రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగడం భారత్‌కు సంకటంగా మారుతోంది. బ్రిక్స్, షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) వంటి ఏర్పాట్ల ద్వారా చైనా, రష్యా రెండింటితో సంబంధం కలిగి ఉండటం ఒక కారణం. క్వాడ్, మలబార్ గ్రూపింగ్ ద్వారా ఇంకోపక్క భారత్ అమెరికా తోనూ జట్టుకట్టింది.
భారత్ ఏకకాలంలో అటు ఎస్‌సీఓ, ఇటు జీ20లకు అధ్యక్ష స్థానాన్ని నిభాయిస్తూండటం చెప్పుకోవాల్సిన అంశం. వ్యూహాత్మకంగా స్వతంత్రంగా ఉంటూనే ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలంటే భారత్ చాలా దార్శనికతతో వ్యవహరించాలి. వాణిజ్యం, వ్యాపారం, దౌత్యం అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సమన్వయం ద్వారా మిలిటరీ టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రకంపనలు
ప్రపంచం నలుమూలలా వినిపిస్తున్నాయి. యుద్ధం తాలూకూ దుష్ప్రభావం కేవలం రాజకీయాలకు, ఆర్థిక వ్యవస్థలకు మాత్రమే పరిమితం కాలేదు. అన్నిచోట్లా సామన్యుడిని సైతం ఇబ్బందిపెట్టే స్థాయికి ఈ యుద్ధం చేరుకుంది. గోధుమలు,వంటనూనెలు, ఎరువుల విషయంలో ఉక్రెయిన్ తిరుగులేని స్థానంలో ఉంది. ముడిచమురు, సహజవాయువుల్లో రష్యా పెత్తనం గురించి చెప్పనక్కర్లేదు. వీటన్నింటికీ ఏర్పడ్డ కొరత స్టాక్‌మార్కెట్లను కూల్చే స్తూంటే... పెరిగిపోతున్న ధరలు, ప్రజల్లోని అసంతృప్త రాజకీయ ఉద్యమాలను ప్రేరేపిస్తున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అణ్వాయుధ ప్రయోగం గురించి మాట్లాడటం ద్వారా ప్రపంచాన్ని మూడో ప్రపంచయుద్ధం ముంగిట్లో నిలబెట్టారు. తన నిర్లక్ష్య ధోరణితో విపరీతమైన ఆస్తి నష్టానికీ కారణమయ్యారు. రష్యాపై విధించిన ఆంక్షలు ప్రపంచీకరణ ప్రక్రియను నిలిపేశాయని అనలేము. కానీ ఆహారం, ఇంధనం, సరు కులు, ఆయుధాల కోసం దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టడంతో కూటముల పునరేకీకరణ, భిన్న ధ్రువాల ఏర్పాటు మొదలైందని చెప్పాలి.
రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి దారితీసిన కారణాలపై చర్చలు అంతులేనంతగా సాగవచ్చు. దీనికి ముఖ్యంగా రెండు ముఖా లైతే కనిపిస్తున్నాయి. మొదటగా చెప్పుకొనే పుతిన్ వాదన గురించి చూద్దాం. ఉక్రెయిన్ అనే దేశం అసలు అస్తిత్వంలోనే లేదంటాడు పుతిన్ . ఎందుకయ్యా అంటే, ‘‘అది రష్యా చరిత్ర, సంస్కృతి, ఆధ్యా త్మికతల్లో అవిభాజ్యమైన భాగం’’ అన్న సమాధానం వినిపిస్తోంది.
ఇలాంటి వాదనలు ఇతరులపై తమ పెత్తనమే చెల్లాలని కోరుకునే చోట్ల వినిపిస్తూంటాయి. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా చెప్పు కొనే ‘నైన్ డాష్ లైన్ ’ మాదిరిగా! లేదా చైనా అక్సాయ్‌చిన్ ఆక్రమణ, అరుణాచల్‌ప్రదేశ్ తమదని నిస్సిగ్గుగా చెప్పుకోవడం ఉదాహరణ లుగా పేర్కొనవచ్చు.
ఇంకో పక్క అమెరికా, యూరప్ విశ్వాసరహితంగా వ్యవహరి స్తున్నాయని పుతిన్ ఆరోపిస్తున్నారు. నాటో దళాలు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలవని గతంలో యూఎస్‌ఎస్‌ఆర్ అధ్యక్షుడు గోర్బచేవ్‌కు ఇచ్చిన మాటను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ మాట ఇచ్చిన పదేళ్లలోనే నాటో వార్సా ఒప్పందంలో భాగమైన పది దేశాలకు సభ్యత్వం ఇచ్చి మాట తప్పిన ఆరోపణలున్నాయి.
తాజాగా ఫిన్లాండ్‌కూ చోటు దక్కడంతో 31 దేశాలతో నాటో బలంగా తయారైనట్లు కనిపిస్తోంది. దీంతో తాను బలహీనమవుతున్న భావన రష్యాకు కలుగుతోంది. ఈ విషయాలెలా ఉన్నా, ఓ సార్వభౌమ దేశంపై ఏకపక్ష దాడిని రష్యా ఏ రకంగానూ సమర్థించుకోలేదు. అదే సమయంలో పాశ్చాత్య దేశాలూ ఉక్రెయిన్ కు నిత్యం ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధం ఇంత సాగేలా చేయడం కూడా ఆక్షేపించదగ్గదే.
భారత్‌కు సంకటం...
ఉక్రెయిన్‌పై దాడి వ్యూహం బెడిసికొడుతున్న నేపథ్యంలో రష్యాకు ఇప్పుడు అత్యవసరంగా స్నేహితుల అవసరం ఏర్పడుతోంది. ఈ అవసరాన్ని కాస్తా చైనా తీర్చింది. షీ జిన్ పింగ్ ఇప్పుడు పక్కాగా రష్యా వైపు నిలబడ్డారని చెప్పవచ్చు. ఫలితంగా ఇకపై చైనాకు రష్యా నుంచి ఆటంకాలు ఎదురుకాకపోవచ్చు. అయితే ఈ క్రమంలో రష్యా కాస్తా చైనా గుప్పిట్లో చిక్కుకునే అవకాశం ఉందా! అదే జరిగితే రష్యా ఇప్పటివరకూ పలు దేశాలతో, మరీ ముఖ్యంగా భారత్‌తో స్వతంత్రంగా నడుపుతున్న సంబంధాలపై చైనా ప్రభావం పడుతుంది.
మిలిటరీ అవసరాలను తీర్చే సామర్థ్యం తగ్గిపోయిన నేపథ్యంలో భారత విధాన రూపకర్తలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఇది. ఇటీవల పూంఛ్‌లో మిలిటరీ దళాలపై జరిగిన దాడి... పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ ఇప్పటికీ ఉగ్రవాదానికి కలిసికట్టుగా ఊతమిస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.
స్థిర నిర్ణయానికి సమయం ఇదే...
రెండువైపుల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత్ ఒక స్థిర నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. విధానా లతోపాటు ప్రాథమ్యాల పునః సమీక్ష అవసరం. దౌత్య సంబంధాల అజెండాలో టెక్నాలజీ సముపార్జనను కూడా భాగం చేయడం తక్షణ కర్తవ్యం. జపాన్ , ఆస్ట్రేలియాలతో కూడిన ‘క్వాడ్ అండ్ మలబార్ గ్రూపింగ్’ అనేది అమెరికా, భారత్ వ్యూహాత్మక అవసరాలు కలి యడం ఫలితంగా పుట్టుకొచ్చింది.
మిలిటరీ, దౌత్య అవసరాలను తీర్చేందుకు మాత్రమే ఇవి ఉపయోగపడుతున్నట్లు కనిపిస్తున్నా ప్రభావం చాలా ఎక్కువే. చైనా తరచూ క్వాడ్‌ను ఉద్దేశించి బెదిరింపులకు దిగడం ఈ గ్రూపింగ్‌ను తన ఆధిపత్య ప్రణాళికలకు గండి కొట్టేదిగా చూడటమే కారణం. అయితే చైనా బెదిరింపులకు కౌంటర్ ఇచ్చే విషయంలో అమెరికా మినహాయించి మిగిలిన దేశాలు తట పటాయించాయి. తమ గ్రూపింగ్ వల్ల భద్రతాపరమైన ప్రభావాలేవీ ఉండవనీ, తమది ‘ఆసియా నాటో’ కూటమి కాదనీ చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ పరిస్థితిని మార్చి, పదును పెరిగేలా భారత్ చొరవ తీసుకోవాలి.
ఈ విషయంలో అమెరికా చేపట్టిన రెండు పనుల గురించి ప్రస్తావించాలి. 2021 సెప్టెంబరులో ఆస్ట్రేలియా, యూకే, అమెరికా కలిసి త్రైపాక్షిక భద్రత ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం అమెరికా, బ్రిటన్ రెండూ ఆస్ట్రేలియాతో అత్యాధునిక టెక్నాలజీలను పంచుకుంటాయి. అణ్వస్త్ర సామర్థ్యమున్న జలాంతర్గామిని పొందే విషయంలో కూడా సాయం అందిస్తాయి. యూకే, అమెరికా అణు జలాంతర్గాములను ఆస్ట్రేలియాలో మోహరించడంతోపాటు అణ్వా యుధాల విషయంలో ఆస్ట్రేలియా సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకూ ఏర్పాట్లు జరిగాయి.
ఆశ్చర్యకరంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ అణు జలాంతర్గాముల విషయంలో భారత్‌కు అమెరికా ఇలాంటి సౌకర్యాలేవీ కల్పించడం లేదు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, చారిత్రాత్మక పౌర అణు ఒప్పందం వంటివేవీ అక్కరకు రాలేదు. అయితే అమెరికా 2022 మే నెలలో ‘క్రిటికల్ ఇంజినీరింగ్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఇది మనకు అనుకూలమైన ఫలితా లేమైనా సాధిస్తుందా అన్నది వేచి చూడాలి.
మనది అణ్వాయుధాలు కలిగిన దేశం. అంతరిక్ష రంగంలోనూ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మిలటరీ వ్యవస్థను కలిగి ఉంది. అయినా... మిలిటరీ విషయంలో మన ప్రయత్నాలు పూర్తిస్థాయిలో లేవనే చెప్పాలి. దిగుమతులపై ఆధారపడే దేశంగానే మిగిలిపోయాం. ఆత్మ నిర్భరత సాధించడం అనేది చాలా ఉదాత్తమైన లక్ష్యమే కానీ, ఒక్క టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నా చాలా సమయం పడుతుంది.
ఈ విషయంలో చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. 1960లు మొదలుకొని ఇప్పటివరకూ ఆ దేశం ఏకైక లక్ష్యంతో పనిచేస్తోంది. రివర్స్ ఇంజి నీరింగ్, బెదిరింపులు, కొన్నిసార్లు దొంగతనాలకూ వెనుకాడకుండా యూఎస్‌ఎస్‌ఆర్, పాశ్చాత్య దేశాల నుంచి టెక్నాలజీలను సము పార్జించుకునే ప్రయత్నాలు చేసింది.
ఈ నేపథ్యంలో ఒక్క మాట సుస్పష్టం. ఇకనైనా భారత్ వాణిజ్యం, వ్యాపారం, దౌత్యం అన్నింటినీ పరిగణలోకి తీసుకుని సమీ కృత పద్ధతిలో ఇతర దేశాలతో వ్యవహరించడం అలవాటు చేసు కోవాలి. ఈ సమన్వయం ద్వారా మిలిటరీ టెక్నాలజీలను అందిపుచ్చు కునేందుకు ప్రయత్నించాలి. తద్వారా మాత్రమే భారత్ పూర్తిస్థాయిలో ఆత్మనిర్భరత సాధించగలదు.
అరుణ్ ప్రకాశ్
వ్యాసకర్త భారత నావికాదళ విశ్రాంత ప్రధానాధికారి
Comments
Please login to add a commentAdd a comment