సాక్షి, విశాఖపట్నం: వేసవి ఆరంభంలో అరుదైన వాతావరణం నెలకొంది. మార్చి 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది. ఫలితంగా మూడు వారాల నుంచి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పాటు అప్పుడప్పుడు ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా సంభవిస్తున్నాయి. సాధా రణంగా ద్రోణి, ఆవర్తనాలు ఏర్పడితే 3 లేదా 4 రోజులు, గరిష్టంగా వారం రోజుల పాటు ప్రభావం చూపుతాయి.
కానీ.. ఈసారి పరిస్థి తి అలా లేదు. మూడు వారాలు దాటినా అవి బలహీన పడకుండా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు ఉత్తరాదిలో ‘వెస్టర్న్ డిస్టర్బెన్సెస్’ (పశ్చిమ అసమతుల్యతలు) ఏర్పడటం వల్ల అటు నుంచి చల్లని పొడిగాలులు వస్తున్నాయి. ఇటు బంగాళాఖాతం వైపు నుంచి తేమతో కూడిన దక్షిణ, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా గాలి కోత (విండ్ డిస్కంటిన్యూ)తో ఉపరితల ద్రోణులు, ఆవర్తనాలు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
మార్చిలోనే 7 అసమతుల్యతలు
మార్చి నెలలోనే 7 వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏర్పడినట్టు గుర్తించారు. ఉపరితల ద్రోణులు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పడుతూ కోస్తాంధ్ర, రాయలసీమల మీదుగా కొనసాగుతుండటం వల్ల ఆయా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైతే వర్షాల ఉధృతి పెరగడానికి దోహదపడుతోంది.
వాస్తవానికి ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఏప్రిల్ ఆఖరులో మొదలవుతుందని, ఈ ఏడాది మార్చిలోనే ఆరంభమైందని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే తక్కువగానే నమోదవుతున్నాయన్నారు. ఇలాంటి వాతావరణం ఇటీవల కాలంలో ఎన్నడూ లేదని తెలిపారు. సముద్రం నుంచి తేమ గాలులు నిలిచిపోయే వరకు ద్రోణి, ఆవర్తనాలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందన్నారు.
ఉష్ణతాపాన్ని అదుపులో ఉంచాయి
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో వేసవి తాపం ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందారు. కానీ అం దుకు భిన్నంగా ద్రోణు లు, ఆవర్తనాలు ఉపశమనం కలిగించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న అరుదైన వాతావరణం వల్ల మే నెలలో థండర్ షవర్స్‌కు ఆస్కారం తక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నా రు. మే నెల ఆరంభం నుంచి ఉపరితల ద్రోణి బంగాళాఖాతం వైపు వెళ్లిపోతుందని, దీంతో అప్పట్నుంచి వేసవి తీవ్రత గణ నీ యంగా పెరుగుతుందని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment