విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మీద జరిగిన అత్యాచారం అత్యంత ఘోరం! దానికి కారకులైన ప్రతి ఒక్కరికీ శిక్ష ఉంటుంది. పాలనా యంత్రాంగం, పోలీసు వ్యవస్థ, న్యాయస్థానాలు తమ పని తాము చేస్తాయి. కానీ, ఇంతలోనే చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని భయపెడుతూ... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వందలాది మంది అనుచరులతో దౌర్జన్యంగా ఆమె బెడ్ దగ్గరకు వెళ్లి నినాదాలు చేయించడం, ఆసుపత్రిలో యుద్ధ వాతావరణం సృష్టించి... రోగులు, వారి అటెండెంట్లు భయపడేలా ప్రవర్తిం చడం ఎంతవరకు సమంజసం? ఆసుపత్రి మీద ఏదో దాడి జరుగుతోందనే భయాన్ని సృష్టించడం సబబేనా? అత్యాచార బాధితురాలిని పరామర్శించే విధానం ఇదేనా? 14 ఏళ్ళు ముఖ్య మంత్రిగా, 13 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా... ఈ మాత్రం తెలియదా? చంద్రబాబు వందలాది మందిని తీసుకు వెళ్ళటాన్ని పరామర్శ అంటారా, దొమ్మీ అంటారా? ఆ బాలిక దగ్గరకు ఏకంగా కెమెరాలను తీసుకుని, వందల మందితో వెళ్ళటాన్ని ఓదార్పు అంటారా? లేక దిగజారుడు రాజకీయం అంటారా?
ఓ అత్యాచార బాధితురాలిని... అది కూడా సామూహిక లైంగిక దాడికి గురైన మానసికంగా ఎదగని ఒక పాపను పరామర్శించటానికి ఇలాగేనా వెళ్ళేది? ఏ చిన్న ఘటన జరిగినా ప్రభుత్వంపై బురద జల్లడానికి వాడుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్యే. అందుకే ఈ అమానవీయ అత్యాచార సంఘటననూ రాజకీయం చేయాలనే అక్కడికి వెళ్లారని ఆయన ప్రవర్తన చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. బాబు అనైతిక ప్రవర్తనను సభ్య సమాజం ఆమోదిస్తుందా? చట్టం ఒప్పు కుంటుందా? తాను ఇంత మందిని వెంటబెట్టుకుని చేసిన దౌర్జన్యం ప్రభావం ఆ పాపమీద ఎలా ఉంటుందో ఆయన ఆలోచించారా? అసలు ఆ పాప పరిస్థితి ఏమిటి?
అత్యాచార బాధిత బాలికను వీడియో తీయటాన్ని ఆయన ఎలా అనుమతించారు? ఎందుకు ప్రోత్సహించారు? ఇది నేరం కాదా? ఆయన దుందుడుకు ఓదార్పు కార్యక్రమంలో ఒకటి కాదు... అనేక నేరాలు చోటుచేసుకున్నాయి. ఈ నేరాలన్నింటి మీదా కేసులు, విచారణలు తప్పనిసరిగా జరగాలి. అత్యాచార బాధితురాలి ఫొటో గానీ, పేరుగానీ ప్రచురించకూడదని మీడియాకు కూడా ఆంక్షలున్నాయే... మరి చంద్రబాబు బాధిత బాలిక ప్రైవసీని ఇలా తుంగలో తొక్కి తీరని వ్యధను మిగల్చడం క్షమార్హమేనా? ఆయనా, ఆయన అనుచరుల బాధ్యతా రహిత ప్రవర్తన వల్ల బాధితురాలికీ, ఆమె కుటుంబ సభ్యులకూ ఎదురయ్యే సమస్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? (చదవండి: శ్రమ విలువ తెలుసు కాబట్టే...)
అక్కడే ఉన్న మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ మీద తన అనుచరులు నానా దుర్భాషలాడు తుంటే... వారిని వారించకపోగా చంద్రబాబే స్వయంగా ఆమెను బెదిరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత జరిగినా చంద్రబాబు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకపోవడం విడ్డూరం. రాజకీయంగా లబ్ధి పొందాలన్న యావ తప్ప, ఆ పాప యోగక్షేమాల పట్ల నిజంగా ఎటువంటి ఆత్రుతా ఆయనలో కనిపించకపోవడం బాధాకరం. మహిళా కమిషన్ నోటీసులు అందుకున్న చంద్రబాబు నేడు కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని ఆయన క్షమాపణ చెప్పాలి. (చదవండి: జగన్ స్కీములు చంద్రబాబుకు సవాలే!)
- జయశ్రీ రెడ్డి
ఏపీ ఉమెన్స్ కమిషన్ సభ్యురాలు
Comments
Please login to add a commentAdd a comment