భారత్‌లో చిప్ డిజైనర్‌లకు కొదవ లేదు. అలాగని చిప్‌లు తయారు చేసే సంస్థలు విస్తృతంగానూ లేవు. విద్యుత్ ఉప కరణాలను విజ్ఞతతో పనిచేయించే కీలకమైన అర్ధవాహకాలే (సెమీకండక్టర్) చిప్‌లు. కంప్యూటర్‌లు, స్మార్ట్ ఫోన్‌లు, గేమింగ్ సాఫ్ట్‌వేర్, శాటిలైట్స్, వైద్య సామగ్రి... ఒకటేమిటి, దైనందిన జీవితాలను దాదాపుగా మొత్తం ఈ చిప్‌లే వెన కుండి నడిపిస్తున్నాయి. ఒక్క కంప్యూటర్ చిప్ మీదే ఆయా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఏటా 37.4 లక్షల కోట్ల బిజి నెస్ చేస్తున్నాయి. అయినప్పటికీ అన్ని దేశాలలోనూ చిప్‌ల కొరత ఉంది. ఆ కొరత భారత్‌కి మరింతగా ఉంది.
చిప్ డిజైనింగ్‌లోని దశలు, ఒక ఆకాశ హర్మ్యాన్ని నిర్మించడంలోని దశలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటాయి. అంత పెట్టుబడి పెట్టడం దుస్సాహసమే. ప్రభుత్వం కూడా ఒక చెయ్యి వెయ్యందే లాభదాయకమైన ఉత్పత్తి సాధ్యపడని రంగమిది. చిప్ తయారీ కర్మాగారాలను ‘ఫ్యాబ్రికేషన్ ఫౌండ్రీలు’ అంటారు. వాడుకలో ‘ఫ్యాబ్స్’. భారత్‌కు సొంత ఫ్యాబ్స్ లేవంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అరకొరగా ఉన్నప్పటికీ వాటిల్లో విడి భాగాలుగా తప్ప చిప్‌ల ఉత్పత్తి పూర్తిగా మన దగ్గరే జరగదు. అత్యంత కీలక మైన రక్షణ, రైల్వే, అంతరిక్ష, ఆర్థిక రంగాల అవసరాల కోసం భారత్ ప్రస్తుతం యూఎస్‌ఏ, తైవాన్, నైరుతి ఆసియా దేశాల్లోని ఫ్యాబ్స్‌పై ఆధారపడి ఉంది. ‘‘డిజైన్ మనదే అయినా, తయారీ ఇతర దేశాలది కావడంతో చిప్‌ల ఐపీ ఎంతోకాలం మనదవదు. దాంతో దేశభద్రత సమస్యలు తెలెత్తే ప్రమాదం ఉండదని కచ్చితంగా చెప్పలేం’’ అని డీఆర్‌డీవోలోని ఒక సీనియర్ శాస్త్రవేత్త అన్నారు.
వాస్తవానికి దశాబ్దాల క్రితమే మనకో సొంత సెమీ కండక్టర్ ఫ్యాబ్ ఉండాల్సింది. 1987లో ఇప్పుడున్న అత్యాధునిక చిప్ తయారీ పరిజ్ఞానానికి మనం రెండేళ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాం. ఇప్పుడా దూరం రెండేళ్ల నుంచి పన్నెండు తరాల వెనక్కు దాటిపోయింది. అత్యంత కఠినమైన అనుమతి నిబంధనలు, అవినీతి, మౌలిక సదుపాయాల లేమి, అధికార యంత్రాంగంలో అలసత్వం, నాయకత్వంలో దార్శనికత లోపించడం... ఇవన్నీ దేశవాళీ ఫ్యాబ్‌ల ఏర్పాట్లను వెనక్కు తోస్తూ వచ్చాయి. సిలికాన్ విప్లవం ప్రారంభమైన 1960లలోనే ‘ఫెయిర్‌చైల్డ్ సెమీ కండక్టర్’ సంస్థ భారత్‌లో ప్లాంట్‌ను తెరిచేందుకు ముందుకు వచ్చింది. అయితే మన ‘బ్యూరోక్రటిక్ బద్ద కాలు’ ఆ సంస్థను మలేషియా పారిపోయేలా చేశాయి. 1962 ఇండో–చైనా యుద్ధం తర్వాత ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్’ సిలికాన్, జర్మేనియం ట్రాన్సిస్టర్‌ల తయారీ ఫ్యాబ్‌ను నెలకొల్పగలిగింది. ‘‘అప్పుడు మన సిలికాన్ ట్రాన్సిస్టర్‌లకు ఎంత డిమాండ్ ఉండేదంటే... ప్రపంచం లోని పెద్ద పెద్ద కంపెనీలు సైతం అర్డర్లు ఇచ్చేందుకు క్యూలో వేచి ఉండేవి’’ అని బీఈఎల్ రిటైర్డ్ డీజీఎం ఎన్.రవీంద్ర గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని ఫ్యాబ్‌లు భారత్‌లో సెమీకండక్టర్‌ల ఉత్పత్తి ప్రారంభించినప్పటికీ చైనా, తైవాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులు మనకన్నా చౌకగా ఉండటంతో మనవి ఎంతోకాలం మనుగడ సాగించలేక పోయాయి.
చైనా, తైవాన్ ఈ ఫ్యాబ్‌ల తయారీలోకి రాకముందే చండీగఢ్‌లో మనకు ‘సెమీకండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్’ (ఎస్íసీఎల్) ఉండేది. 1984లో 5000 నానో మీటర్ల ప్రాసెస్ సామర్థ్యంతో మొదలైన ఎస్íసీఎల్ కేవలం ఏడాదీ రెండేళ్లలో 800 నానో మీటర్ల అదనపు ప్రాసెస్ టెక్నాలజీని సాధించ గలిగింది. దురదృష్టం... 1989లో కాంప్లెక్స్ మొత్తం అగ్ని ప్రమాదంలో బుగ్గిపాలైంది. ఇస్రో దానిని పునరుద్ధ రించ గలిగింది గానీ, పునరుజ్జీవింప జేయలేకపోయింది.
2005 మధ్యకాలంలో బహుళజాతి సంస్థలు కొన్ని మన దేశంలో చిప్‌ల తయారీ కర్మాగారాలను ఏర్పాటు చేసేం దుకు ముందుకు వచ్చినప్పటికీ అనుమతుల పరంగా అను కూల, తక్షణ స్పందనలు లేకపోవడంతో అవి చైనాకు తరలివెళ్లాయి. వాటితో పాటే 4000 ఉద్యోగ అవకాశాలు కూడా! 2012–13లో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం దేశంలో రెండు ఫ్యాబ్‌లను నిర్మించేందుకు 39 వేలకోట్ల రూపా యలను కేటాయించింది. గుజరాత్ ప్రభుత్వం ఆ ఫ్యాబ్‌ల కోసం గాంధీనగర్‌లో 300 ఎకరాల స్థలాన్ని కూడా సిద్ధం చేసింది. ఐబీఎం, హెచ్‌ఎస్‌ఎంసీతో పాటు జేపీ గ్రూప్ బిడ్‌లకు ఆసక్తి చూపాయి గానీ పెట్టుబడిదారులకు భవిష్యత్ లాభాలపై నమ్మకం కలిగించలేకపోవడం వల్ల అవి బిడ్‌లను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ‘‘ప్రతి పదేళ్లకు ఒక ఫ్యాబ్ సైకిల్ ఉంటుంది. దాన్ని వదిలేసుకుంటే మళ్లీ పదేళ్ల వరకు ఆ అవకాశం రాదు. ఇదొక ఖరీదైన భారీ వ్యాపారం. చిప్‌ల అప్‌గ్రేడెడ్ సామర్థ్యంతో పాటు ఉత్పత్తి సామర్థ్యమూ అవసరాలకు దీటుగా ఉండాలి. అప్పుడే మార్కెట్‌లో నిలుస్తాం’’ అంటారు ఇన్నటెరా సహ వ్యవస్థాపకులు ఉమా మహేశ్.
భారత్‌లో ఇప్పుడు ఫ్యాబ్‌ల ఏర్పాటుకు పరిస్థితులు మెరుగయ్యాయనే చెప్పాలి. నాణ్యమైన విద్యుత్తు, నీరు, మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాలను భారత్ నమ్మకంగా అందించగలదు. అయితే అందించగలనన్న నమ్మకం కలిగించాలి. స్టార్టప్‌లను ఆకర్షించాలి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఫ్యాబ్ నిర్మాణం కోసం గత డిసెంబరులో ‘మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’... పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచింది. చిప్‌ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీఎస్‌ఎంసీ (తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ)తో కలిసి, టాటా గ్రూప్ ఒక ఫ్యాబ్‌ను నెలకొల్పే అవకాశాలు కనిపి స్తున్నాయి కనుక మన మంత్రిత్వశాఖ చురుగ్గా అడుగులు వేయాలి. తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించని చైనా... ఆ దేశంపై ఏ రోజైనా దాడి చేయవచ్చు. ఆ లోపే టీఎస్‌ఎంసీకి భారత్ ఒక సురక్షిత ప్రదేశం అనే నమ్మకాన్ని తైవాన్‌కి కలిగించాలి. ఇది వ్యాపార వ్యూహం కాదు. ప్రపంచానికి అవసరమైన చిప్‌ల తయారీలో పరస్పర సహకారం. భారత్‌కు సమకూరే టెక్నాలజీ బలం. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ‘సన్‌రైజ్ కేటగిరీ’ కింద ప్రభుత్వం కేటాయించిన రూ. 7.5 లక్షల కోట్లలో ఫ్యాబ్‌లకూ వాటా ఉంది కనుక ఒక కొత్త ఫ్యాబ్ కోసం మనం నమ్మకంగా ఎదురు చూడవచ్చు.
– చూడీ శివరామ్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment