ఈ ఏడాది వేసవి.. వాతావరణ పాఠాలు చాలానే నేర్పింది! | Sakshi Guest Column This Year Summer Reveals How Weather Affects | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది వేసవి.. వాతావరణ పాఠాలు చాలానే నేర్పింది!

Published Tue, Sep 12 2023 1:17 PM | Last Updated on Tue, Sep 12 2023 1:23 PM

Sakshi Guest Column This Year Summer Reveals How Weather Affects

ప్రపంచ ప్రజలకు ఈ ఏడాది వేసవి నేర్పిన పాఠాలు వాతావరణంలో మార్పులు, భూతాపం, ఎల్‌ నినోతో భూగోళంపై జనం అవస్థలు  ఈ ఏడాది వేసవిలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తించాయి. మానవుల అనాలోచిత కార్యకలాపాల వల్ల వచ్చిన వాతావరణ మార్పులు, భూతాపం, ఎల్‌ నినో ఆరంభ దశ–ఇవన్నీ భూగోళంలో ఉత్తత ప్రాంతంలోని అమెరికా, ఐరోపా దేశాలనే గాక ఇండియా వంటి దక్షిణ ప్రాంత దేశాలను మున్నెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో ఇబ్బందులు పెట్టాయి. భారతదేశంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోయే రోజులు 2023 వేసవిలో బాగా పెరిగాయి.

ఫలితంగా వడగాడ్పులు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. చివరికి ఎండాకాలం తర్వాత వర్షపాతం కూడా తగ్గిపోయింది. వాతావరణ మార్పుల ఫలితంగా వచ్చిన తీవ్ర వడగాడ్పుల వల్ల ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోయింది. అమెరికాలో ఉష్ణోగ్రతలు దాదాపు అన్ని రాష్ట్రాల్లో నూరు డిగ్రీల ఫారన్‌ హైట్‌ కు అటూ ఇటూగా ఉన్నాయంటే ఈ ఏడాది వేసవి ప్రతాపం ఎంతటిదో అర్ధమౌతోంది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలోని ప్రధాన నగరం ఫీనిక్స్‌ లో పగటి ఉష్ణోగ్రతలు వరుసగా నెల రోజులు 125 డిగ్రీల ఫారన్‌ హైట్‌ దాటి ఉన్నాయాంటే అక్కడి జనం ఎన్ని కష్టాలు పడ్డారో స్పష్టమవుతోంది.

ఉష్ణోగ్రతలు బాగా పెరిగినప్పుడల్లా వాయు కాలుష్యం కూడా జనం తట్టుకోలేనంత స్థాయికి చేరుతుందని ప్రపంచ వాతావరణ పరిశోధనా సంస్థ (డబ్ల్యూఎంఓ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ‘‘వాతావరణ మార్పును, గాలి నాణ్యతను రెండు వేర్వేరు అంశాలుగా చూడకూడదు. వాతావరణంలో వచ్చే తీవ్ర మార్పులను బట్టే గాలి నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఈ సమస్యపై అందరూ దృష్టిపెట్టాలి.

ఈ రెండు సమస్యలతో ముడిపడిన విషవలయాన్ని మనం ఛేదించాలి,’’ అని డబ్ల్యూఎంఓ సెక్రెటరీ జనరల్‌ పెత్తెరి తాలస్‌ ఒక మీడియా ప్రకటనలో కోరారు. వాయు కాలుష్యం ఎక్కువైతే అడవుల్లో మంటలు చెలరేగి లక్షలాది చెట్లు బూడితయ్యేలా చేసే కార్చిచ్చు నిరంతర సమస్యగా మారుతుందని కూడా ప్రపంచ వాతావరణ పరిశోధనా సంస్థ బుధవారం హెచ్చరించింది. ఈ కార్చిచ్చు లేదా దావానలం వల్ల అడవుల నుంచి వేడిగాలులు వాతావరణంలో చొరబడతాయి. పొగ వల్ల ఆరోగ్య సమస్యలు కార్చిచ్చు వ్యాపించే ప్రదేశాల దగ్గర మాత్రమేగాక వేలాది మైళ్ల దూరంలోని ప్రాంతాల్లో కూడా తలెత్తుతాయి.

దేశంలో ఓ పక్క ఎండలు మండుతుంటే హిమాలయ రాష్ట్రాల్లో వరదలు!
ఈ వేసవి జూన్, జులై నెలల్లో ఉష్ణోగ్రతలు భారత ప్రజలు భరించలేనంత తీవ్రంగా ఉన్నాయి. మరో పక్క హిమాలయాలను ఆనుకుని ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ఢిల్లీలో సెప్టెంబర్‌ 4న గరిష్ఠ ఉష్ణోగ్రత 40.1 సెంటిగ్రేడ్‌ గా నమోదయింది. అంటే 1938లో మాత్రమే రాజధానిలో సెప్టెంబర్‌ మాసం ఉష్ణోగ్రత ఈ స్థాయికి చేరింది. ‘‘మేం గమనించేది పాత రికార్డులు బద్దలుగొట్టే అధిక ఉష్ణోగ్రతలను మాత్రమే కాదు. ఈ భూమి మీద, నివసించే ప్రజల మీద వాటి ప్రభావాలను కూడా పరిశీలిస్తున్నాం. వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి,’ అని ఐరోపా వాతావరణ పరిశోధనా సంస్థ (ఈసీఎండబ్ల్యూఎఫ్‌)కు చెందిన కొపర్నికస్‌ వాతావరణ మార్పు సేవల సంస్థ డైరెక్టర్‌ కార్లో బ్యూన్‌ టెంపో వ్యాఖ్యానించారు.

మానవులకు ఆందోళన కలిగించే మరో విషయం మహాసముద్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడం. భూమి ఉపరితలం మీద 70% స్థలం ఆక్రమించుకుని ఉన్న మహాసముద్రాలు గతంలో ఎన్నడూ లేనంత వేడిని అనుభవిస్తున్నాయి. ఆగస్ట్‌ 31న ఉత్తర అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రత 25.18 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కు పెరిగి కొత్త రికార్డు నమోదు చేసుకుంది. పారిశ్రామిక యుగం మొదలైనప్పటి నుంచీ మానవ కార్యకలాపాల వల్ల ఉత్పత్తి అయిన 90 శాతం మితిమీరిన వేడిని మహాసముద్రాలు తమలోకి ఇముడ్చుకున్నాయి.

మానవుల కార్యకలాపాలు ప్రస్తుత రీతిలో కొనసాగితే–19వ శతాబ్దం మధ్య కాలంతో పోల్చితే వచ్చే ఐదేళ్లలో ఏడాది సగటు ఉష్ణోగ్రతలు 1.5 సెంటిగ్రేడ్‌ డిగ్రీల చొప్పున పెరుగుతాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ పరిశోధనా సంస్థ ఇది వరకే హెచ్చరించింద. ఈ నేపథ్యంలో నిరంతరం వాతావరణంలో తీవ్ర మార్పులు రాకుండా, ఉష్ణోగ్రతలు అవాంఛనీయ స్థాయిలకు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాశ్చాత్య దేశాలు సహా అన్ని ప్రాంతాల ప్రజలపై ఉందని చెప్పాల్సిన పని లేదు.


విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సిపి, రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement