ఇండియాపై పందెం కాసిన సాహసవంతుడు | rakesh jhunjhunwala A brave man who bet on India | Sakshi
Sakshi News home page

ఇండియాపై పందెం కాసిన సాహసవంతుడు

Published Sun, Aug 21 2022 1:16 AM | Last Updated on Sun, Aug 21 2022 1:23 AM

A brave man who bet on India - Sakshi

రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా నా ఇరుగింటివాడే. ఉత్సాహం ఉరకలెత్తే మనిషి. ఈ మధ్యే కలిశా. కొంచెం నలతపడ్డట్టు కని పించాడు. ఎలా ఉన్నారని అడిగితే, ఠకీమని ‘మై ఠీక్‌ హూ’ అన్న సమాధానం వచ్చింది. కానీ దశాబ్దాలపాటు ఇరుగు పొరుగుగా ఉన్న మా అపార్ట్‌మెంట్‌ భవనంలో ఇకపై ఆ కంచు కంఠం  వినిపించదు. 

రాకేశ్‌ కుటుంబ నేపథ్యం సాధారణమైందే. తండ్రి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవారు. కొడుకు మంచి ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ అవుతాడని ఆశించాడు. అయితే రాకేశ్‌ మంచి సీఏ అవడమే కాదు... స్టాక్‌ మార్కెట్‌ను శాసించగల స్థాయికి చేరతాడనీ, వందల మంది ఆరాధించే, అనుసరించే షేర్‌ గురువుగా ఎదుగుతాడనీ ఆ తండ్రి కూడా ఊహించి ఉండడు. అట్లాంటి వ్యక్తి అయిన నా మిత్రుడు దూరమయ్యాడన్న బాధ ఒకవైపు ఉండనే ఉంది. అదే సమయంలో అతడి జ్ఞాపకాలూ నన్నిప్పుడు వెంటాడుతున్నాయి.

ఒకరకంగా రాకేశ్‌ ఓ మాటల మాంత్రికుడని చెప్పాలి. ఆయన పలికే ప్రతి మాటనూ శ్రద్ధగా విని, ఆయన బాగుండాలని కోరుకున్నవాళ్లు ఎందరో. అహ్మదాబాద్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ గతంలో ఓ సెమినార్‌ ఏర్పాటు చేసి పాల్గొనాల్సిందిగా రాకేశ్‌ను ఆహ్వానించింది. అయితే అతడిని కలిసేందుకు వచ్చిన జనాలను నియంత్రించేందుకుగానూ ప్రవేశ రుసుమును ఐదు వేల రూపాయలుగా నిర్వాహ కులు ప్రకటించాల్సి వచ్చిందంటే అతడి జనాదరణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడో మాట చెప్పుకోవాలి. రాకేశ్‌ది చాలా ఉదార స్వభావం. స్టాక్‌ మార్కెట్‌ సలహాలు బోలెడు ఉచితంగానే ఇచ్చేసేవాడు. అతడి దృష్టిలో పెట్టు బడులు పెట్టేవాళ్లు అప్పుడప్పుడూ తమ జేబులు ఖాళీ చేసుకోవాలి. అలా చేస్తేనే మళ్లీ అవి నిండు తాయని నమ్మేవాడు.  ఇలా రిస్క్‌ తీసుకునే తత్వం అతడి వైఖరిలోనూ స్పష్టంగా కనిపించేది. పెట్టే పెట్టుబడులు ధైర్యంగా పెట్టేవాడు. ఆటుపోట్లు ఎదురైనా ఏమాత్రం తగ్గేవాడు కాదు.

రాకేశ్‌ ఈమధ్యే ‘ఆకాశ’ పేరుతో ఓ విమానయాన సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒకానొక సందర్భంలో అతడితో మాట్లాడుతూ కోటీశ్వరులను లక్షాధిపతులుగా మార్చిన రంగంలో ఎందుకు డబ్బులు పోస్తు న్నావని అడిగా. రాకేశ్‌ నవ్వుతూ ఇచ్చిన సమాధానమేమిటో తెలుసా? ‘‘నాకు గతంపై నమ్మకం లేదు. గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటా. ప్రస్తుత ట్రెండ్‌ ఏమిటన్నది అంచనా వేస్తా. అందుకు తగ్గట్టుగానే డబ్బులు పెట్టుబడి పెడతా’’ అని! భారత్‌ వృద్ధి పథంలో ఉందనీ, పర్యాటకంతోపాటు ఇతర రంగాల్లోనూ డిమాండ్‌ పెరగనుందన్న అంచనా రాకేశ్‌ది. 

ఇతరుల వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడమూ రాకేశ్‌ నైజమని చెప్పాలి. కానీ అతడు భారత్‌ విజయంపై పందెం కాశాడు. బ్రాండ్ల విషయంలో అందరికంటే ముందు ఎక్కువ సాధికారత సాధించింది కూడా రాకేశ్‌ మాత్రమే. టైటాన్‌  గురించి తరచూ చెబుతూండేవాడు. బ్రాండ్‌ను మాత్రమే చూసి తాను అందులో పెట్టుబడి పెట్టగలనని అనేవాడు. నా స్నేహితుడి కంపెనీ బోర్డులో సభ్యుడిగా చేరాడు రాకేశ్‌. రావడం రావడంతోనే తన వ్యూహాలతో కంపెనీ విస్తరణను చేపట్టాడు. డిజిటల్‌ టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చాడు. ఫలితంగా ఒకప్పటి ఆ చిన్న కంపెనీ ఇప్పుడు వందకోట్ల డాలర్ల సంస్థగా (యూనికార్న్‌) ఎదిగింది. 

రాకేశ్‌ ఆలోచనలు సరళంగా, సంప్రదాయా లకు కట్టుబడి ఉండేవి కాదు. గందరగోళ పరిస్థితుల్లోనే వృద్ధి నమోద వుతుందని తరచూ అనేవాడు. ఎంత కష్టపడాలో అంతే ఉల్లాసం గానూ గడపాలన్నది రాకేశ్‌ సిద్ధాంతం. ‘‘విజయం తాత్కాలి కమైంది. కాలంతోపాటు కరిగి పోయేది’’ అని నమ్మేవాడు. రాకేశ్‌ గొంతు కొంచెం పెద్దదే. ఎక్కడ ఉన్నా మాటను బట్టే అతడిని గుర్తిం చవచ్చు. అయితే తన ఆరోగ్యం గురించి మాత్రం పెద్దగా పట్టిం చుకునే వాడు కాదు. రోజంతా పడ్డ కష్టాన్ని మరచిపోయేందుకు అతడు చేసే ప్రయత్నాల్లో ఆరోగ్యంపై శ్రద్ధ మరుగున పడి పోయింది. రాకేశ్‌ పాల్గొన్న పార్టీలన్నింటిలోనూ సందడి ఎక్కువగా ఉండేది. సందర్భం ఏదైనా ఏమాత్రం శషభిషలు, సంకోచాలు లేకుండా ఎంజాయ్‌ చేసేవాడు. ఒకసారి తన పుట్టినరోజు జరుపుకొనేందుకు రెండు వందల మంది మిత్రులను తీసుకుని మారిషస్‌ వెళ్లాడు. ఒకవైపు కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూంటే.. రాకేశ్‌ జూమ్‌ కాల్స్‌లో కమెడియన్లను పెట్టుకుని మరీ ఆనందంగా గడిపాడు. అప్పట్లో దీని గురించి పెద్ద దుమారమే రేగింది.

ఇప్పుడు నేనున్న అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ పక్కనే రాకేశ్‌ ఓ భారీ భవంతిని కడుతున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్లాలన్న ఆశ నెరవేరకుండానే పర లోకానికి చేరాడు. రాకేశ్‌ స్థాపించిన కంపెనీ ‘‘రేర్‌ ఎంటర్‌ప్రైజ్‌’’ పేరులో ఉన్నట్లే దాన్ని ఓ అరుదైన సంస్థగా తీర్చిదిద్దేందుకు తన జీవితకాలం మొత్తం శ్రమించాడు. దలాల్‌ స్ట్రీట్‌ పెట్టుబడిదారులు మొదలుకొని, దేశం మూలమూలల్లోని సాధారణ పెట్టుబడిదారులు కూడా రాకేశ్‌ను మరువలేరు. ఈ మార్కెట్‌ గురువును గౌరవాభిమానాలతో గుర్తు చేసుకుంటారు. నారింజ, ఊదా రంగుల్లోని ‘ఆకాశ’ విమానం ఎగిరిన ప్రతిసారీ రాకేశ్‌ స్ఫూర్తిని స్మరించుకుంటారు. రాకేశ్‌ మాట ఒకటి నాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది: ‘‘చేయాలను కున్నది, కలలు కన్నది ఏదైనాసరే  మొదలుపెట్టు. భయం లేకుండా చేసే పనుల్లో ఓ అద్భుతమైన శక్తి ఉంది.’’ మిత్రుడా! శాశ్వత నిద్రలో నీకు సాంత్వన చేకూరుగాక! బతికినంత కాలం ఉత్సాహంతో ఉరకలెత్తావు. నీ తదుపరి ప్రయాణమూ అదే విధంగా సాగిపోనీయ్‌!!


హర్ష్‌ గోయెంకా

వ్యాసకర్త ప్రముఖ పారిశ్రామిక వేత్త 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement