వీఏకే రంగారావు వివిధ విషయాలపై విశేషమైన అవగాహన కల కదిలే గ్రంథాలయం. ఆయనది బహుముఖీన మైన ప్రజ్ఞ. ఒక రచయిత, కాలమిస్ట్, రికార్డ్ కలెక్టర్, డాన్సర్, జంతు ప్రేమి కుడు, సినీ సంగీత సాహిత్య విశ్లేషకుడు, పదాలూ జావళీల మీద పట్టున్నవాడూ ఆయనలో కొలువు దీరి వున్నారు. తెలుగూ, హిందీ పాత సినిమాల గురించీ, పాటల గురించీ సాధికారంగా చెప్పగలిగిన వ్యక్తి రంగా రావు ఒక్కరే. అంతే కాదు, పాటల పుట్టుపూర్వోత్తరాలు పట్టు కోవాలన్నా, నేపథ్య గాయకుల సమాచారం తెలుసుకోవాలన్నా రంగా రావే దిక్కు. రంగారావు సినీ సంగీత సాహిత్య విశ్లేష కులుగా రంగప్రవేశం చేసేనాటికి (1962) సినిమాలన్నా, సినిమా పాటలన్నా ‘మర్యాదస్తుల’కో చిన్నచూపుండేది. సినిమా పాటల్లో సాహిత్య విలువలు ఏం వుంటాయి? అనే అభిప్రాయం ప్రబ లంగా వుండేది.
అయితే ఆయన సినిమా పాటల్లో కూడా ఎలాంటి సాహిత్య విలువలున్నాయో, ఏ పదాన్ని ఎలా వాడారో, ఏ పాటలో ఏ సంగతి గొప్పగా వుందో, ఏ కంఠం ఎంత అందంగా పలుకు తోందో, ఏ కంఠంలో ఏ ప్రత్యేకత వుందో, ఏ సంగీత దర్శకుడు ఎంత ప్రతిభ గలవాడో తెలుగు పాఠకులకీ, శ్రోతలకీ విడమరిచి చెప్పారు. అలా ప్రజలలో ఉత్తమాభిరుచిని పెంపొందించారు. అంతే కాదు ఆయన సినిమా పాటల గురించీ, సినిమాల గురించీ రాసిన సంగతులు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో సంవత్సరాల వారీగా రాయడం వలన... ఒక రకంగా చరిత్రని దాఖలా పరిచి నట్టయింది. ఇది ముందు తరాల వారికీ, సినిమాల గురించి స్టడీ చేయాలనుకునే వారికీ ఉపయోగపడే ఒక పెన్నిధి.
ఇక రికార్డ్ కలెక్టర్‌గా ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. ఆయన 78 ఆర్‌ఎంపీ గ్రామ్‌ఫోన్ రికార్డులు సుమారు 52 వేలు సేకరించి వుంచారు. సుమారు 1975 ప్రాంతంలో 78 ఆర్‌ఎంపీ రికార్డుల విడుదల ఆపేశాక వీటి సేకరణ మొదలు పెట్టానని చెబుతారు. వీటిలో దేశ, విదేశ భాషల రికార్డులున్నాయి. ఆయన దగ్గర సుమారు లక్షా పాతికవేల ట్రాక్స్... అరవైకి పైగా భాషలలో వున్నాయని చెబుతారాయన. ఇందులో కొన్ని భాషలకి లిపి కూడా లేదంటారు. అయితే ఆయన కలెక్షన్లో కేవలం సినిమా పాటలే కాదు అన్ని రకాల పాటలూ వున్నాయి. 1904లో గ్రామ్ ఫోన్ కంపెనీ మొట్ట మొదట విడుదల చేసిన రికార్డు దగ్గర నుండీ వివిధ భాషలలో వచ్చిన ప్రయివేట్ రికార్డులూ, ప్రముఖుల ప్రసంగాలూ, జానపద గీతాలూ, కామిక్ రికార్డులూ, నాటకాలూ, కర్ణాటక సంగీతమూ, హిందుస్థానీ సంగీతమూ; గ్రీకూ, లాటిన్ సంగీతమూ వున్నాయి.
ఆయన కాలమిస్ట్‌గా వివిధ ఇంగ్లిష్, తెలుగు పత్రికలలో... సినిమా సంగీతం గురించీ, సంగీత దర్శకుల గురించీ, సినిమాల గురించీ చాలా విలువైన వ్యాసాలు రాశారు. మొట్టమొదట ‘సినీప్రభ’ అనే పత్రికలో ‘రికార్డ్ రివ్యూ’ అనే శీర్షికతో వ్యాసాలు రాసేవారు. ఆంధ్ర పత్రికలో 1962 ప్రాంతంలో ‘సరాగమాల’ అనే శీర్షికతో అప్పుడు మార్కెట్లో విడుదలయ్యే గ్రామ్‌ఫోన్ రికార్డుల సమాచారం గురించి రంగారావు రాసిన కాలమ్ బాగా పాపులర్ అయ్యింది. దీనికి స్ఫూర్తి బాబూ రావ్ పటేల్ ‘ఫిల్మిండియా’లో రాసిన ‘రికార్డ్స్ టు బై’ కాలమ్ అని చెబుతారు రంగారావు. ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, ప్రజామత, ఆంధ్రజ్యోతి, జ్యోతి, విజయచిత్ర, సినిమా రంగం, వార్త వంటి పత్రికలలో సరాగమాల, మానసో ల్లాసం, చిత్రరథుని చైత్రయాత్ర, హంసధ్వని, ఆలాపన అనే శీర్షికలతో వ్యాసాలు రాశారు. ఇంగ్లిష్ ‘స్క్రీన్’ పత్రికలో ‘ది సౌండ్స్ ఆఫ్ మ్యూజిక్’ శీర్షికతో హిందీ సినిమాల గురించి వ్యాసాలు రాశారు. ఇంకా ఆయన హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, మూవీలాండ్, శృతి, మద్రాస్ మెయిల్ వంటి పత్రికలలో ఇంగ్లిష్‌లో వ్యాసాలు రాశారు.
పబ్లిషర్‌గా రంగారావు ‘ఆనందమోహన కావ్యమాల’ పేరిట ప్రచురించిన పుస్తకాలు: కందుకూరి రుద్రకవి రాసిన ‘జనార్ద నాష్టకం‘, ఘంటసాల విదేశీ పర్యటన సందర్భంగా వేసిన పుస్తకం – ‘భువన విజయం’, ‘కొండగాలి తిరిగింది’–ఆరుద్ర రాసిన సినీ పాటల సంకలనం. ఆరుద్ర బయోగ్రఫీ –రంగారావే ఇంగ్లిష్‌లో రాసి ప్రచురించారు. ఇంకా ఆయన కొన్ని సంక్షిప్త శబ్దచిత్రాలు రూపొందించారు. అంటే మూడుగంటల సినిమాని గంటకి కుదించి కేసెట్లుగా, ఎల్‌పీలుగా విడుదల చేశారన్న మాట. పాటలు పాడగల పాత తరం నటీనటులను ఎన్నుకుని ‘అలనాటి అందాలు’ పేరుతో ఎల్‌పీలు రిలీజ్ చేశారు. బాలసరస్వతి, టంగుటూరి సూర్య కుమారి, భానుమతి, కన్నాంబ, నాగయ్య... వీరందరి పాటలూ అలనాటి అందాలలో వినడం ఒక అనుభవం. ఇవికాక కొన్ని ఎల్‌పీలు చేశారు. అవి –శ్రీకృష్ణ శరణం మమ, శ్రీరామ నామం శ్రీ కృష్ణ గానం; చిటారు కొమ్మన మిఠాయి పొట్లం – హాస్య గీతాలు, నాపేరు సెలయేరు – ఎల్లారీశ్వరి పాటలు. 2000 సంవత్సరంలో తెలుగు ఫిల్మ్ మిలీనియం పేరిట ఆయన పొందు పరిచిన మూడు గంటల సినీ సంగీతం అత్యంత అపురూప మైనదీ, అరుదైనదీ.
ఆయనకి అన్నమయ్య పదాలూ, క్షేత్రయ్య పదాలూ, సారంగపాణి పదాలూ, జావళీల మీద మక్కువ ఎక్కువ. ఆయన తనని తాను ‘అన్నమయ్య పద సేవకుడిని’ అని చెప్పుకుంటారు. ‘అన్నమయ్య పదాలలో లేనిది లేదు, రానిది రాదు’ అంటారు. ప్రయాణాలన్నా, కొత్తప్రదేశాలన్నా, కొండలూ గుట్టలూ ఎక్కడ మన్నా, ప్రాచీన ఆలయాలను సందర్శించడమన్నా, శాసనాలూ, శిల్పాల వంటివాటిని పరిశీలించడమన్నా అంతులేని ఆసక్తి. మల్లాది రామకృష్ణ శాస్త్రి ఆయన గురువు. ఆరుద్ర ఆయన మార్గదర్శి. తనకిష్టమైన, తానారాధించే మల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి మహానుభావుల ప్రసక్తి వస్తే నోటమాట రాదు. డగ్గుత్తిక పడిపోతుంది. ఇలాంటి విజ్ఞాన భాండాగారాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామా? ఆయన కాలమ్స్ రాయడం 2005లో ఆపేశారు. ఆయన దగ్గరున్న సమాచారమంతా ప్రజ లకు చేరే దారేది? ప్రస్తుతం వున్న డిజిటల్ యుగంలో ఆయన వీలైనన్ని వీడియోలూ, ఆడియో బుక్స్ చేసి తన దగ్గరున్న సమా చారాన్ని నిక్షిప్తం చేస్తే, కావలసిన వారికి ఎంతో ఉపయోగ పడుతుంది.
డాక్టర్ భార్గవి, వ్యాసకర్త రచయిత్రి, వైద్యురాలు
Comments
Please login to add a commentAdd a comment