SHYAM SARAN Article: Russia Ukraine Crisis And India Position In Telugu - Sakshi
Sakshi News home page

SHYAM SARAN Article On India Position: సరికొత్త విషమ సమస్యలో భారత్‌

Published Fri, Feb 25 2022 12:31 AM | Last Updated on Fri, Feb 25 2022 10:35 AM

SHYAM SARAN Article On Russia Ukraine Crisis And India Position - Sakshi

సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా చైనాను ప్రయోగించడంలో నాడు అమెరికా శరవేగంగా పావులు కదిపింది. సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత అమెరికాకు వ్యతిరేకంగా రష్యాను ప్రయోగించడంలో చైనా సరికొత్త అవకాశం దక్కించుకుంది. భౌగోళిక రాజకీయాల పరంగా సాగుతున్న ఈ వ్యూహ క్రీడ భారతదేశానికి ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయం. అత్యంత ప్రమాదకరమైన రష్యాతో తాను ఘర్షిస్తున్నట్లు అమెరికా భావించి చైనాతో నాటకీయంగా మరోసారి వ్యూహాత్మక ఒడంబడిక వైపు ప్రయాణిస్తే అది భారత్‌కు దుస్వప్నంగా పరిణమించవచ్చు. ఇలాంటి పరిణామాలను మనం అత్యంత నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. వీటి ప్రభావాలు భారత్‌ను కచ్చితంగా చుట్టుముడతాయి. తాత్కాలిక ప్రతిచర్యలకు దూకుడుగా సిద్ధపడటం కంటే దేశ ప్రయోజనాలను పరిరక్షించడమే భారత్‌ ముందున్న సదవకాశంగా భావించాలి.

Russia-Ukraine Crisis: అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ 1972 ఫిబ్రవరి 21న బీజింగ్‌లో పాదం మోపగానే నాటి చైనా ప్రధాని చౌఎన్‌ లీ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఆ దృశ్యం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్న భావనను కలిగించింది. ఆ సమయంలో నేను హాంకాంగ్‌లో చైనా జాతీయ భాష మాండరిన్‌ను అధ్యయనం చేస్తూండేవాడిని. టీవీలో నిక్సన్‌ చైనా సందర్శన ప్రత్యక్ష ప్రసారాన్ని ఆనాడు తిలకించాను. నా చైనా మిత్రుల్లో అయితే ఉద్వేగం, ఆందోళన సమానస్థాయిలో నెల కొన్నాయి. పాశ్చాత్య అగ్రరాజ్య నేత ఒకరు చైనా పాలకుడికి వందనం చేయడం చైనీయులను గర్వపడేలా చేసింది. ఇక వారి ఆందోళన విషయానికి వస్తే, ఉన్నట్లుండి మారిన ఈ నిర్దాక్షిణ్యమైన రాజకీయ పరిణామం తమ భవిష్యత్తును ఏం చేస్తుందన్న భీతి కూడా వారిలో కలిగించింది. ఆనాడు చైనాను ముంచెత్తుతున్న సాంస్కృతిక విప్లవం చైనా నాయ కుల, ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉండేది. అంతకు కొద్ది రోజుల ముందే, చైనా అధినేత మావో జెడాంగ్‌ తన వారసుడిగా ప్రకటించిన లిన్‌ పియావో మరణం గురించి ప్రపంచానికి తెలిసింది. మావోకు వ్యతిరేకంగా కుట్ర విఫలం కాగా దేశం నుంచి పారిపోతున్న క్రమంలో లిన్‌ పియావో మంగోలియన్‌ ఎడారిలో విమాన ప్రమా దంలో మరణించాడని ఆలస్యంగా ప్రపంచానికి తెలిసింది.

చైనా తలుపులు తెరుచుకుంటాయనీ, తదుపరి నాలుగు దశా బ్దాల క్రమంలో గణనీయమైన ఆర్థిక విజయాలవైపు ఆ దేశం ప్రయాణం సాగిస్తుందనీ, అసాధారణ సైనిక శక్తిని సంతరించు కుంటుందనీ ఆనాటికైతే ఎలాంటి సూచనా కనిపించేది కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఆనాడు చైనా విష యంలో అమెరికా శుద్ధ భౌగోళిక రాజకీయాలనే ప్రదర్శించింది. అంతేగానీ, పెట్టుబడిదారీ విధానాలను అవలంబించడం ద్వారా తమలో ఒకటిగా చైనా మారిపోతుందని కలలో కూడా అమెరికా భావించలేదు. చైనా విషయంలో కూడా ఇది నిజం. సోషలిస్టు పంథా నుంచి, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ నుంచి పక్కకు జరగడం అంటేనే భీతిల్లిపోయేలా మావో పాలన కొనసాగింది. మావో మరణించాక, డెంగ్‌ జియావో పింగ్‌ నాయకత్వంలో మాత్రమే చైనా ఆర్థిక సంస్కర ణలు, సరళీకరణ బాట పట్టడం సాధ్యమైంది. 

ఆనాడు అమెరికా, చైనా దేశాలకు భౌగోళిక రాజకీయాల పరంగా కలిగిన ప్రయోజనాలు సాధారణమైనవి కాదు. మూడు పక్షాలు కలిసి ఆడిన అధికారిక త్రికోణ క్రీడలో ప్రతి దేశం కూడా తక్కిన ఇరువురు విరోధులతో ఘర్షించేది. ఈ క్రమంలోనే 1972లో సోవియట్‌ యూని యన్‌కు పోటీగా చైనాను అమెరికా నిలబెట్టింది. సరిగ్గా 50 సంవత్స రాల తర్వాత ఈరోజు అమెరికాకు వ్యతిరేకంగా రష్యాను చైనా ఉసి గొల్పుతుండవచ్చు. నిక్సన్‌ చైనా సందర్శన ముగింపు సందర్భంగా 1972లో అమెరికా, చైనా మధ్య కుదిరిన షాంఘై ఒడంబడిక నాటి ప్రపంచంలో కొత్త భౌగోళిక రాజకీయ చిత్రపటానికి రూపురేఖలు దిద్దింది. 2022 ఫిబ్రవరి 4న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చైనా సంద ర్శించిన సమయంలో రష్యన్‌ సమాఖ్యకూ, ప్రజాతంత్ర చైనాకూ మధ్య కుదిరిన సంయుక్త ప్రకటన మళ్లీ అలాంటి పరిదృశ్యాన్నే ప్రపంచ రాజకీయ యవనికపై ముద్రించడం గమనార్హం.

ఆనాటికి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా వెలుగు తున్న అమెరికా (తన సాపేక్ష అధికారం పతనమవుతున్న విషయం బహుశా అమెరికా ఎరుకలో ఉండేది) తన కంటే బలహీన మైన దేశంగా ఉండిన చైనాను సోవియట్‌ యూనియన్‌కు వ్యతిరేకంగా ప్రయోగించింది. తన ప్రధాన ప్రత్యర్థి అయిన సోవియట్‌ యూని యన్‌ను ఆత్మరక్షణలో పడవేయడమే అమెరికా ఉద్దేశం. ఈ రెండు సందర్భాల్లోనూ కొత్త భాగస్వామి (చైనా) నుంచి భద్రతా పరమైన ప్రమాదం ఉండదు అనే అవగాహన ప్రాతిపదికనే రెండు శత్రుదేశాల మధ్య (అమెరికా, చైనా) ఒడంబడిక సాధ్యం అయిందని గుర్తించాలి. వీటి మధ్య సైద్ధాంతిక భేదాలు ఉండేవన్నది నిజమే అయినప్పటికీ భౌగోళిక రాజకీయ కోణంలో వ్యూహాత్మకంగా ఇరుదేశాలకూ పొత్తు కుదిరింది. అయితే ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి, 2007–2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చేంతవరకు అంటే కొన్నేళ్లపాటు ఏకధ్రువ ప్రపంచాధిపత్యాన్ని అమెరికా చలాయిస్తూ వచ్చింది. 

2008లో ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడిన ఆర్థిక సంక్షోభం అమెరికాకున్న సాపేక్ష ప్రపంచాధికారాన్ని, పలుకుబడిని చైనాకు తది తర అగ్రదేశాలకు మళ్లించింది. అమెరికా ఇలాగే బలహీనపడుతూ తన వ్యూహాత్మక ప్రాధాన్యం కోల్పోతూ వచ్చే కొద్దీ భావి ఏకధ్రువ ఆధిపత్య దేశంగా చైనా ఉషోదయాన్ని ఎవరైనా తిలకించవచ్చు. ఇది తప్పనిసరిగా సంభవించక పోవచ్చు కానీ చైనాకు అలాంటి అవకాశం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితి ఇండియా వంటి దేశాన్ని కలవరపెడుతుంది. ఇప్పుడు అమెరికా, చైనా, రష్యా మధ్య త్రిపక్ష సమీకరణంలో తీగ లాగే స్థితిలో చైనా ఉంది. యూరప్‌పై ఆధిపత్యం విషయంలో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుత ఇరకాటం నుంచి బయటపడే శక్తి అమెరికాకు ఉందని చెప్పడానికి వీల్లేదు. ఆ విధంగా అది చైనా సవాలును మరింత సీరియస్‌గా ఎదుర్కొనడంపై దృష్టి పెట్టే అవకాశమూ అంతంత మాత్రమే. అయితే, రష్యా పట్ల బద్ధశత్రుత్వాన్ని కొనసాగించడమే అమెరికా వ్యూహాత్మక అవకాశంగా మిగిలిపోవచ్చు. 1972లో ఒక నిర్దాక్షిణ్యమైన సామ్యవాద ప్రభు త్వంతో విందు ఆరగించడం నిక్సన్‌కూ, నాటి అమెరికా విదేశాంగ మంత్రికీ పెద్దగా అభ్యంతరం లేకపోయింది. కానీ ఇప్పుడు పుతిన్‌ ఆ లీగ్‌లో చేరిపోవడం గమనార్హం. రష్యా, చైనాల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం సరికొత్త భౌగోళిక రాజకీయ వ్యూహానికి నాంది పలకవచ్చు అనడంలో సందేహమే లేదు.

చైనాతో ఆర్థికపరంగా, వాణిజ్యపరంగా ప్రగాఢ సంబంధాలు కొనసాగిస్తున్నందున ఆ దేశంతో తలపడే అవకాశాలు అమెరికాకు తక్కువే అని చెప్పాలి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో సోవియట్‌ యూని యన్‌తో తలపడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి అమెరికాకు ఏర్పడ లేదు. ఉక్రెయిన్‌పై దాడిచేస్తే రష్యా మరింత తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు ఎదుర్కో వలసి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. భౌగోళిక రాజ కీయ వ్యూహపరంగా ఆర్థిక ఆంక్షలు అనే అస్త్రాన్ని అమెరికా ప్రయో గించవచ్చు కూడా. అయితే దీనివల్ల చైనా, రష్యా మధ్య భాగస్వామ్యం మరింత బలపడుతుంది. పైగా ఫ్రాన్స్, జర్మనీ వంటి అమెరికా ముఖ్య భాగస్వాములు రష్యాపై ఆర్థిక ఆంక్షలు ప్రయోగించడంలో అమె రికాతో చేతులు కలపడానికి ఇష్టపడటం లేదు. అలాగని, మరింత బల మైన ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్న చైనాకు వ్యతిరేకంగా వ్యవ హరించడానికి ఈ దేశాలు అసలే సిద్ధంగా లేవు. సూటిగా చెప్పాలంటే ఆసియాలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించడమే యూరప్‌కు శ్రేయస్క రంగా ఉంటుంది. దీనివల్ల చైనా ఏకధ్రువ ప్రపంచాధికారం మరింతగా బలపడుతుంది. కానీ రష్యాతో అమెరికా తలపడినట్లయితే ఈ పరిణామం అస్పష్టంగా మారిపోతుంది.

ఆనాడు నిక్సన్‌ చైనా పర్యటన యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 2007–2008 నాటి ఆర్థిక సంక్షోభ కాలం నుంచి ఇలాంటి ఆకస్మిక పొత్తులు ఏర్పడే క్రమం మరోసారి సంభవించే అవ కాశాలు పెరుగుతున్నాయి. ఇవి నిక్సన్‌ చైనా పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలను తేకపోవచ్చు. ఇలాంటి సన్నివేశాలను అత్యంత నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని వ్యూహాత్మక వివేచన డిమాండ్‌ చేస్తుంది. వీటి ప్రభావాలు భారత దేశాన్ని కచ్చితంగా చుట్టుముడతాయి. కాబట్టి తాత్కాలిక ప్రతి చర్యలకు దూకుడుగా సిద్ధపడటం కంటే దేశ ప్రయోజనాలను పరి రక్షించడమే భారత్‌ ముందున్న సదవకాశంగా భావించాలి.

శ్యామ్‌ శరణ్‌
భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement