విశ్లేషణ
ఐక్యరాజ్యసమితి, అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినప్పటికీ ఆ దేశంతో శతాబ్దాల తరబడి కొనసాగిస్తున్న నాగరికతతో ముడిపడిన సంబంధాలను మనం కొనసాగించాలి. ఆంక్షల ముట్టడినుంచి బయటపడటానికి చైనా పెట్టుబడులను కూడా ఇరాన్ అనుమతించడం మనకు ఇబ్బంది కలిగించవచ్చు కానీ, ఇరాన్‌తో దీర్ఘకాలికమైన దార్శనికతను భారత్ కొనసాగిస్తూ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఆ దేశంతో తన సంబంధాలను నిర్వహించాలి. కరోనా నేపథ్యంలో కనుగొనే వ్యాక్సిన్‌లు, వైద్య సామగ్రిని కూడా ఇరాన్‌కు భారత్ సరఫరా చేయడం ఇరుదేశాల మధ్య సంబంధాలను దృఢతరం చేస్తుంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం భౌగోళికంగా, వ్యూహాత్మకంగా అందించిన అనుకూలతను భారత్ లాభసాటిగా మార్చుకోవాలి.
ఇరాన్‌తో భారత్ సంబంధ బాంధవ్యాలు రెండు దేశాల మధ్య చారిత్రక, నాగరికతా బంధాల బలంపై ఆధారపడి ఏర్పడుతూ వచ్చాయి. ఇవి విద్యాపరమైన స్కాలర్‌షిప్‌లు, ఆధ్యాత్మిక యాత్రలు, కళ, సినిమా, సాహిత్యం వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి. అనేక అంశాల్లో పరస్పర ఆధారితమై ఉన్న నేటి ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మన భౌగౌళిక సాన్నిహిత్యాన్ని అనుకూలంగా మల్చుకోవడం ద్వారా ఈ బాంధవ్యాన్ని మన రెండుదేశాలూ కొనసాగించాల్సి ఉంది. ఓడరేవులు, రైళ్లు, రహదారులు, విమానాశ్రయాల నిర్మాణంతో సహా ఇరుదేశాల మధ్యనే కాకుండా మొత్తం రీజియన్‌లో బహుముఖ కనెక్టివిటీని ప్రోత్సహించడం అనేది ఈ చిరకాల సంబంధ బాంధవ్యాలను కొనసాగించే మార్గాల్లో ఒకటి.
ఈ ప్రయత్నంలో చాబహార్ రేవు నిర్మాణం అత్యంత కీలకస్థానంలో ఉంటోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా 400 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై చైనా ఇటీవలే ఇరాన్‌కు ప్రతిపాదించినట్లు తాజా వార్తలు నివేదించాయి. ఈ మొత్తంలో గణనీయమైన భాగం అంటే 120 బిలియన్ డాలర్లను ఇరాన్ రవాణా, వస్తుతయారీ మౌలిక వసతుల కల్పనకు చైనా వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇరాన్‌తో భారత ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాన్ని సైతం పక్కనపెట్టేయగలదు.
నా అభిప్రాయం ఏమిటంటే, ఈ తాజా పరిణామాల పట్ల ప్రతి స్పందించడానికి ఇది సమయం కాదు. అమెరికా విధించిన తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు, ప్రస్తుత కోవిడ్ సంక్షోభం కారణంగా తనపై కలుగుతున్న ఒత్తిడి ప్రభావం వల్లే చైనాతో అంత సన్నిహిత సంబంధంలోకి ఇరాన్ ప్రవేశించాల్సి వస్తోంది. పైగా చైనా ఇప్పుడు ప్రపంచం రంగస్థలంపై కొత్త ప్లేయర్‌గా ఉంటోంది. తన వద్ద ఉన్న అపారమైన వనరులతో చైనా ప్రస్తుతం ఉనికిలో ఉన్న ప్రపంచ అమరికను మార్చడానికి ప్రయత్నించవచ్చు.
ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు
నేటి ప్రపంచంలో ఇరాన్ స్థితిని అర్థం చేసుకోవడానికి, 2006 నుంచి 2015 మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితి ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తప్పక పరిశీలించాల్సి ఉంది. అణ్వాయుధాలు సంగ్రహించకుండా ఇరాన్‌ను కట్టడి చేయడానికి ఐక్యరాజ్యసమితి తగు చర్యలు తీసుకుంటూనే దాని ఆయుధాల కొనుగోలు వ్యాపారంపై కూడా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు తమ ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావం వేశాయని ఇరాన్ భావించింది. గతంలో ఐక్యరాజ్యసమితి తనపై విధించిన ఆంక్షలనుంచి బయటపడాలంటే తన అణు కార్యక్రమాన్ని నియంత్రించుకుని, పరిమితం చేసుకునే లక్ష్యంతో సంయుక్త సమగ్ర కార్యాచరణ పథకం (జేసీపీఓఏ) అమలు చేయడం ద్వారా ఆర్థిక ఆంక్షల ప్రభావం నుంచి బయటపడవచ్చని ఇరాన్ ఆశించింది కానీ అమెరికా రూపొందించి అమలు చేస్తున్న అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ (సీఏఏటీఎస్‌ఏ)ని ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి 2017లో ఇరాన్‌పై ఏకపక్ష ఆంక్షలను విధించింది.
ఐక్యరాజ్య సమితి విధించిన ఈ ఏకపక్ష ఆంక్షలు ధర్డ్ పార్టీ దేశాలపై, వాటి పౌరులపై, అమెరికాతో ఎలాంటి కనెక్షన్ లేని వాటి కంపెనీలపై నిషేధాజ్ఞలు విధిస్తున్నందున భారత్‌పై తీవ్రప్రభావం చూపాయి. ముడిచమురు దిగుమతి విషయంలో ఇరాన్‌పై ఆధారపడటం అనే అంశమే ఆ దేశంతో భారత ఆర్థిక సంబంధాలను నిర్దేశిస్తోంది. ఇరాన్ నుంచి భారత్ 13.04 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడిచమురు దిగుమతి చేసుకుంటుండగా అమెరికా ఆంక్షలు నేరుగా ప్రభావం చూపిన కారణంగా 2017 నుంచి 2019 మధ్యకాలంలో 9.8 నుంచి 5.67 మిలియన్ మెట్రిక్ టన్నులకు భారత్ కుదించుకోవలసి వచ్చింది.
ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ ఇరాన్‌తో ఆర్థికపరంగా అత్యంత సన్నిహితంగా భారత్ మెలుగుతూ వచ్చింది. తన 21 శాతం ఎగుమతులతో ఇరాన్‌తో రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలిచింది. 2018లో చైనా ఎగుమతుల శాతం 30.2%గా ఉండింది. అలాగా చాబహార్ ఓడరేవు నిర్మాణ పనుల్లో మదుపు చేయడానికి భారత్ మినహాయింపును కూడా పొందింది. 2018 డిసెంబర్‌లో ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ చాబహార్ రేవులో కార్యకలాపాలను చేపట్టింది. అప్పటినుంచి 2019 ఫిబ్రవరి వరకు చాబహార్ రేవు నుంచి అఫ్గానిస్తాన్‌కు ఎగుమతులతో సహా 5 లక్షల టన్నుల కార్గో సర్వీసును చాబహార్ పోర్ట్ విజయవంతంగా నిర్వహించింది.
చైనా, బీఆర్‌ఐ, కోవిడ్
చైనా 2013లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్‌ఐ)ను ప్రారంభించినప్పటి నుంచి 126 దేశాలు ఈ పథకంలో భాగమయ్యాయి. దాదాపు 400 బిలియన్ డాలర్ల విలువైన ప్రాజెక్టులలోకి చైనా నేరుగా 90 బిలియన్ డాలర్లను మదుపు చేసింది. అంతర్జాతీయ వ్యవస్థలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి చైనా తలపెట్టిన కీలకమైన కార్యక్రమమే బీఆర్‌ఐ. విధాన సమన్వయం, సౌకర్యాల అనుసంధానం, అవధులు లేని వాణిజ్యం, ఆర్థిక సమగ్రత, ప్రజల మధ్య సంబంధాలు అనే అయిదు లక్ష్యాలను బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కలిగి ఉంది.
ఇంతవరకు మరింత కనెక్టివిటీ, సమగ్రతను ప్రోత్సహించడం కోసం మౌలిక వసతుల అభివృద్ధిపై కీలక ప్రయత్నాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ గుర్తించవలసింది ఏమిటంటే ఈ ప్రాజెక్టులలో చాలావరకు సాధారణంగా ఏ దేశానికైనా, ఏ కంపెనీకి అయినా అందుబాటులో ఉండేలా ఉంటున్నాయి. అయితే పౌర వాణిజ్యం, సైనిక ప్రయోజనం వంటి ద్వంద్వ ప్రయోజనాలను కూడా నెరవేర్చే ప్రాజెక్టులు కొన్ని వీటిలో ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీలంకలోని హంబంటోటా పోర్ట్‌లో అత్యధిక భాగాన్ని చైనా కైవసం చేసుకుని ఇక్కడి నుంచి జిబౌటీలోని చైనా సైన్యానికి ఒక సరఫరా కేంద్రంగా దాన్ని మలుచుకుంది. జిబౌటీ ప్రాంతం హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని ఒక వ్యూహాత్మక ప్రాంతం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా కాస్త విజయం సాధించిన చైనా.. ఇరాన్‌తో సహా పలు దేశాలకు సహకరించడానికి కోవిడ్ సాంక్రమిక వైరస్‌ను ఉపయోగించుకుని వాటికి మాస్కులు, వెంటిలేటర్లు, ఇతర రక్షణ సామగ్రిని విరాళంగా పంపింది. కరోనా వైరస్‌ని నిరోధించడంలో తగిన స్పందన చూపటం లేదంటూ తనపై వచ్చిన ఆరోపణలనుంచి బయటపడడానికి చైనా ఈ మార్గం అవలంబించిందని స్పష్టంగా తెలిసింది.
భారత్ ఏం చేయాలి?
ఈ పరిణామాలు చూసి మనం భయపడాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే మనం ఇప్పటికీ ఇరాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాం. భారత్ ఈ సందర్భంగా ఆరోగ్యపరమైన దౌత్యాన్ని ప్రదర్శించి ఫావిపిరవిర్, రెమ్‌డెసివిర్, ఇటోలిజుమ్బ్ వంటి అవసరమైన మందులను ఇరాన్‌కు పంపించే ప్రయత్నాలు చేయాలి. భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆమోదించిన ఈ మందులు కోవిడ్–19 రోగుల రికవరీ సమయాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నమ్ముతున్నారు. పైగా తాను అభివృద్థి చేసే ఎలాంటి వ్యాక్సిన్‌ని అయినా ఇరాన్‌కి సరఫరా చేయడంలో భారత్ ముందు ఉంటూ వచ్చింది కాబట్టి రెండు దేశాల మధ్య సంబంధాలను మనం కొనసాగించగలిగాం.
మధ్య ఆసియా, అప్గానిస్తాన్‌లకు కారిడార్‌ని అందించే సింహద్వారంగా ఇరాన్ ఉంటోందని భారత్, అమెరికాలు భావిస్తున్నాయి. కాగా ఇరాన్‌లోని ఓడరేవును హిందూ మహాసముద్రానికి ప్రత్యామ్నాయ మార్గంగా చైనా భావిస్తోంది. పైగా, తనకు సమీపంలో చమురు ఉత్పత్తుల సరఫరా కేంద్రాన్ని కాపాడుకోవడంపై చైనా స్పష్టమైన వైఖరితో ఉంది. అందుకనే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌తోపాటు తన సైనిక కార్యక్రమాలను కూడా చైనా పెంచుకుంటోంది.
బంగాళాఖాతం, అరేబియా సముద్రం తనకు అందించిన భౌగోళిక వ్యూహాత్మక సముద్ర సంబంధమైన అనుకూలతను లాభసాటిగా మార్చుకోవడంవైపే భారత్ స్పందన ఉండాలి. ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి, భారతదేశం ఇప్పటికే అండమాన్, నికోబార్ కమాండ్‌ని ఏర్పర్చుకుంది. ఇది సైన్యం, నేవీ, వైమానిక దళం కలిసి మోహరించిన మొట్టమొదటి సమీకృత కమాండ్ కావటం విశేషం.
చివరగా, ఇరాన్‌లో పెట్టుబడులు పెట్టడానికి చైనా పూనుకోవడం కాస్త ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, ఇరాన్‌తో దీర్ఘకాలికమైన దార్శనికతను భారత్ కొనసాగిస్తూ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ఆ దేశంతో తన సంబంధాలను కలిగి ఉండాలి.
వ్యాసకర్త డాక్టర్ రాజ్‌దీప్ పాకనాటి అసోసియేట్ ప్రొఫెసర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ
‘ ఈ–మెయిల్: rpakanati@jgu.edu.in
Comments
Please login to add a commentAdd a comment