ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మంది కంటే ఎక్కువమందిని కోవిడ్–19 మహమ్మారి దారి ద్య్రంలోకి నెట్టివేసిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి ప్రభావిత కమ్యూనిటీకు చెందిన పిల్లలకు కరోనా వైరస్ తాజా వేరియంట్లు ప్రమాదకరంగా మారుతున్నాయని నిర్ధారిస్తున్నారు. భారత్ విషయానికి వస్తే అంతర్గతంగా ఆర్థిక కారణాలతో వలస వెళుతున్న కోట్ల మంది ప్రజల దుస్థితి విషయం ఏమిటి? దేశ జనాభాలో వీరు 37 శాతం వరకు ఉన్నారు. జూన్ 10న అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్ వెలువరించిన నివేదిక ప్రకారం 16 కోట్లమంది పిల్లలు బాలకార్మికులుగా ఉంటున్నారని తెలుస్తోంది.
గత 20 ఏళ్లలో మొదటిసారిగా 2020లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన ప్రగతి స్తంభించిపోయిందని ‘బాలకార్మికులు: 2020లో ప్రపంచవ్యాప్తంగా అంచనాలు, ధోరణులు.. పురోగామి పథం’ అనే పేరిట వెలువడిన నివేదిక పేర్కొంది. భారత్‌లో ఐదేళ్ల నుండి 14 ఏళ్లలోపు వయసున్న కోటిమంది పిల్లలు బాలకార్మికులుగా ఉంటున్నారు. కాగా 2020 నుంచి అంటే కరోనా మహమ్మారి ప్రభావం చూపిన సంవత్సరం నుంచి దేశంలో బాలకార్మికుల సంఖ్య అపారంగా పెరిగిపోతోంది.
దేశంలో బాలకార్మికుల పెరుగుదలకు వలసపోవడం అతి ముఖ్యమైన కారణంగా కనిపిస్తుంది. గత ఏడాది నుంచి కరోనా నేపథ్యంలో వలస కార్మికులు తమ తమ ఊళ్లకు తిరుగు వలస పోవడంతో పత్తి క్షేత్రాల్లో, మిరప పొలాల్లో, ఇంటి పనిలో, బట్టీల్లో, ఉత్పత్తి కంపెనీల సరఫరా చైన్లలో, ఇతర పనిస్థలాల్లో బాలకార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. యూనిసెఫ్ అభిప్రాయం ప్రకారం దేశంలోని రెండున్నర కోట్లమంది పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోవడమే కాదు.. పాఠశాలల మూసివేతతో పెనునష్టం బారిన పడిపోయారు. కానీ మనం కోటి మంది పిల్లల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం తప్ప, పాఠశాల విద్యకు దూరమైన ఎంతో మంది బాల కార్మికుల గురించి మాట్లాడేది ఎన్నడు?
తాజా నిర్ధారణ ప్రకారం, పాఠశాలకు వెళ్లని ఏ పిల్లలైనా సరే బాలకార్మికులుగా మారిపోయే అవకాశం ప్రబలంగా ఉంది. ఏ కారణం వల్లనైనా బడికి వెళ్లలేకపోయిన ప్రతి బాలికా, బాలుడూ తల్లిదండ్రులకు సాయపడే పనుల్లోకి దిగిపోతారు, కుటుంబానికి చెందిన వృత్తుల్లో భాగమవుతుంటారు. బిహార్‌లో అయితే స్కూల్‌కి దూరమైన పిల్లలు అక్రమ సారా బట్టీల నుంచి ఇటుక బట్టీల వరకు వివిధ రకాల పనుల్లో మునిగి తేలుతుంటారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే క్వారీల్లో పనిచేస్తుంటారు. రాజస్తాన్‌లో అయితే గనుల్లో పనిచేయడం, ఇంటి పెరడుల్లో పనులను చక్కబెట్టడంలో నిమగ్నమై ఉంటారు. కాగా ఢిల్లీలో అయితే మురికివాడల్లో కూర్చుని దుస్తుల పరి శ్రమల్లో గుండీలు కుడుతూ కనిపిస్తారు. దీంతోపాటు 2020 నుంచి భారతదేశంలో బాల్యవివాహాలు పెరిగిపోవడం కూడా చూస్తున్నాం. ఆడపిల్లల పరిస్థితి మరీ ప్రమాదకరంగా తయారైంది. వీరికి చిన్నవయసులోనే పెళ్లి చేస్తున్నారు. ఈ బాలవధువులు వెంటనే బాలకార్మికులుగా మారిపోతున్నారు.
మూడున్నర కోట్లమంది పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ 2017 డేటా పేర్కొంది. ఇక 2021లో, 2 కోట్ల 40 లక్షల మంది పిల్లలు మహమ్మారి తర్వాత పాఠశాలలకు తిరిగి వెళ్లని స్థితికి చేరుకున్నారని యునెస్కో పేర్కొంది. మరి వీరంతా ఎక్కడికి పోయారు? గతసంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ కాలంలో లాక్ డౌన్ నిబంధనలను తీవ్రంగా అమలు చేయడంతో లక్షలాదిమంది వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు సొంత ఊళ్లకు చేరుకోవడం, ఉపాధికి దూరం కావడం, ఆదాయాలు పూర్తిగా అందుబాటులో లేకపోవడం కారణంగా వారి పిల్లలు కూడా దాని ప్రభావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేశారు. మధ్యాహ్న భోజన పథకాలు కూడా ఆగిపోయాయి. 2017లో 6–10 సంవత్సరాల లోపు పిల్లల్లో 1.5 శాతం మంది బళ్లకు దూరమయ్యారని విద్యా నివేదిక వార్థిక స్థితి పేర్కొనగా 2020లో ఇది 5.3 శాతానికి పెరిగపోయిందని పోల్చి చెప్పింది.
గత సంవత్సరంలో 15 లక్షల పాఠశాలలు మూతపడగా, లెక్కకు మించిన సంఖ్యలో పిల్లలు బాలకార్మికులుగా మారిపోయారు. ప్రత్యేకించి బాలికలను వేధించడం, బాలికలను అక్రమ రవాణాకు గురిచేయడం, బాల్యవివాహాలను అధికం చేయడం షరామామూలుగా మారిపోయింది. గత కొద్దినెలల్లో బాలబాలికలకు ఆపన్నహస్తం అందించే చైల్డ్ హెల్ప్ లైన్లు 17 శాతం అధికంగా కాల్స్ అందుకున్నాయి. ప్రభుత్వ అధికారులు దాదాపు 5 వేలకు పైగా బాలికా వివాహాలను అడ్డుకున్నారు. దాదాపు 5 లక్షలకు పైగా బాలికలు బాల్య వివాహాల బారిన పడ్డారని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ పేర్కొంది. కానీ, కేంద్ర బడ్జెట్ ఈ సంవత్సరం బాలబాలికల విద్యపై 5 వేల కోట్ల రూపాయల కోత విధించింది. జీడీపీలో కనీసం 6 శాతం మేరకు విద్యకు కేటాయించాలని ఆల్ ఇండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సంస్థ కేంపెయిన్లు చేస్తున్న తరుణంలోనే కేంద్రం విద్యా కేటాయింపులను కుదించివేయడం గమనార్హం. ఇక ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా చేర్చాలనే ప్రతిపాదన గాల్లో కలిసిపోయాయి.
ఈ సమస్య పరిష్కారానికి కావలిసిందేమిటంటే, సంస్థాగతంగా సమస్యను పరిష్కరించడమే. దీనికోసం ఒక సమాజంగా, ఒక జాతిగా మనలను చాలా క్లిష్టమైన ప్రశ్నలు సవాల్ చేస్తాయి. మొదటి ప్రశ్న ఏమిటంటే, మన జాతీయ విద్యావిధానం బాలకార్మిక వ్యవస్థకు తగిన ప్రాధాన్యమిచ్చి పిల్లలందరినీ పాఠశాలలకు తీసుకువచ్చే మార్గాలను నిజంగా అన్వేషిస్తోందా? పాఠశాలలకు ఆవల బహిరంగ విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టకపోతే సామాజికంగా వెనుకబడిన వర్గాలు, కులాలు, పేదరికంలో కూరుపోయిన కమ్యూనిటీల పిల్లలకు మరిన్ని ప్రమాదాలు ఎదురుకాక తప్పదు. ఈ పరిస్థితిని పట్టించుకోనంతవరకు బాలబాలికలు మరింతగా చదువుకు దూరం కాక తప్పదు. కోవిడ్ మహమ్మారి ముగిసిపోయిన అనంతరం బాలబాలికల పరిరక్షణ, క్రమబద్దీకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే బాలకార్మిక వ్యవస్థ కోరల్లో మరింత మంది పిల్లలు పడిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.
ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనా సంవత్సరంగా భావిస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ, దేశ దేశాల ప్రభుత్వాలు, యంత్రాంగాలు బాలకార్మిక వ్యవస్థ మూలాలను పరిష్కరించేందుకు సమన్వయంతో కృషి చేయాలని నిర్ణయించుకున్నాయి. భారత్ మరింత గట్టిగా కృషి చేయవలసి ఉంది. దీనికోసం దేశంలో బాలకార్మిక వ్యవస్థ బలంగా ఉనికిలో ఉందని మొదటగా గుర్తించాల్సి ఉంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన తర్వాత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు, పౌర సమాజం, వ్యాపార వర్గాలు, మీడియాతోపాటుగా అన్ని రంగాలూ సమస్య పరిష్కారానికి సామూహికంగా, వ్యూహాత్మకంగా కృషి చేయడానికి ఆస్కారముంటుంది.
బహముఖ రంగాలనుంచి, బహుముఖ వర్గాలనుంచి సామూహిక కృషి జరపాలన్న వైఖరి ద్వారానే పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, తల్లిదండ్రులకు ప్రత్యామ్నాయంగా సురక్షిత జీవన మార్గాలను కల్పించలేకపోవడం, పిల్లలకు తగిన రక్షణ యంత్రాంగాల లేమి, నాణ్యమైన విద్యా లేమి వంటి సమస్యలను పరిష్కరించడానికి వీలు కలుగుతుంది. బాలకార్మిక వ్యవస్థ మూలాలకు అవతల ఎన్నో పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. దేశంలో పదిలక్షల మందికి పైగా పిల్లలను పాఠశాలలకు తీసుకురావడం కోసం ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ విధానాలు, ఆచరణలనంచి భారత్ నేర్చుకుని తీరాలి. ఎంవీ ఫౌండేషన్ వంటి సంస్థలు చేపడుతున్న బాలకార్మిక విముక్తి మండలి వంటి నమూనాలను అధ్యయనం చేసి వాటిని అమలు చేయవచ్చు కూడా. 2025 నాటికి భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంకితమవుదాం.
మౌనిక బెనర్జీ
వ్యాసకర్త కంట్రీ లీడ్ ఫర్ వర్క్, యూనిసెఫ్
బాలకార్మికులు బడికి వెళ్లాలంటే.
Published Thu, Jun 24 2021 3:07 AM | Last Updated on Thu, Jun 24 2021 3:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment