుతారన్నది చంద్రబాబు లాజిక్‌. కానీ కొన్ని రోజుల్లోనే చంద్రబాబు విజన్‌ అంతరార్థం బయట పడింది. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడంతోనూ, విద్యుత్‌ చార్జీలను విపరీతంగా పెంచడంతోనూ పెద్దఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉపాధి కోసం పేదలు, కూలీలు వలస బాటపట్టడంతో వేలాది గ్రామాలు వల్లకాడుగా మారాయి. ఆ సందర్భం లోనే ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అంటూ గ్రామీణ ప్రజల కడగండ్లను పాట రూపంలో కళ్లకు కట్టి.. ప్రజల కళ్లు తెరిపించారు. 

కరవుకాలంలో వేల కోట్లతో క్రీడల నిర్వహణ
చంద్రబాబు విజన్‌ ఎంత గొప్పదంటే.. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే.. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో తన అనుయాయులు ముందుగానే కారుచౌకగా కొన్న భూములకు విలువ పెంచడం కోసం.. జీఎంసీ బాలయోగి స్టేడియంను నిర్మించి.. దానిలో జాతీయ క్రీడలు, ఇండోఆఫ్రికన్‌ క్రీడల్ని నిర్వహించారు. ఆ వంకతో గచ్చిబౌలి, పరిసర ప్రాంతాలలో వందల కోట్లు ఖర్చు చేసి భారీగా మౌలిక వసతులు తీర్చిదిద్దారు. క్రీడోత్సవాలు నిర్వహించాక క్రీడాకారుల కోసం కట్టిన అపార్ట్‌మెంట్‌లను వేలం వేశారు. ఆ తర్వాత కొన్ని ఐటీ కంపెనీలను అక్కడే నెలకొల్పారు. ఫలితంగానే.. ఆ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ ధరలు ఆకాశానికి ఎగసి.. తర్వాతి కాలంలో మురళీమోహన్‌కు చెందిన జయభేరిలాంటి సంస్థలకు,బాబు బినామీలకు లాభాలపంట పండించాయి. బాబు ‘విజన్‌’ కేవలం, తను, తన సన్నిహితులు బాగుపడడానికి రూపొందించినదే.
విజన్‌ ఉన్నది వైఎస్సార్‌కే
రాష్ట్రాభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల గురించి తపిం చిన ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, పేద బడుగుబలహీన వర్గాల విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, సాగునీటి రంగానికి ప్రాధాన్యం కల్పించడం, పేద వృద్ధాప్య, వితంతు పెన్షన్ల మొత్తాన్ని పెంచడం.. సబ్సిడీ బియ్యం ధర తగ్గింపు.. ఇలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్ని రూపొందించి దార్శనికత కలిగిన నాయకుడిగా ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకోగలిగారు. ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాలు వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేస్తున్నాయి.  చంద్రబాబు ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్నైనా.. దేశంలో ఏ ప్రభుత్వమైనా అమలు చేస్తున్నదా? చంద్రబాబు ఐదేళ్ల కాలంలో అధికారాన్ని పూర్తిగా దుర్విని యోగం చేశారు.

హైదరాబాద్‌లో లాగే అమరావతిలో కూడా అదే ఫార్ములా అమలు చేయడానికి ప్లాన్‌ చేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా కారు చౌకగా సుమారు నాలుగున్నర వేల ఎకరాల భూములను కొనుగోలు చేయించారు. కానీ తన పాలనలో జరగని అభివృద్ధిని కొత్త ప్రభుత్వం లక్షాపాతిక కోట్ల నిధులను కుమ్మరించి చేయాలని డిమాండ్‌ చేయడంలో హేతుబద్ధత లేదు. ప్రభుత్వం ఒక్క పైసా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని, రైతులిచ్చిన భూముల్లో 5,000 ఎకరాలను అమ్మితే.. 2.25 లక్షల కోట్ల రూపాయలు వస్తాయని చంద్రబాబు లెక్కలు చెబుతున్నారు. అంటే, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా తను, తన అనుయాయులు కారుచౌకగా అమరావతి చుట్టుపక్కల కొనుక్కున్న సుమారు 4,500 ఎకరాలకు 2 లక్షల కోట్లు వస్తుం దని చంద్రబాబు ఒప్పుకున్నట్లయింది. కనుకనే, అమరావతిలోనే.. రాజధాని నిర్మాణం చేయాలని చంద్రబాబు మొండిగా వాదిస్తున్నారు. ఈ ప్రభుత్వంపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. మిగతా ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు. అమరావతిలో తమ భూములకు విలువ పెరగాలన్నదే చంద్రబాబు పంతం. ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నిన్నటి వరకు చంద్రబాబును పాలనాదక్షుడిగా చిత్రీకరించిన అనుకూల మీడియా.. ప్రస్తుతం చంద్రబాబు సాగిస్తున్న కృత్రిమ ఉద్యమానికి కూడా గొడుగుపడుతున్నది. విజ్ఞులైన ప్రజలు అన్నీ గ్రహిస్తారు!

సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement