వైఫల్యాలున్నా... కీలకమే! | Sakshi Guest Column On G20 Summit | Sakshi

వైఫల్యాలున్నా... కీలకమే!

Sep 11 2023 12:08 AM | Updated on Sep 11 2023 5:39 AM

Sakshi Guest Column On G20 Summit

జీ20 వార్షిక సదస్సు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోసం ఒక ఉన్నతమైన లక్ష్యాలతో కూడిన సమన్వయ విధానాన్ని అనుసరించడం కోసం ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చుతుంది. కానీ తన ఆశయాల పట్ల అది ఎంత పురోగతి సాధించింది? 1999లో ఏర్పడినప్పటి నుండి జీ20 ఉమ్మడి ప్రకటనలు చాలావరకు గాలి పొగల వంటి ఘనమైన తీర్మానాలే తప్ప, కార్యాచరణ శూన్యం.

సభ్యదేశాల పనితీరు ఆశించినంతగా లేనప్పుడు, స్పష్టమైన పరిణామాలు ఉండవు. ఒక ఉదాహరణ. 2021 రోమ్‌ సదస్సులో, జీ20 నాయకులు భూతాపాన్ని ‘అర్థవంతమైన, సమర్థమైన చర్యలతో’ పరి మితం చేస్తామని చెప్పారు. విదేశాలలో బొగ్గు విద్యుత్‌ ప్లాంట్లకు ఆర్థిక సహాయం అందించడాన్ని ముగిస్తామని చేసిన ప్రతిజ్ఞ హైలైట్‌ అయింది.

కానీ రోమ్‌ సదస్సు ప్రకటన దేశీయ బొగ్గు పెట్టుబడులను వదిలిపెట్టేసింది. 2022లో, అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకుంది. జీ20 ప్రకటనలో, బొగ్గు వినియోగాన్ని వెంటనే ముగించాలనే విషయంపై శాస్త్రీయ ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ, 2023లో బొగ్గుపై పెట్టుబడి మరో 10 శాతం పెరిగి, 150 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

1990ల చివరలో కరెన్సీ విలువ తగ్గింపుల వెల్లువ తర్వాత ఆర్థిక మంత్రుల సమావేశంతో జీ20 ప్రారంభమైంది. ఒక దశాబ్దం తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ నాయకుల వార్షిక సమావేశానికి జీ20 నాంది పలికింది. ఈ కూటమిని నెలకొల్పిన దేశాలు, తర్వాత పెరుగుతున్న శక్తులు రెండింటినీ సమావేశపరచడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగ్గా పరిరక్షించవచ్చని విశ్వసించారు. ఈ విశ్వాసం సరైందేనని ముందస్తు ఆధారాలు సూచించాయి.

2008, 2009లో నాలుగు ట్రిలియన్‌ డాలర్ల విలువైన చర్యలకు అంగీకరించడం ద్వారా, విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి బ్యాంకు సంస్కరణలను ప్రారంభించడం ద్వారా, ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించినందుకు చాలామంది నిపుణులు జీ20ని ప్రశంసించారు. 2016లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ సమస్యకు సంబంధించి పారిస్‌ ఒప్పందంపై తమ రెండు దేశాలూ సంతకం చేస్తాయని అమెరికా అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, చైనా నాయకుడు షీ జిన్ పింగ్‌ ప్రకటించారు. దీంతో నాయ కులను ఒకచోట చేర్చే శక్తిని జీ20 ప్రపంచానికి చూపించింది.

ఇటీవల అంటే 2021లో, ప్రతి దేశానికి కనీసం 15 శాతం ప్రపంచ కనిష్ఠ పన్నుతో కూడిన ప్రధాన పన్ను సవరణకు జీ20 సదస్సు మద్దతునిచ్చింది. అమెజాన్‌ వంటి బడా అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించే దేశాలలో కార్యాలయాలు లేకపోయినా, పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉన్న కొత్త నిబంధనలకు కూడా ఇది మద్దతిచ్చింది.

ప్రభుత్వ ఆదాయానికి బిలియన్లను అదనంగా జోడించడమే కాకుండా, పన్నుల స్వర్గ ధామాలను ఏర్పర్చి, కార్పొరేషన్లకు చోదక శక్తిగా మార్చడానికి జీ20 ప్రణాళిక హామీ ఇచ్చింది. కానీ, కూటమి చేసిన అనేక ప్రకటనల మాదిరిగానే, వాటి తదుపరి అమలు బలహీనంగా ఉంటూవచ్చింది. ‘గ్లోబల్‌ ట్యాక్స్‌ ఒప్పందం సరైన దిశలో ఒక ముఖ్యమైన అడుగు’ అని అంత ర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఈ సంవత్సరం ప్రకటించింది, ‘అయితే అది ఇంకా పనిచేయడం లేదు’ అని పేర్కొంది.

జీ20 ప్రారంభమైనప్పుడు, ప్రపంచాన్ని ఎలా కలిపి ఉంచాలనే దానిపై మరింత ఏకాభిప్రాయం ఏర్పడింది. స్వేచ్ఛా వాణిజ్యం పెరిగింది. అధికారం కోసం పోటీ ఒక పాత జ్ఞాపకం లాగే కనిపించింది. పైగా, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వంటి వయసుడిగిన సంస్థల స్థానంలో జీ20 విస్తృతమైన అధికార స్థావరంగా దారితీస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆశావాదులు భావించారు. ఆ ఆశలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

పైగా మరెక్కడో వికసించాయి కూడా! ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశం తాజా ఉదాహరణ. కానీ విభేదాలు జీ20 జట్టు ప్రయత్నాలను దెబ్బకొట్టాయి. అమెరికా, చైనా తీవ్ర పోటీదారులుగా మారాయి. కోవిడ్‌ –19 మహమ్మారి, ఉక్రెయిన్ లో యుద్ధం తర్వాత ఆర్థిక వ్యవస్థలు ప్రమాదకరంగా కనిపించడంతో జాతీయవాదం పెరిగింది. యుద్ధరంగానికి దూరంగా ఉన్న దేశాల్లో ఆహారం, ఇంధన ధరలను పెంచింది.

కొంతమంది విమర్శకులు జీ20ని తొలగించాలని కోరుకుంటున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ ఈ సంవత్సరం సమావేశాన్ని దాటవేయడంతో అది ఇప్పటికే బలహీనపడిందని వారు అంటున్నారు. అయితే, జీ20 వైఫల్యాలు అంతర్జాతీయ సంస్థలలో ఆధునికీకరణ అవసరాన్ని సూచిస్తాయని చాలామంది విదేశాంగ విధాన నిపుణులు సూచిస్తున్నారు. 
డామియన్‌ కేవ్‌ 
వ్యాసకర్త ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పాత్రికేయుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement