6జీ సంకల్పం నెరవేరగలదా? | Sakshi Guest Column On 6g Technology In India | Sakshi
Sakshi News home page

6జీ సంకల్పం నెరవేరగలదా?

Published Fri, May 5 2023 12:27 AM | Last Updated on Sat, May 6 2023 7:27 AM

Sakshi Guest Column On 6g Technology In India

రేపటితరం టెలీ కమ్యూనికేషన్  టెక్నాలజీగా చెబుతున్న 6జీపై భారత్‌ ఓ దార్శనిక పత్రం విడుదల చేసింది. ఇటీవలే దేశంలో ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీతో పోల్చినా ఎన్నో రెట్లు మెరుగైందీ 6జీ. ఇది వాస్తవ రూపం దాలిస్తే సమాచారం ఏకంగా సెకనుకు ఒక టెరాబిట్‌ వేగంతో ప్రయాణిస్తుంది. 5జీతో పోల్చితే వందరెట్లు ఎక్కువ వేగం! దార్శనిక పత్రం లక్ష్యం చౌకైన, సర్వవ్యాప్తమైన, సుస్థిర టెక్నాలజీల అభివృద్ధి.

కానీ ఈరోజుకూ దేశంలో సుమారు 35,000 గ్రామాల్లో కనీసం 2జీ ఇంటర్నెట్‌ కనెక్షన్  కూడా లేకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దార్శనిక పత్రం పెద్ద ఆశయాలతో కూడి ఉన్నదని చెప్పక తప్పడం లేదు. 6జీ డాక్యుమెంట్‌ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చూసుకోవాలి.

6జీ టెక్నాలజీతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే భారత్‌ ఈ విషయమై కేవలం దార్శనిక పత్రాన్ని జారీ చేయడంతోనే సరిపెట్టకూడదు. పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించడంతోపాటు 6జీ టెక్నాలజీ విషయంలో అంతర్జాతీయ ప్రొటోకాల్, ప్రమాణాల నిర్ధారణ విషయంలోనూ చురుకుగా పాలు పంచుకోవాలి. ఈ పనులు చేయకపోతే 6జీ కేవలం భారత్‌కున్న ఆశల్లో ఒకటిగా మిగులుతుంది.

అనూహ్యమైన ప్రభావం...
6జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో సాకరమైతే కలిగే ప్రయోజనాలు అనూహ్యం. విద్య, ఆరోగ్యం, రవాణాలతోపాటు మానవ జీవితంలోని ప్రతి పార్శా్వన్నీ ఇది స్పృశిస్తుందనడంలో ఎలాంటి సందే హమూ లేదు. రక్షణ రంగ నిపుణుల అంచనాల ప్రకారం, 6జీ టెక్నా లజీని అంతరిక్ష, అణుశక్తి రంగాల మాదిరిగానే ఓ వ్యూహాత్మక రంగంగా పరిగణించి పెట్టుబడులు పెట్టాలి! ఇదే విషయాన్ని మూడేళ్ల క్రితం లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌.ఎస్‌.మెహతా ‘ద ట్రిబ్యూన్ ’లో రాసిన ఒక వ్యాసంలో విస్పష్టంగా పేర్కొన్నారు. 

6జీ టెక్నాలజీతో టాక్టయిల్‌ ఇంటర్నెట్, హోలోగ్రాఫిక్‌ కమ్యూ నికేషన్  వంటివి సాధ్యమవుతాయి. ఆగ్మెంటెడ్, వర్చువల్, మిక్స్‌డ్‌ రియాటీలకూ ఈ టెక్నాలజీ సాయం అందిస్తుంది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలను సమూలంగా మార్చగలిగేంత శక్తి కూడా ఈ టెక్నాలజీలకు ఉంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే కొత్త కొత్త నెట్‌వర్క్‌ టెక్నాలజీలు, పరికరాలు, ప్రమాణాలు అవసరమవుతాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న 5జీ టెక్నాలజీ పూర్తి సామర్థ్యాన్నే మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండగా, తరువాతి తరం టెక్నాలజీ అభివృద్ధికి రంగం సిద్ధమవుతోందన్నమాట!

భారత్‌ ఇటీవలే విడుదల చేసిన 6జీ దార్శనిక పత్రంలో భారత్‌ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికామ్‌ మార్కెట్‌ అని పేర్కొన్నారు. పూర్తిస్థాయి టెక్నాలజీ సృష్టికర్తగా, తయారీదారుగా ఎదగాలని కూడా సంకల్పం చెప్పుకొంది. కాబట్టి 6జీ టెక్నాలజీ తీరుతెన్నులను నిర్ణ యించే ప్రక్రియలో భారత్‌ కూడా భాగస్వామి కావాలి.

అంతరిక్ష రంగంలో ప్రపంచం మొత్తమ్మీద అగ్రస్థానంలోకి చేరేందుకు ఏం చేయాలో ఆలోచించమని ప్రభుత్వం గతేడాదే ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన డాక్యుమెంట్‌– పారిశ్రామిక వర్గాలు, విద్యాసంస్థలు, సర్వీస్‌ ప్రొవై డర్లు ఏఏ అంశాలపై పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలో గుర్తించమని చెబుతోంది. ఇది రెండు దశల్లో జరిగేందుకు అవకాశముంది. తొలిదశ (2023 –25)లో ప్రాథమికమైన పరిశోధన, మేధోహక్కుల అభివృద్ధి జరిగితే, రెండో దశ (2025–30) వాణిజ్యీకరణ. 

దార్శనిక పత్రం లక్ష్యం చౌకైన, సర్వవ్యాప్తమైన, సుస్థిర టెక్నా లజీల అభివృద్ధి. ఇది చాలా కష్టసాధ్యమైన పని. ఎందుకంటే ప్రస్తుతం ఉపయోగిస్తున్న 5జీ టెక్నాలజీలకు ఈ లక్షణాలేవీ లేవు.

అంటే... 6జీ ద్వారా టెక్నాలజీ పరంగా భారీ పురోగమనం జరగా లన్న లక్ష్యాన్ని భారత్‌ నిర్దేశించుకుంది. అంతేకాదు, అవన్నీ చౌకగా చేయాలి. అన్నిచోట్ల అందుబాటులో ఉండేలా చూడాలి. (కానీ ఈరోజుకూ దేశంలో సుమారు 35,000 గ్రామాల్లో కనీసం 2జీ ఇంట ర్నెట్‌ కనెక్షన్  కూడా లేకపోవడం గమనార్హం). సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సరేసరి. వీటికి తోడు కేవలం భారత్‌కు మాత్రమే కాకుండా... 6జీ టెక్నాలజీలన్నీ ప్రపంచం మొత్తానికి అందే ఏర్పాట్లూ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ దార్శనిక పత్రం పెద్ద ఆశయాలతో కూడి ఉన్నదని చెప్పక తప్పడం లేదు.

6జీ టెక్నాలజీపై పట్టు సాధించడం ద్వారా పెత్తనం చలాయించవచ్చునన్న అంచనాలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని కార్యక్రమాలు చకచకా నడుస్తున్నాయి. పరిశ్రమ వర్గాలతో కూడిన ‘నెక్స్‌ట్‌–జీ అలయన్స్ ఆఫ్‌ నార్త్‌ అమెరికా’ సుమారు 50 టెక్నాలజీల అభివృద్ధి అవసరాన్ని గుర్తించింది. రేడియో టెక్నాలజీలు, నెట్‌వర్క్‌ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ, ప్రైవసీ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మరోవైపు దక్షిణ కొరియా 2021లోనే యూనివర్సిటీల్లో 6జీ టెక్నా లజీపై పరిశోధనలు చేసేందుకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేసింది.

అలాగే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పరస్పర సహకారంతో పరిశోధనలు చేసేలా ప్రోత్సహిస్తోంది. యూరోపియన్  దేశాలు కూడా తెలివైన నెట్‌వర్క్‌ల ఏర్పాటు, మేనేజ్‌మెంట్‌లను దృష్టిలో ఉంచుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా, జపాన్ లలోనూ 6జీ టెక్నాలజీకి సంబంధించి వేర్వేరు అంశాలపై పరిశోధనలకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి.

మన దృక్కోణంలో...
భారతదేశపు 6జీ విజన్  డాక్యుమెంట్‌ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్న రంగాలు, భారతీయ దృక్కోణంలో పరిశోధనలు చేపట్టాల్సిన అంశాలపై దృష్టి పెట్టింది. ఈ డాక్యుమెంట్‌లో పేర్కొన్న అంశాలు, వ్యూహాలు, కార్యక్రమాల రూపం సంతరించుకోవాలంటే ‘ఆర్‌ అండ్‌ డీ’కి దీర్ఘకాలం పెట్టుబడులు అవసరమవుతాయి.

నెక్స్‌ట్‌–జీ అలయన్స్లో ప్రఖ్యాత టెలికామ్‌ కంపెనీలు ఏటీ అండ్‌ టీ, బెల్, ఇంటెల్, శాంసంగ్, ఆపిల్, డెల్, సిస్కో, ఎరిక్‌సన్ , గూగుల్, హెవ్లెట్‌ ప్యాకర్డ్, ఎల్‌జీ, మైక్రోసాప్ట్, నోకియా తదితర కంపెనీలు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. కొరియా, జపాన్ , యూరప్‌లలో 6జీ సంబంధిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, చురుకుగా పాల్గొంటున్నది ఈ భారీ కంపెనీలే. అక్కడి ప్రభుత్వాలు కూడా సానుకూలంగా వాటికి మద్దతు పలుకు తున్నాయి.  

మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. మొత్తం ప్రభుత్వం ఆధ్వ ర్యంలో నడుస్తోంది. టెలికామ్‌ రంగంలోని తయారీదారులు, సేవలందించేవారు పాల్గొంటారని ఆశించవచ్చు కానీ... నేతృత్వం మాత్రం ప్రభుత్వం వద్ద ఉండే అవకాశాలే ఎక్కువ. పరిశోధనల విషయానికి వస్తే ఐఐటీల్లాంటి విద్యాసంస్థలు ఇప్పటికే కొన్ని కొత్త, వినూత్న టెక్నాలజీలపై పనిచేస్తున్నాయి.

వాటికి మరింత ప్రోత్సాహం అందించాలి. 6జీ వాణిజ్యీకరణ విషయానికి వస్తే పరిశ్రమ వర్గాలు, విద్యాసంస్థల భాగస్వామ్యం తప్పనిసరి. 6జీ టెక్నాలజీలో భాగమైన సైబర్‌ ఫిజికల్‌ సిస్టమ్స్‌పై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్ అండ్‌ టెక్నాలజీ ఐదేళ్ల క్రితమే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఇప్పటివరకూ సాధించింది కొంతే. 

విజన్  డాక్యుమెంట్‌లో నిధుల అంశంపై అంత స్పష్టత లేదు. భారీ మొత్తంతో ఒక నిధిని ఏర్పాటు చేస్తామని మాత్రమే ఈ డాక్యు మెంట్‌ చెబుతోంది. ఈ నిధి పదేళ్ల కాలానికి దాదాపుగా రూ.10,000 కోట్ల వరకూ ఉండవచ్చునని అంటోంది. ఈ నిధి ప్రభుత్వానిదా, కాదా? అన్నదాంట్లోనూ అస్పష్టతే. 

టెలికామ్‌ రంగంలో భారతదేశం దేశీయంగా తయారు చేసిన గొప్ప టెక్నాలజీ ఏదైనా ఉందీ అంటే అది 1980ల నాటి డిజిటల్‌ రూరల్‌ స్విచ్‌! గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ టెలిఫోన్  ఎక్స్‌ఛేంజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం అప్పట్లో ‘ద సెంటర్‌ ఫర్‌ ద డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సీ–డాట్‌)ను ఏర్పాటు చేసింది. మూడేళ్ల సమయం రూ.36 కోట్ల నిధులు కేటాయించింది. ప్రాజెక్టు విజయవంతమైంది. ఈ టెక్నాలజీని ప్రైవేట్‌ సంస్థలకు అందించారు. తరువాతి కాలంలో చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ వినియోగించారు. 6జీ విషయంలోనూ ఇదే తరహా పద్ధతిని అనుసరించడం మేలు. ఈ అత్యవసరమైన చర్యలన్నీ తీసుకోకపోతే 6జీ డాక్యుమెంట్‌ కేవలం కాగితాలకే పరిమితమవుతుంది!
దినేశ్‌ సి. శర్మ 
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement