vak rangarao
-
ఒక నడిచే గ్రంథాలయం లాంటి మనిషి
వీఏకే రంగారావు వివిధ విషయాలపై విశేషమైన అవగాహన కల కదిలే గ్రంథాలయం. ఆయనది బహుముఖీన మైన ప్రజ్ఞ. ఒక రచయిత, కాలమిస్ట్, రికార్డ్ కలెక్టర్, డాన్సర్, జంతు ప్రేమి కుడు, సినీ సంగీత సాహిత్య విశ్లేషకుడు, పదాలూ జావళీల మీద పట్టున్నవాడూ ఆయనలో కొలువు దీరి వున్నారు. తెలుగూ, హిందీ పాత సినిమాల గురించీ, పాటల గురించీ సాధికారంగా చెప్పగలిగిన వ్యక్తి రంగా రావు ఒక్కరే. అంతే కాదు, పాటల పుట్టుపూర్వోత్తరాలు పట్టు కోవాలన్నా, నేపథ్య గాయకుల సమాచారం తెలుసుకోవాలన్నా రంగా రావే దిక్కు. రంగారావు సినీ సంగీత సాహిత్య విశ్లేష కులుగా రంగప్రవేశం చేసేనాటికి (1962) సినిమాలన్నా, సినిమా పాటలన్నా ‘మర్యాదస్తుల’కో చిన్నచూపుండేది. సినిమా పాటల్లో సాహిత్య విలువలు ఏం వుంటాయి? అనే అభిప్రాయం ప్రబ లంగా వుండేది. అయితే ఆయన సినిమా పాటల్లో కూడా ఎలాంటి సాహిత్య విలువలున్నాయో, ఏ పదాన్ని ఎలా వాడారో, ఏ పాటలో ఏ సంగతి గొప్పగా వుందో, ఏ కంఠం ఎంత అందంగా పలుకు తోందో, ఏ కంఠంలో ఏ ప్రత్యేకత వుందో, ఏ సంగీత దర్శకుడు ఎంత ప్రతిభ గలవాడో తెలుగు పాఠకులకీ, శ్రోతలకీ విడమరిచి చెప్పారు. అలా ప్రజలలో ఉత్తమాభిరుచిని పెంపొందించారు. అంతే కాదు ఆయన సినిమా పాటల గురించీ, సినిమాల గురించీ రాసిన సంగతులు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో సంవత్సరాల వారీగా రాయడం వలన... ఒక రకంగా చరిత్రని దాఖలా పరిచి నట్టయింది. ఇది ముందు తరాల వారికీ, సినిమాల గురించి స్టడీ చేయాలనుకునే వారికీ ఉపయోగపడే ఒక పెన్నిధి. ఇక రికార్డ్ కలెక్టర్‌గా ఆయన చేసిన కృషి సామాన్యమైనది కాదు. ఆయన 78 ఆర్ఎంపీ గ్రామ్‌ఫోన్ రికార్డులు సుమారు 52 వేలు సేకరించి వుంచారు. సుమారు 1975 ప్రాంతంలో 78 ఆర్ఎంపీ రికార్డుల విడుదల ఆపేశాక వీటి సేకరణ మొదలు పెట్టానని చెబుతారు. వీటిలో దేశ, విదేశ భాషల రికార్డులున్నాయి. ఆయన దగ్గర సుమారు లక్షా పాతికవేల ట్రాక్స్... అరవైకి పైగా భాషలలో వున్నాయని చెబుతారాయన. ఇందులో కొన్ని భాషలకి లిపి కూడా లేదంటారు. అయితే ఆయన కలెక్షన్లో కేవలం సినిమా పాటలే కాదు అన్ని రకాల పాటలూ వున్నాయి. 1904లో గ్రామ్ ఫోన్ కంపెనీ మొట్ట మొదట విడుదల చేసిన రికార్డు దగ్గర నుండీ వివిధ భాషలలో వచ్చిన ప్రయివేట్ రికార్డులూ, ప్రముఖుల ప్రసంగాలూ, జానపద గీతాలూ, కామిక్ రికార్డులూ, నాటకాలూ, కర్ణాటక సంగీతమూ, హిందుస్థానీ సంగీతమూ; గ్రీకూ, లాటిన్ సంగీతమూ వున్నాయి. ఆయన కాలమిస్ట్‌గా వివిధ ఇంగ్లిష్, తెలుగు పత్రికలలో... సినిమా సంగీతం గురించీ, సంగీత దర్శకుల గురించీ, సినిమాల గురించీ చాలా విలువైన వ్యాసాలు రాశారు. మొట్టమొదట ‘సినీప్రభ’ అనే పత్రికలో ‘రికార్డ్ రివ్యూ’ అనే శీర్షికతో వ్యాసాలు రాసేవారు. ఆంధ్ర పత్రికలో 1962 ప్రాంతంలో ‘సరాగమాల’ అనే శీర్షికతో అప్పుడు మార్కెట్లో విడుదలయ్యే గ్రామ్‌ఫోన్ రికార్డుల సమాచారం గురించి రంగారావు రాసిన కాలమ్ బాగా పాపులర్ అయ్యింది. దీనికి స్ఫూర్తి బాబూ రావ్ పటేల్ ‘ఫిల్మిండియా’లో రాసిన ‘రికార్డ్స్ టు బై’ కాలమ్ అని చెబుతారు రంగారావు. ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, ప్రజామత, ఆంధ్రజ్యోతి, జ్యోతి, విజయచిత్ర, సినిమా రంగం, వార్త వంటి పత్రికలలో సరాగమాల, మానసో ల్లాసం, చిత్రరథుని చైత్రయాత్ర, హంసధ్వని, ఆలాపన అనే శీర్షికలతో వ్యాసాలు రాశారు. ఇంగ్లిష్ ‘స్క్రీన్’ పత్రికలో ‘ది సౌండ్స్ ఆఫ్ మ్యూజిక్’ శీర్షికతో హిందీ సినిమాల గురించి వ్యాసాలు రాశారు. ఇంకా ఆయన హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, మూవీలాండ్, శృతి, మద్రాస్ మెయిల్ వంటి పత్రికలలో ఇంగ్లిష్‌లో వ్యాసాలు రాశారు. పబ్లిషర్‌గా రంగారావు ‘ఆనందమోహన కావ్యమాల’ పేరిట ప్రచురించిన పుస్తకాలు: కందుకూరి రుద్రకవి రాసిన ‘జనార్ద నాష్టకం‘, ఘంటసాల విదేశీ పర్యటన సందర్భంగా వేసిన పుస్తకం – ‘భువన విజయం’, ‘కొండగాలి తిరిగింది’–ఆరుద్ర రాసిన సినీ పాటల సంకలనం. ఆరుద్ర బయోగ్రఫీ –రంగారావే ఇంగ్లిష్‌లో రాసి ప్రచురించారు. ఇంకా ఆయన కొన్ని సంక్షిప్త శబ్దచిత్రాలు రూపొందించారు. అంటే మూడుగంటల సినిమాని గంటకి కుదించి కేసెట్లుగా, ఎల్పీలుగా విడుదల చేశారన్న మాట. పాటలు పాడగల పాత తరం నటీనటులను ఎన్నుకుని ‘అలనాటి అందాలు’ పేరుతో ఎల్పీలు రిలీజ్ చేశారు. బాలసరస్వతి, టంగుటూరి సూర్య కుమారి, భానుమతి, కన్నాంబ, నాగయ్య... వీరందరి పాటలూ అలనాటి అందాలలో వినడం ఒక అనుభవం. ఇవికాక కొన్ని ఎల్పీలు చేశారు. అవి –శ్రీకృష్ణ శరణం మమ, శ్రీరామ నామం శ్రీ కృష్ణ గానం; చిటారు కొమ్మన మిఠాయి పొట్లం – హాస్య గీతాలు, నాపేరు సెలయేరు – ఎల్లారీశ్వరి పాటలు. 2000 సంవత్సరంలో తెలుగు ఫిల్మ్ మిలీనియం పేరిట ఆయన పొందు పరిచిన మూడు గంటల సినీ సంగీతం అత్యంత అపురూప మైనదీ, అరుదైనదీ. ఆయనకి అన్నమయ్య పదాలూ, క్షేత్రయ్య పదాలూ, సారంగపాణి పదాలూ, జావళీల మీద మక్కువ ఎక్కువ. ఆయన తనని తాను ‘అన్నమయ్య పద సేవకుడిని’ అని చెప్పుకుంటారు. ‘అన్నమయ్య పదాలలో లేనిది లేదు, రానిది రాదు’ అంటారు. ప్రయాణాలన్నా, కొత్తప్రదేశాలన్నా, కొండలూ గుట్టలూ ఎక్కడ మన్నా, ప్రాచీన ఆలయాలను సందర్శించడమన్నా, శాసనాలూ, శిల్పాల వంటివాటిని పరిశీలించడమన్నా అంతులేని ఆసక్తి. మల్లాది రామకృష్ణ శాస్త్రి ఆయన గురువు. ఆరుద్ర ఆయన మార్గదర్శి. తనకిష్టమైన, తానారాధించే మల్లాది రామకృష్ణ శాస్త్రి లాంటి మహానుభావుల ప్రసక్తి వస్తే నోటమాట రాదు. డగ్గుత్తిక పడిపోతుంది. ఇలాంటి విజ్ఞాన భాండాగారాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకుంటున్నామా? ఆయన కాలమ్స్ రాయడం 2005లో ఆపేశారు. ఆయన దగ్గరున్న సమాచారమంతా ప్రజ లకు చేరే దారేది? ప్రస్తుతం వున్న డిజిటల్ యుగంలో ఆయన వీలైనన్ని వీడియోలూ, ఆడియో బుక్స్ చేసి తన దగ్గరున్న సమా చారాన్ని నిక్షిప్తం చేస్తే, కావలసిన వారికి ఎంతో ఉపయోగ పడుతుంది. డాక్టర్ భార్గవి, వ్యాసకర్త రచయిత్రి, వైద్యురాలు -
ప్రణవానికి ప్రతిబింబం
నివాళి నేనాయన్ని మొదటిమారుగా చూసింది, విన్నది 1944లో. నా మేనమామ మేకా మువ్వగోపాల అప్పారావు పెళ్లి హైదరాబాదులో జరిగిన తరువాత, సొంత ఊరైన నూజివీడు తేలప్రోలు ఎస్టేటులో జరిగిందా కచ్చేరీ. ఆయన కప్పుడు 14 ఏళ్లుంటాయి కానీ చూడటానికి ఏడెనిమిదేళ్ల వానిలా ఉన్నాడు. నా వయస్సు అయిదు. కచ్చేరీ చివరి భాగం మాత్రం విని-- నాకు తెలుసు నాకు నచ్చేపాటలా సమయంలోనే పాడతారని--‘పదాలు, జావళీలు పాడలేదేం? అతనికి రావా!’ అని నేను నా అమ్మమ్మనడగటం, ‘చిన్నపిల్లాడేం పాడతాడు నీ సానివారి పాట?’ లని అమ్మమ్మ నన్ను గదమాయించడం నాకు గుర్తున్నది. నేను రికార్డులపైనా, ముఖతా గడ్డిభుక్త సీతారాం వద్ద (ఆమె బొబ్బిలి వేణుగోపాలుని నృత్యసేవకే కాక బొబ్బిలి సంస్థాన నర్తకి కూడాను. మా చిన్నతనంలో మేముండే రాణి వాసానికి రోజూ వచ్చి, నేను కోరిన పాటలు పాడేది) పాటలే వినడానికి యిష్ట పడేవాణ్ణని అమ్మమ్మకు తెలుసు. ఆ సమయంలోనే నేను బెంగుళూరు నాగరత్నమ్మ కచ్చేరీ కూడా విన్నాను. ఆమెతో నాకు చనువు కనుక ‘నేనే జాణ’ పాడలేదేమని అడిగాను. ఆ రికార్డు నాకెంతో ఇష్టం. ‘నీ కోసం పాడతాన్నాయనా’ అంటూ నన్ను ఒళ్లో కూర్చోబెట్టు కుని పాడారు. ‘బాలమురళిది సంగీతమూ కాదు, కర్ణాటకమూ కాదు, అదొక ఓంకార మమ్మా! అయ్యవారి (అంటే త్యాగయ్య) ప్రణవానికి ప్రతిబింబం’ అని నాగ రత్నమ్మ మా అమ్మతో ఎన్నో మార్లు అన్నారట. మళ్లీ ఆయన్ను తరచూ చూడటం కుటుంబ సమేతంగా వారు మద్రాసుకి తరలివచ్చిన తరువాతనే! ఆయనతో సాన్నిహిత్యం, భార్య అన్నపూర్ణమ్మ గారితో, పిల్లలతో పరిచయం. క్రమేణా బాలమురళీగారితో చనువు ఏర్ప డింది. ‘ఇది మీరు సరిగా పాడలేదు. ఆ పాటకు వరస బాగా కట్టలేదు’ అనే వాడిని. నా సంగీత పరిజ్ఞానమెంతటిదో ఆయనకు బాగా తెలుసును గనుక చిరునవ్వేసేవారు. 1970 ప్రాంతంలో ఆయన గ్రామఫోను కంపెనీకి అన్నమా చార్యుల సంకీర్తనలొక ఎల్.పి ఇచ్చారు. అన్నమయ్య పాటల తొలి ఎల్.పి యిదే. ఆ తరువాతనే శ్రీరంగం గోపాలరత్నం, ఎం.ఎస్ సుబ్బులక్ష్మి తది తరులు. ఆ ఎల్.పికి ‘స్లీవ్ నోట్స్’ (కవరు మీది వివరణ) వ్రాయమని నన్ను హెచ్.ఎమ్.వి రికార్డింగ్ ఆఫీసరైన పి. మంగపతి అడిగారు, బహుశా బాలమురళి అనుమతితోనే. వ్రాశాను. బాగా వచ్చింది. రాకేం? సంగీతమంటే ఆసక్తి, ఆ గాయకుడంటే గౌరవం, శ్రీమల్లాది రామకృష్ణశాస్త్రి వనమాలల ద్వారా అన్నమ య్యంటే భక్తి ఉండగా! ఈ పాటల్లో రెండిటికి వరసలు అన్నమయ్య అంతరంగంలోంచి దొంగి లించి చేసినవి (రాగి రేకులపైనున్న రాగాలలో కాదు). ‘ఇందరికి నభయంబు లిచ్చు చేయి’ - అన్న దశావతార సంకీర్తనొకటైతే, ‘కొమ్మ తన ముత్యాల కొంగు జారగ’ - రెండవది. ఇందులో అమ్మవారు నిదురించే తీరులో మదాలస భంగి మలు చెలికత్తెలచే పారిజాత పూరేకులంత లలితంగా వర్ణితం. ఈ రెండింటినీ వారి అనుమతితో నేనెన్నోమార్లు శ్రీనివాస మంగాపుర కల్యాణ వేంకటేశ్వరుని సాక్షాత్కార వైభవ సమయంలోనూ (ఆషాఢ శుద్ధ సప్తమి), కార్వేటినగర వేణుగోపాలుని పుట్టిన రోజునా (గోకులాష్టమి) ఒక యాభై సంవత్సరాలు ఆ ట్రాక్స్ ఉపయోగించి నృత్యనివేదనగా చేశాను. ఏం చెయ్యకూడదా! అన్నమయ్య అనలేదూ... ఏనుగుపైనా, కుక్కపైనా ప్రసరించే ఎండ ఒక్కటేనని? ఆ ఎల్.పి.కి ముఖపత్రం బాపు చేత వేయించమని ఆ కుంఫిణీ వారిని వేధించాను. అన్నమయ్య-మురళీ పాటలకు తగిన ట్లు నా విన్నపం విని, బాపు బంగారు వాకిలిలోన ఆ కలియుగ కృష్ణుడు కనబడేటట్లు వేశారు. ఇవన్నీ బాలమురళికి నచ్చాయి కాబోలు... తదుపరి భద్రాచల రామదాసు కీర్తనల ఎల్.పి.కి, తనే పాడి, వాయులీనం, మృదంగం వాయించిన ఒక ఈ.పి.కి అలాగే వ్రాయించుకున్నారు. ఇందులో వినిపించే బాలమురళి విద్వత్తు ఎంత టిదో, హెచ్.ఎమ్.వి రికార్డింగు ఇంజినీరు రఘునాథన్ శబ్దగ్రాహక నైపుణ్యం అంతటిది. మొదట పాట, జాగాలతో రికార్డు చేసి, ఆ తరువాత మృదంగం, చివర వాయులీనం జాగ్రత్తగా ఆ జాగాలలో బిగించడం అప్పటి పరికరాలతో, యింద్రజాలమే. ఆ తరువాత హెచ్.ఎమ్. మేహ శ్ అన్నతను ‘సంగీతా’ కంపెనీ స్థాపించి, తక్కిన కంపెనీలన్నీ పాతికేళ్లలో చేసింది ఒక ఐదేళ్లలో సాధించాడు. ఈ మాస్టర్ రికార్డింగు కంపెనీకి బాలమురళీ... పదీ యిరవై కాదు వందకు పైగా పలు భాషల్లో కేసెట్లు రికార్డు చేశారు. అప్పుడొక తమాషా జరిగింది. ఈ మహేశ్ సరస్వతీ స్టోర్స్‌కి (కొలంబియా) కన్నడ విభాగంలో పనిచేసినప్పటి నుంచి నా హితుడు. ఒక ఎల్.పి.కి నాతో మొదటిమారుగా స్లీవ్నోట్స్ వ్రాయించిందితనే. వీరికి బాలమురళీ త్యాగయ్య ‘నౌకా చరిత్రం’ లోని కొన్ని పాటలొక కేసెట్టు చేయగా ఇన్లే కార్డు మీద రెండు వాక్యాలు వ్రాయమని అడిగితే వ్రాశాను. ఎప్పటి లాగా నేను వ్రాసింది ప్రూఫ్ చూపేటప్పుడు దానిపై ‘సంగీతం అభయాంబిక’ అని ఉంటే అలా వేయకూడ దన్నాను. ‘ఆమె రికార్డింగుకి ఎంతో తోడ్పడ్డారు. అలా వేసి తీరాలి’ అన్నారు. ‘అయితే నేను వ్రాయను’ అని తుమి తేల్చేశాను. ఆ ఇన్లే కార్డు చూసి ‘రంగా రావు పరిచయ వాక్యాలు లేవేం?’ అని బాలమురళి అడిగితే, నసుగుతూ, నాన్చుతూ చెప్పేరట - ‘సంగీతం ఫలానా’ అని వేస్తే వ్రాయనన్నాడని! వాళ్లనే గసిరి ‘త్యాగరాజు కీర్తనలకు సంగీతం మరొకరా? కావలిస్తే ఆర్కెస్ట్రేషన్’ అని వేయండన్నారట! అలా నా పక్షం వహించారు బాలమురళి. ఇంతకూ అభ యాంబిక ఎవరు? ఆనాడు బాలమురళి నియామకాలు చూసే ఆంతరంగిక కార్యదర్శి. ఆమెతో నాకు సఖ్యమే. చిన్నతనంలో తన యిద్దరు సోదరీమణులతో నాట్య ప్రదర్శనలివ్వడమే గాక, రంగవల్లుల ఎగ్జిబిషన్‌ను చేసేవారు. ఒకమారు ఆమె, బాలమురళి ప్రోత్సాహంతో బెంగుళూరు నాగరత్నమ్మ పాత పాటలు కేసెట్టుపై విడుదల చేద్దామని నా రికార్డులడిగితే వాటినామెకు ఇచ్చాను. పని జరిగిన తరువాత నా ప్రాణాలను భద్రంగా నాకు తిరిగి యిచ్చారు. ‘సంగీతా’ వారికి బాలమురళి పాడిన కేసెట్లలో నాకు బాగా నచ్చినవి అష్టపదులు, తరంగాలు, క్షేత్రయ్య పదాలు, భరత నాట్యాంశాలు కలిగిన ఒక కార్యక్రమం, తిల్లానాలు. ఆ తిల్లానాలన్నీ వీనుల విందు చేసేవే. కానీ వాటిలో కుంతల వరాళి తిల్లానా అంటే పిచ్చి యిష్టం. నేనెరిగిన నిష్ణాతులైన స్త్రీపురుష నాట్యకళాకారులెందరికో వీటి గురించి చెప్పాను, అడిగాను, ప్రాథేయపడ్డాను... ‘దీనిని రంగమెక్కించండీ’ అని! ‘అబ్బా, చాలా కష్టమైనదండీ!’ అని తప్పించు కున్నారు. చివరికి శాంత - ధనుంజయన్లు (నేనప్పుడు వారి వద్ద భరతనాట్యం నేర్చుకుంటున్నాను) దానికి రంగస్థలంపై ఒక అపూర్వమైన రూపం కల్పించారు, దాదాపు 45 సంవత్సరాల క్రిందట. బాలమురళి కృతిని భరత నాట్యానికి - బంగారుకి పరిమళం- జోడించటానికి వారు ఆడిందే నాంది! ఒకప్పుడు, 1965 ప్రాంతంలో నేను మద్రాసు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కి సంగీత కచ్చేరీల గురించి వ్రాస్తుండేవాడిని. ఒక కచ్చేరీలో బాలమురళి పాడిన తీరుని విమర్శించాను ‘మధ్య మధ్య వెనుక తంబూరా వేస్తున్న వ్యక్తిని (ఎవరో కాదు, తన కుమార్తె) తిరిగి చూడటమేమిటి! మైక్‌కి దూరమై పాట వినపడటం తగ్గిపోదా! రేడియోలో అంతకాలం పనిచేసిన వారికి మైక్ ప్రాముఖ్యం తెలి యదా!’ అంటూ. ఆయన్ని ‘కొడు’కంటూ ముద్దుచేసే నా అక్క ఇందిరాదేవితో (బొబ్బిలి రాకుమారి, ఆకాశవాణి వీణా విదుషి, బహుమతులు పొందిన చిత్ర కారిణి) సగం నవ్వుతూ అన్నారట - ‘అమ్మా! మీ తమ్ముడికి నా పాట నచ్చలే’ దని! అక్క నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా అయిదు నిమిషాలు ఝాడించింది. ‘బాలమురళి పాటను విమర్శించేటంతటి వాడివా నీవు?’ అంటూ. తిల్లానాలు యిటీవలి విద్వాంసులెందరో చేశారు. అవి వారి వారి కంఠాల, వాద్యాల సొగసును యినుమడింప జేయడానికే రూపొందించబడ్డాయి. నాట్యా నికన్నీ అంతగా నప్పవు. బాలమురళీ తిల్లానాలు (ద్విజావంతి, బృందావన సారంగ, కదన కుతూహలం యిత్యాది) అలా కాదు. నాట్యం కోసమే తీర్చిన ట్లుంటాయి. ఇప్పుడాయన తిల్లానాలతో ఎందరో అందలమెక్కి ఊరేగుతు న్నారు, నాతో ఆనాడు ‘అబ్బా కష్ట’మన్నవారు కూడా! బాలమురళి దాదాపు ఏది పాడినా ‘దీనికి నాట్యం చెయ్యరూ?’ అని గోముగా అడిగినట్లుంటుంది. నూరేళ్లుగా దక్షిణ దేశంలో ‘కృష్ణం కలయసఖి సుందర’ మన్న తరంగాన్ని ముఖారి రాగంలో పాడుతున్నారు. 75 సంవత్సరాల కిందట త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి రికార్డు విన్నా, బాలమురళిది విన్నా మనసు గంతులు వేస్తుంది. కాళిందీతట తరికిటతోమ్లను కంటికి కట్టిస్తుంది. పదమైనా అంతే. ‘అలిగితే భాగ్యమాయే’ (క్షేత్రయ్య, హుసేని) ఆయన పాడగా వింటే అరసొంపు మాటలాడే ఆ ధూర్తుని దుండగీడుతనాన్నెలా ఆ ముగ్ధ ఓర్చుకుంటున్నదో అనీ, అయ్యో పాపం ఆ అబలాయ కబళాయ వాడి పాల బడిందా అనీ కంటనీరు పెట్టిస్తుంది. తన సంగీతానికెన్నో అన్నమయ్య సంకీర్తనలు పాడిన బాలమురళి మూడో నాలుగో వక్కలంక సరళారావు (ఆనాడు ‘కీలుగుర్రం’లో ఘంటసాలతో కలిసి ‘కాదు సుమా కల కాదు సుమా’ పాడిన గాయకి) వరసలకు ఒక కేసెట్లో పాడారు. ఆ చూడామణిలో కోహినూర్లు ‘చలిగాలి వెడ యేల చల్లీని’ (బృందా వని, సరళతో), ‘ఎంత దవ్వైననేమి’ (బాగేశ్రీ, నాట్యకళాకారిణి స్వప్న సుందరితో). రాగంలో సంగతి, అన్నమయ్య సంకీర్తనల స్వరకర్తగా సరళ ఎవ్వ రికీ తీసిపోదు. అందుకనే అడగ్గానే బాలమురళి ఆమెకు పాడటం. అష్టపదులలో చివరిది ‘నిజగాదస యదునందనే’ ఒక రాజహంస. సరసాలంతా జరిగిన తరువాత రాధ కృష్ణునితో సరాగాలు. యిలా ఎన్నో. నాట్య కళాకారులు వీటిని భరతనాట్య, కూచిపూడి, విలాసిని, మోహినీ ఆట్టం, మణిపురి, సత్రియ, కథక్ పద్ధతులలో గజ్జకడితేనా, అద్దిరభన్నా! ఈ క్రింది విషయం నాతో పద్మాసుబ్రహ్మణ్యం (భరతుని నాట్యశాస్త్రం నా తలకెక్కించే ప్రయత్నం చేసిన ధీరవిదుషి) చెప్పారు. ‘‘ఒకమారు బాలమురళి, నేను కచ్చేరీ నిమిత్తం రైల్లో వెళుతున్నాం. ‘ఒక జావళి నీ కోసం చేస్తా’ నంటూ అప్పటికప్పుడు ధారతో ‘మరులు మించెరా’ అన్నది నవరోజులో చేశారు. ఈ విషయం చెప్పి, అక్కడ దానికి నేను అభినయం పడితే, చూసినవారెంత మెచ్చుకున్నారో చెప్పలేను!’’. మెచ్చుకోక ఏం చేస్తారు? ఆ పాటలో మాటలు - ఒక ప్రౌఢ మరులు మించెరా అని వగలు పోతుంటే వినడం - మాంఛి ఎండాకాలంలో గాలి ఆడక బిగపట్టిన వేళ పచ్చకర్పూరం కలిపిన చందనం వీపుకి తమలపాకుతో పూసినట్లూ, గొంతు తడారిపోయినప్పుడు నిమ్మ నీరులో కాస్త తుహినమూ, తేనే కలిపి త్రాగించినట్లూ ఉంటుంది. నిజం. ఆయనకు సంగీతం తెలియదు. సంగీతానికి ఆయన తెలుసు. కాబట్టే ఆయన తనువిప్పుడు మనలో లేకపోయినా తను విడిచి వెళ్లిన విమల గాంధర్వం మనిషి ఉన్నంతవరకు మనసుకి ఆహ్లాదం కలిగిస్తూనే ఉంటుంది. ఇప్పుడాయన ఉనికి గోలోకంలో (కృష్ణగానం చేసిన వారి పరమావధి గోలోకమనే నా విశ్వాసం). అక్కడ జుగల్బందీ చేస్తే ఆ పెద్ద మురళీ వాడి ముందు బాలమురళి నీడను పడతాడా అన్నది పక్కనున్న మల్లాది రామకృష్ణ శాస్త్రే నిర్ణయించాలి! వి.ఎ.కె. రంగారావు వ్యాసకర్త ప్రముఖ కళా, సంగీత విమర్శకులు, చెన్నై మొబైల్: 094447 34024