విశ్లేషణ
మొదటిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటినుంచి, ఆయన విధానాలు తన స్వప్రయోజనాల చుట్టూ, సంపన్నుల ప్రయోజనాల చుట్టే తిరిగాయి. విద్యుత్ ట్యారిఫ్ పెంచి ఆందోళనాకారులపైన, రైతు వ్యతిరేక విధానాలు ప్రవేశపెట్టి రైతు ఆందోళనాకారులపైన కాల్పులు జరిపించారు. ఇక కాంగ్రెస్‌ను వదిలి టీడీపీలో చేరినప్పటి నుంచీ ఆయన వైఖరి కపటపూరితమైనదే. మొదట ఎన్టీఆర్ పట్ల, తర్వాత తనతో మైత్రి చేసిన కమ్యూనిస్టుల పట్ల, బీజేపీ పట్ల, కాపుల వంటి ప్రధాన కుల సమాజాల పట్ల, అల్ప సంఖ్యాక వర్గాల పట్ల ఎప్పటికప్పుడు తన రాజకీయ అవసరాలను బట్టి అవకాశవాద ఎత్తుగడలను అనుసరిస్తూ వస్తున్నారు. అందుకే, చంద్రబాబును చిత్తు చేసిందెవరు? స్వయంగా ఆయన పరిపాలనా విధానాలు, వాటి పట్ల సామాన్యుల ఆగ్రహం!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమస్యంతా ఆయన విధానాలతోనే. 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటినుంచి తర్వాత 29 సంవత్స రాల సుదీర్ఘ కాలమంతా ఆయన రాజకీయ విధానాలు, పరిపాలనా విధానాలు కూడా తన స్వప్రయోజనాల చుట్టూ, సంపన్నుల ప్రయోజనాల చుట్టే తిరిగాయి. సామాన్యుల గురించి కొన్ని కపటపు మాటలు మినహా వారి ప్రయోజనాల కోసం ఆయన ఎప్పుడూ పని చేయలేదు.ఆయన 1995లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం సామాన్యుల ఆదరణ పొంది నడుస్తున్నది.
మరొక వైపు, 1991 నుంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ఇంకా వేగం పుంజుకోవలసి ఉంది. చంద్రబాబు విషయానికి వస్తే, తనకు సంపన్నులపై గల ప్రేమ కారణంగా ఆర్థిక సంస్కరణలపై అమితమైన ప్రేమ, ఎన్టీఆర్ సంక్షేమ పథకాలపట్ల విముఖత ఏర్పడ్డాయి. దానితో జరిగిందేమిటి? సామాన్యులకు ఇంది రమ్మ రాజ్యానికి మించి దేవునిగా మారిన ఎన్టీఆర్ పథకాలను దెబ్బ తీస్తూ పోయారు. మరొకవైపు ఆర్థిక సంస్కరణలను, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ నిర్దేశాలను కేంద్రంతో సహా మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రమూ చేయనంతగా తలకెత్తుకున్నారు.
తనను తాను ముఖ్యమంత్రిని కాను, ఒక కంపెనీ నిర్వాహకుని తరహా సీఈఓను అని ప్రకటించుకుని, స్వదేశంతోపాటు విదేశాలలో కూడా పెట్టుబడిదారులకు దేవునిగా మారారు. విద్యుత్ ట్యారిఫ్ పెంచి ఆందోళనాకారులపైన, రైతు వ్యతిరేక విధానాలు ప్రవేశపెట్టి రైతు ఆందోళనాకారులపైన కాల్పులు జరిపించారు. చివరకు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రపంచబ్యాక్ అధికారులు పరిశీలించి ఆమోదించే ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల దిగ్భ్రాంతికర పరిస్థితులను తీసుకు వచ్చారు.
ఇక సామాన్యులైతే ఎన్టీఆర్ సంక్షేమం అడుగంటగా ఏమీ చేయలేని దిక్కు తోచని స్థితికి లోనయ్యారు. వారు మారుమూల గ్రామాల వరకు సైతం చంద్రబాబును ‘బ్యాంకు బాబు’ అని పిలవ సాగారు. ఇంత జరుగుతుండినా చంద్రబాబు తనకు దేశ, విదేశీ వ్యాపార వర్గాల నుంచి వెల్లు వెత్తుతుండిన ప్రశంసలతో పొంగిపోయారు. కనుకనే ఆయన 2004 ఎన్నికలలో వైఎస్ రాజశేఖరరెడ్డి చేత దారుణంగా ఓడినపుడు ప్రపంచ మంతా నిర్ఘాంతపోయింది.
చంద్రబాబును ఆ విధంగా చిత్తు చేసిందెవరు? తెరముందు కన్పించింది రాజశేఖరరెడ్డి. తెర వెనుక పనిచేసింది స్వయంగా చంద్ర బాబు పరిపాలనా విధానాలు, వాటి పట్ల సామాన్యుల ఆగ్రహం.ఇందుకు పరాకాష్ఠగా కన్పించిన మరొక దృశ్యాన్ని చూడండి. 2004 ఎన్నికల సమయంలో ఆయనపై అలిపిరి వద్ద నక్సలైట్లు హత్యా యత్నం చేశారు. దానివల్ల కలిగిన సానుభూతితో తను గెలిచి తీర గలడని పలువురు భావించారు. అదీగాక ఆయన అంతవరకు తీవ్ర నిర్లక్ష్యం చేసిన రైతులపై అకస్మాత్తుగా వరాలు ప్రకటించారు. కానీ ఆ సానుభూతిగానీ, ఈ వరాలు గానీ ఓటమి నుంచి కాపాడలేక పోయాయి. చంద్రబాబు పరిపాలనా విధానాలపట్ల సామాన్యులలో పేరుకుపోయిన వ్యతిరేకత ఎంతటిదో దీనినిబట్టి గ్రహించవచ్చు.
చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాల గురించి, తనకు ముందటి కాంగ్రెస్, ఎన్టీఆర్ విధానాలతో... తన తర్వాతి రాజశేఖరరెడ్డి విధా నాలతో పోల్చుతూ, ఆయా పాలనలపట్ల సామాన్య ప్రజల అభి ప్రాయాలను కూడా పోల్చుతూ ఒక విధానపరమైన అధ్యయనం జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. పైన చర్చించినదంతా ఒక స్థూలమైన చిత్రం మాత్రమే. చెప్తూ పోవాలంటే ఇంకా ఎంతైనా ఉంది. అందులో ఒక ముఖ్యమైనది తన విజన్–2020 పత్రం. మొదట ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఆయన ఓటమి వల్ల ఏ విజన్లూ అమలుకు రాలేదు.
కానీ అందులో పేర్కొన్న ఆయన ప్రణాళికలు అన్నీ అంతిమ సారాంశంలో సంపన్న వర్గాలకు లాభం చేకూర్చి, సామాన్యులను ఉన్న చోట ఉంచేవే. కాకపోతే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సిద్ధాంత కర్తలు మొదటినుంచి సూచిస్తూ వచ్చిన ట్రికిల్ డౌన్ థియరీ ప్రకారం సామాన్యులకు కొన్ని ఎంగిలి మెతుకులు విదల్చటం వంటిది మాత్రం అందులో చూడవచ్చు.సంపదలన్నీసంపన్నులకే దోచిపెడితే సామాన్యుల నుంచి వ్యతిరేకత పెరిగి ఎదురు తిరుగుతుందని ముందే గ్రహించిన సంస్కరణల మేధావులు ట్రికిల్ డౌన్, రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్ వంటి తరుణోపాయాలను కూడా మొదటనే సిఫారసు చేశారు.
ఇంకా చెప్పాలంటే ఇందుకు కాపీ రైట్ జర్మనీ మొదటి ఛాన్స్‌లర్ బిస్మార్క్ (1815–98)ది. ప్రస్తుత సందర్భంలో గమనించవలసిందేమంటే, ఈ రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్ అన్నది సంస్కరణల పట్ల ప్రజల వ్యతిరేకతను ఒక పరిమితిలో ఉంచేందుకు తప్పనిసరి అన్న ఉపాయాన్ని కొందరు పాలకులు గుర్తించి పాటించగా, బాబు వంటి వారు ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ నియంతల తరహాలో పక్కకు తోసేశారు.
తన ఈ స్వభావాన్ని చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా (2014–19) కూడా మార్చుకోలేదు. అందువల్లనే ఆయన పార్టీ గెలిచిన సీట్లు 102 (2014) నుంచి 23 (2019)కి పడిపోయాయి. అందుకు కారణం ఎవరితోనో పొత్తులు ఉండటం లేకపోవటంకాదు. నిజానికి ఆ కాలమంతా ఏపీ లోని ఇతర పార్టీల బలం నామమాత్రమే. కనుక, చంద్రబాబును అంతగా పరాభవించిన కారణాలు ఆయన ప్రజా వ్యతిరేక విధానాలు, సంపన్నుల అనుకూల విధానాలు మాత్రమే. మొదలు అనుకున్నట్లు టీడీపీ అధ్యక్షుడు కేవలం తన ప్రజా వ్యతిరేకమైన సహజ స్వభావాన్ని మార్చుకోలేక 2019లో మరొకసారి మట్టికరిచారు.
ఇక రాజకీయ విధానాల విషయానికి వస్తే, చంద్రబాబు తీరు ఆయన కాంగ్రెస్‌ను వదిలి టీడీపీలో చేరినప్పటి నుంచి గత 29 సంవ త్సరాలుగా కపటపూరితమైనదే. మొదట ఎన్టీఆర్ పట్ల, తర్వాత తనతో మైత్రి చేసిన కమ్యూనిస్టుల పట్ల, బీజేపీ పట్ల, కాపుల వంటి ప్రధాన కుల సమాజాల పట్ల, అల్ప సంఖ్యాక వర్గాల పట్ల, ఒక దశలో టీఆర్‌ఎస్ పట్ల ఆయన ఎప్పటికప్పుడు తన రాజకీయ అవసరాలను బట్టి అవకాశవాద ఎత్తుగడలను అనుసరిస్తూ వస్తున్నారు.
ఎన్టీఆర్ ప్రాపకంవల్ల పైకి వచ్చి ఆయనకు ద్రోహం చేసి చివరకు మానసిక క్షోభతో మరణించేట్లు చేశారు. కమ్యూనిస్టులను టూరిజం తప్ప కమ్యూనిజం అనేదేమీ లేదని ఈసడించారు. బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంతెంత దూషించారో, హైదరాబాద్‌లో అడుగు పెడితే అరెస్టు చేస్తామన్నారో లెక్కలేదు. ఈ ధోరణి ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ఇటీవల మళ్లీ ప్రవేశం కొరకు తాపత్రయ పడటం వరకు కొనసాగింది. కాపుల వంటి సమూహాలను ఎప్పుడూ చదరంగంలో పావులుగానే చూశారు.
చంద్రబాబు రాజకీయ విధానాలకు ప్రస్తుత ఎన్నికల సమయంలో మరొకమారు సామాన్యుల నుంచి ప్రశ్నార్థకత ఎదురవు తున్నది. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన తను విమర్శిస్తున్నట్లు నిజంగానే అభివృద్ధి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆయన జనసేన, బీజేపీలతో పొత్తు కోసం నెలల తరబడి అంతగా ఎందుకు వెంపర్లాడినట్లు? ఒక్క మాటలో చెప్పాలంటే, మూడు సుదీర్ఘ దశాబ్దాలుగా బాబుతో సమస్యంతా ఆయన విధానాలతోనే!
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment