ఇంగ్లిష్‌ ఫోబియాతో అసలుకే మోసం | students suffer more with english phobia | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ ఫోబియాతో అసలుకే మోసం

Published Sat, Aug 8 2020 4:24 AM | Last Updated on Sat, Aug 8 2020 4:47 AM

students suffer more with english phobia - Sakshi

మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) కొన్ని రంగాల్లో ఆహ్వానించదగిన మార్పును తీసుకొచ్చింది. ఉన్నత విద్యారంగంలో అది వివిధ శాస్త్రాలను నేర్చుకునేందుకు అవకాశం కల్పించింది. లెక్కకు మించిన పరీక్షల అపస్వరాల స్థానంలో కళాశాల స్ధాయిలో ఉమ్మడి ప్రవేశపరీక్షకు తెర తీసింది. అలాగే దేశ జీడీపీలో 6 శాతం మేరకు విద్యకు కేటాయిస్తానని హామీ ఇచ్చింది కూడా.


అయితే వీటన్నిటినీ కాస్త పక్కనబెట్టి ఇంగ్లిష్‌ బోధన అనే తీవ్ర సమస్య గురించి మాట్లాడుకుందాం. భాషాపరమైన జాతీయవాదం పట్ల తన అనురక్తికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం 5వ తరగతి వరకు విద్యార్థి మాతృభాష (లేక స్థానిక, ప్రాంతీయ భాష)ను బోధనా మాధ్యమంగా కొనసాగించనున్నట్లు తెలిపింది. అయితే ఇది కొత్తదేమీ కాదు. అనేక సంవత్సరాలుగా, జాతీయ అభిమానం, వలసవాద వ్యతిరేక ఆగ్రహం వంటివాటితో సహా అవాంఛనీయమైన మనోభావాల ప్రాతిపదికన ఇంగ్లిష్‌కి వ్యతిరేకంగా దేశంలో సుదీర్ఘ యుద్ధం కొనసాగడాన్ని చూస్తూ వచ్చాం. ఇటీవల కాలంలో కూడా ఇంగ్లిష్‌పై యుద్ధం అనేది ప్రజాకర్షక రాజకీయాలకు కేంద్రబిందువై నిలిచింది.  భాషాపరమైన యుద్దం 1950ల ప్రారంభం నుంచే మన దేశంలో కొనసాగుతూ వస్తోంది. ఆ రోజుల్లో ఇంగ్లిషు పట్ల పేరుకుపోయిన ఆగ్రహానికి వ్యతిరేకంగా నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ భారతీయ అధికారిక భాషల్లో ఇంగ్లిష్‌ను కూడా ఒకటిగా చేర్చాలని పోరాడారు. దశాబ్దాలపాటు ఆ విధానం మంచి ఫలితాలను తీసుకొచ్చింది. బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ప్రజలు తీవ్రంగా ద్వేషించినంత స్థాయిలోనే ఈరోజు ఇంగ్లిష్‌ ఒకే ఒక నిజమైన ప్రపంచ భాషగా మారిపోయింది. ప్రపంచ వాణిజ్యాన్ని, రాజకీయాలను, చివరకు విజ్ఞాన సృష్టిని కూడా ప్రస్తుతం ఇంగ్లిష్‌ భాషే నిర్దేశిస్తోంది.

అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు తమ సంపదను వస్తూత్పత్తి రంగం ద్వారా సృష్టించుకోగా, భారత్‌లో ఆలస్యంగా వచ్చిన ఆర్థిక వికాసం.. సమాచార సాంకేతికత, పార్మాసూటికల్స్, చివరకు రిటైల్, ఆతిథ్య రంగాలలో అత్యున్నత సేవల ఎగుమతిపై ఆధారపడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం సిద్ధించిన తొలి దశాబ్దాల్లో సాంకేతిక విద్యలో పెట్టిన భారీ పెట్టుబడి వల్ల ప్రతిభావంతులైన ఇంజినీర్లను సమృద్ధిగా రూపొందించింది. వీరు చౌకగా లభించే శ్రామికుల కోసం చూస్తున్న బహుళ జాతి కంపెనీలనుంచి విదేశీ పెట్టుబడిని దేశంలోకి ఆకర్షించగలిగారు. అదేవిధంగా భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అంతరిక్ష సంస్థను (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ–ఇస్రో) అభివృద్ధి చేశారు. ఈ అన్ని అంశాల్లో ఇంగ్లిష్‌ నిర్వహించిన పాత్రను తొలినుంచి చాలా చిన్న చూపు చూస్తూ వచ్చారు. భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞానాన్ని అతి సులువుగా పొందడాన్ని ఇంగ్లిష్‌ సుసాధ్యం చేసింది. ప్రపంచంలోని ప్రతి చోటా వాణిజ్య వర్గాలతో కలిసి పనిచేయడంలో, ప్రపంచ మార్కెట్లలో తమ వస్తు సేవలను పోటీపడుతూ విక్రయించడంలో భారతీయులకు ఇంగ్లిష్‌ ఎంతగానో సహకరించింది. జనరల్‌ ఎలెక్ట్రిక్‌ సంస్థ దివంగత చైర్మన్‌ జాక్‌ వాలెచ్‌ మాటల్లో చెప్పాలంటే, ‘భారత్‌ అభివృద్ది చెందిన మేధో సామర్థ్యం కలిగిన అభివృద్ది చెందుతున్న దేశం’. ప్రవాస భారతీయుల అభివృద్ధికి కూడా ఇంగ్లిష్‌ ఎంతగానో దోహదపడింది. ఇతర ఆసియన్‌ దేశాల ప్రజల్లాగ కాకుండా, భారతీయులు ఇంగ్లిష్‌ భాషాజ్ఞానంలో, అనేక భాషల్లో తమ సమర్థత కారణంగా ఎక్కడకు వెళ్లినా, నివసించడంలో, పనిచేయడంలో స్వల్పకాలంలోనే, సులువుగా సమీకృతమై ముందుకు నడిచేవారు.

వస్తువుల ఉత్పత్తిపై మనుగడ సాగించే దేశాలు విద్యలో భాషాపరమైన జాతీయవాదాన్ని భరాయించుకోగలవు. ఫ్యాక్టరీ ఉద్యోగాలలో ఉండే వారు విదేశీ సంస్కృతులకు చెందిన వ్యక్తులతో రోజువారీగా వ్యవహారాలు నడపాల్సిన అవసరం లేదు. కానీ భారత్‌ వస్తూత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేసుకునే మార్గంలో ఎన్నడూ పయనించి నట్లు కనిపించదు. వస్తూత్పత్తికి అత్యవసరమైన వనరుల సులభ కేటాయింపు, సమర్థవంతమైన ఉన్నతాధికార వర్గాన్ని రూపొందించే విషయంలో భారత రాజకీయవర్గాలు సంక్లిష్టంగా ఉంటూవచ్చాయి. అయినప్పటికీ సేవారంగాలు కల్పించిన వికాసంలో భారత్‌ వెనుకబడిలేదు. ఒక తరంలోపే భారత్‌ సామాజిక చలనపు నిచ్చెనమెట్లపైకి వివిధ వర్గాల వ్యక్తులను పంపించగలిగింది. ఉదాహరణకు ఇస్రో ప్రస్తుత చైర్మన్‌ కె. శివన్‌ ఒక రైతు కుమారుడు. అయితే భారత్‌ తన సేవలపై ఆధారపడిన అభివృద్ధి గాథను మరింత ముందుకు తీసుకెళ్లలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇంగ్లిష్‌తోపాటు నాణ్యమైన విద్యను ప్రజారాశులకు అందించడంలో దాని వెనుకబాటుతనమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో, భవిష్యత్‌ తరాలకు ఇంగ్లిష్‌ ప్రావీ ణ్యతను దూరం చేయడం అనేది అర్ధరహితం. ఇంగ్లిష్‌పై సరికొత్త యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా జనాభాపరమైన అనుకూలతను భారత్‌ దూరం చేసుకోవడమే కాకుండా దాని యువతకు ప్రపంచస్థాయి అవకాశాలను దక్కకుండా చేస్తోంది. పిల్లలు తమ మాతృభాషలోనే ఉత్తమంగా నేర్చుకోగలరని కొంతమంది వాదిస్తున్నారు. కానీ వాస్తవానికి మాతృభాషలు అనేవి జన్యుపరంగా తరం నుంచి తరానికి బదిలీ అయ్యేవి కావు. ఏ సమాజంలో అయినా 3–4 సంవత్సరాల ప్రాయంలోనే పిల్లలు భాషలను నేర్చుకుంటారు. అంటే ఇంగ్లిష్‌ ప్రావీణ్యతను పెంచుకోవాలంటే పిల్లలకు ప్రీ స్కూల్‌ స్థాయిలోనే ఇంగ్లిష్‌ నేర్పాల్సి ఉంది.

ప్రాథమిక పాఠశాల దశలో ప్రాంతీయ భాషలనే నేర్పాలని నూతన విద్యావిధానం చెబుతుందంటే అది ఈ శాస్త్రసంబంధ అంశాన్ని ఎదుర్కొనలేక పలాయనం చిత్తగిస్తోందని అర్థం. పిల్లలు పెద్దవారయ్యే కొద్దీ కొత్త భాషలను నేర్చుకునే ప్రావీణ్యం వారికి కష్టమవుతుంది. ఇలాంటి పిల్లలే యూనివర్శిటీ స్థాయి విద్యలో గణనీ యంగా వెనుకబడిపోతుంటారు. ఎందుకంటే వారు ఆ దశలో తమ ఇంగ్లిష్‌ భాషను మెరుగుపర్చుకోడానికి, ఇంగ్లిష్‌లో ఉంటున్న సబ్జెక్టును నేర్చుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది.  ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, వీరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకుని బయటపడిన తర్వాత ప్రపంచ మార్కెట్లో ఉద్యోగాలకు పోటీ పడాలన్నా, విదేశాల్లో ఉన్నత విద్య సాగించాలన్నా చాలా కష్టమైపోతోంది. వీటన్నింటి ఫలితంగా దేశంలో వర్గప్రాతిపదికపై అసమానత్వం పెరిగిపోతోంది. నగరాల్లో ఖర్చుతో కూడిన ఇంగ్లిష్‌ మీడియం విద్యను పొందగలుగుతున్న వారు ప్రతిభ విషయంలో గ్రామీణ విద్యార్థులను సునాయాసంగా దాటి ముందుకెళుతున్నారు.

ఇటీవల సంవత్సరాల్లో చైనీయులు సైతం ఈ సత్యాన్ని అంగీకరించడం మొదలెట్టారు. చరిత్రలో చూస్తే, భూమ్మీద సాంస్కృతికంగా స్వీయ రక్షణ విధానాన్ని అమలు చేస్తున్న దేశాల్లో చైనా అగ్రగామిగా ఉంటూ వచ్చింది. పైగా ఇంగ్లిష్‌ పట్ల దాని వైఖరిలో కూడా పెద్దగా తేడా ఉండేదికాదు. కానీ 2017లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం చైనా ఇప్పుడు ఇంగ్లిష్‌ మీడియం ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ని ప్రపంచంలోనే ఎక్కువగా కలిగి ఉంటున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉంటున్నట్లు వెల్లడయింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో కూడా ఇంగ్లిష్‌ విద్య పట్ల డిమాండ్‌ చైనీయుల్లోనే అత్యధికంగా ఉంటోందని పై నివేదిక సారాంశం. ఎందుకంటే ఇంగ్లిష్‌ విద్య అంతర్జాతీయ అవకాశాలను కొనితెస్తోందని వారికి అవగతమైంది. ఇతర సబ్జెక్టులను ఇంగ్లిష్‌లో నేర్పడానికి తగిన నాణ్యమైన ఇంగ్లిష్‌ టీచర్లను వెదికిపట్టుకోవడం చాలా కష్టం కాబట్టి ప్రాంతీయ భాషలకే ప్రాధాన్యత ఇవ్వాలని కొద్దిమంది విమర్శకులు వాదిస్తున్నారు. అయితే చైనా ఇప్పుడు పశ్చిమ దేశాలనుంచి యువ గ్రాడ్యుయేట్లను ఒకటి లేక రెండు సంవత్సరాలు ఆహ్వానించి యువ చైనీయులకు ఇంగ్లిష్‌ బోధిం చడం ద్వారా ఈ అంతరాన్ని పూడ్చాలని ప్రయత్నిస్తోంది. ఈ విధానాన్నే భారత్‌ కూడా అమలు పర్చాలి. పైగా ఈ విషయంలో తక్కిన ఆసియా దేశాల కంటే భారత్‌ ఇప్పటికే చాలా ముందుంది. పట్టణ మధ్యతరగతి ప్రజల బాగు కోసం భారత్‌ యువ టీటర్లను బయటి నుంచి రప్పించుకోవచ్చు. ఇది అమలులోకి వచ్చేలా భారతప్రభుత్వం ఒక నిర్దిష్ట కార్యక్రమాన్ని రూపొందించాల్సి ఉంది. ఇంగ్లిష్‌పై యుద్ధం అనేది రాజకీయంగా అర్ధవంతంగానే కనిపించవచ్చు కానీ అది భారతీయ సహజ ఆర్థిక బలాలను వెన్నుపోటు పొడుస్తుంది. జనాభా పరంగా భారత్‌ ప్రయోజనాలకు ఇది నిజంగా దుర్వార్తే మరి.

(ఫ్రీడమ్‌ గెజెట్‌ సౌజన్యంతో)
వ్యాసకర్త చీఫ్‌ ఎడిటర్, ఫ్రీడమ్‌ గెజెట్‌
మహమ్మద్‌ జీషాన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement