ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై తెలుగుదేశం గగ్గోలు పెడుతోంది. అసలు రాష్ట్రంలో కరెంటే లేదేమోనన్న రీతిలో వీరి మీడియా ప్రచారం ఉంది. చంద్రబాబు హయాంలో సౌర విద్యుత్‌కు యూనిట్‌కు నాలుగున్నర రూపాయలకు పైగా పెట్టి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. జగన్ ప్రభుత్వం దాన్ని సమీక్షించి రేట్లు తగ్గించడానికి ప్రయత్నిస్తే ఇదే టీడీపీ, దాని మీడియా... రేట్లు తగ్గిస్తే పెట్టుబడులు రావని వాదించాయి. ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచితే అమ్మో ఎలా పెంచుతారని ప్రశ్నిస్తున్నాయి. కోతలు, చార్జీలు ఎవరికైనా ఇబ్బందికరమే. అయితే ఇప్పటికీ వంద యూనిట్ల లోపు అయ్యే చార్జీలు దేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్‌లోనే తక్కువున్నాయి. ఈ విషయాన్ని గుర్తిస్తూ మాట్లాడితే వారి విమర్శలకు ఒక హేతుబద్ధత ఉండేది.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలపై, విద్యుత్ చార్జీల పెంపుదలపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీవ్ర విమర్శలకు దిగాయి. టీడీపీ లాంతర్లతో నిరసన చెబుతోంది. వామపక్షాలు ఎటూ ఆందోళనలు చేస్తుంటాయి. ప్రజాస్వా మ్యంలో ప్రతిపక్షాలు నిరసన తెలుపుతాయి. ప్రభుత్వం తన వాద నను వినిపిస్తుంటుంది. విశేషం ఏమంటే తెలంగాణలో ఏకంగా 5,600 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెరిగితే జాతీయ పార్టీగా చెప్పు కొనే తెలుగుదేశం గానీ, తెలంగాణలో కూడా పార్టీ నడుపుతానని అనే పవన్ కల్యాణ్ గానీ ఒక్క విమర్శ చేయలేదు. అదే ఏపీలో 1,400 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచిన వెంటనే గగ్గోలు పెడుతున్నారు.
విద్యుత్ కోతలు విధించడం అన్నా, చార్జీల పెంచడమన్నా ఎవరికైనా అసౌకర్యమే. కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించకపోతే మొత్తం వ్యవస్థ కుదేలు అయి పోతుంది. విద్యుత్‌ను సరఫరా చేసే డిస్కంలకు ప్రభుత్వాలు సరిగా బకాయిలు చెల్లించడం లేదన్నది ప్రధాన అభియోగం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డిస్కంలకు 22 వేల కోట్ల బకాయిలు పెట్టిందనీ, ఆ బకాయిలను కూడా తమ ప్రభుత్వం కట్టవలసి వస్తోందనీ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు. కారణం ఏదయినా కరెంటు చార్జీలు పెంచితే ప్రజలలో కూడా అసంతృప్తి కొన్నాళ్లు ఉంటుంది. రాజకీయ పార్టీలు కూడా నిరసన చెప్పవచ్చు. కానీ హేతుబద్ధంగా ఉండాలి. అందులోనూ సుదీర్ఘకాలం ప్రభు త్వాన్ని నడిపిన చంద్రబాబు వంటివారు మరింత జాగ్రత్తగా మాట్లా డాలి. లేకుంటే గతంలో ఆయన దీనికి సంబంధించి ఏమేం అన్నది సోషల్ మీడియాలో వచ్చేస్తుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది.
చంద్రబాబు అంకెలు పెంచి చెప్పడంలో దిట్టే. ఆయన ఏకంగా జగన్ ప్రభుత్వం నలభై రెండువేల కోట్ల భారం వేసిందని అన్నారు. ఆయన టైమ్‌లో ఎన్నడూ చార్జీలు పెంచలేదని మరో అబద్ధాన్ని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో 900 కోట్ల రూపాయల మేర పెంచుతున్నట్లు ప్రకటించిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అసలు విద్యుత్ సంస్కరణలకు తానే ఆద్యుడనని, 2004 ఎన్నికల ముందు వరకు చంద్రబాబు చెప్పు కునేవారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం అంటే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవడమేనని చెప్పేవారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, వామపక్షాలు ఆందోళనకు దిగినప్పుడు హైదరాబాద్‌లో కాల్పుల వరకు వెళ్లి నలుగురు మరణించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కాల్దారి వద్ద కూడా కాల్పులు జరిగాయి. చంద్రబాబు ఓటమికి అప్పట్లో విద్యుత్ సమస్య కూడా ఒక కారణమని అనేవారు.
వ్యవసాయ విద్యుత్‌కు మోటార్లు పెట్టాలని కేంద్రం ఆదేశిం చింది. దానికి అనుగుణంగా వైసీపీ ప్రభుత్వం ఒక జిల్లాలో ప్రయో గాత్మకంగా అమలు చేసింది. దానిని చంద్రబాబు తప్పు పట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. కేంద్రాన్ని ఒక్క మాట అనరు. ఇందు లోనే కాదు, ఏ విషయంలో అయినా అంతే. ‘చెత్తమీద పన్ను వేస్తారా?’ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. తీరా చూస్తే కేంద్రం ఆదేశాల ప్రకారం గతంలో చంద్రబాబు ప్రభుత్వమే చెత్త పన్నును అమలు చేసిందని తాజాగా వచ్చిన ఆధారాలు చెబుతున్నాయి. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రులలో గానీ, ఇతర సేవలలో గానీ, యూజర్ చార్జీ విధానాన్ని ప్రవేశపెట్టడంలో గానీ చంద్ర బాబు ప్రభుత్వం ఎక్కడా వెనుకాడ లేదన్నది జగమెరిగిన సత్యం. కానీ ఇప్పుడు చెత్త ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానించడం ద్వారా తనది కూడా చెత్త ప్రభుత్వమే అని ఆయనే ఒప్పు కొన్నట్లయింది. విద్యుత్ చార్జీల పెంపుపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగు తున్నా నోరు విప్పడం లేదు. బీజేపీ పైనా, కేంద్రం పైనా విమర్శ చేయడానికి జంకుతున్నారు. కరెంటు చార్జీల మీద వాస్తవ ప్రాతి పదికన విమర్శలు చేస్తే తప్పు పట్టనక్కర్లేదు. కానీ వైసీపీపై విమర్శలు చేస్తూ, పెట్రోల్, డీజిల్ ధరల గురించి మాట్లాడకపోతే ప్రజలు ఏమనుకుంటారన్న ఇంగితం అయినా ఉండాలి కదా!
ఇక బీజేపీ వారి ధోరణి మరీ విడ్డూరంగా ఉంటుంది. కేంద్రంలో దారుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినా, దానికి అంతర్జాతీయ పరిస్థితులు కారణమని చెబుతారు. ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమట! ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం వంద యూనిట్ల లోపు అయ్యే చార్జీలు పరిశీలిస్తే– బీజేపీ పాలిత కర్ణాటకలో 703 రూపాయలు, గుజరాత్‌లో 601 రూపాయలు, ఉత్తరప్రదేశ్‌లో 457 రూపాయలు ఉంటే, ఏపీలో 306 రూపాయలే అవుతుంది. వామపక్షాల వారు కూడా నిరసనలకు దిగుతున్నారు. వారు కూడా పెట్రోల్, డీజిల్ ధరల మీద కన్నా, విద్యుత్ చార్జీల పెరు గుదలపైనే తమ ఆవేశం ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. వారి ఏలుబడిలో ఉన్న కేరళలో కూడా వంద యూనిట్ల లోపు చార్జీ 476 అవుతోంది.
ఇంకో సంగతి చెప్పాలి. గత చంద్రబాబు ప్రభుత్వం సౌర విద్యుత్‌కు సంబంధించి అధిక రేట్లకు అంటే యూనిట్‌కు నాలుగున్నర రూపాయలకు పైగా పెట్టి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసు కుంది. పైగా అది పాతికేళ్ల వరకు ఒప్పందం ఉండేలా ఒప్పుకున్నారు. జగన్ ప్రభుత్వం దీనిపై సమీక్షించి రేట్లు తగ్గించడానికి ప్రయత్నిస్తే ఇదే టీడీపీ, దాని మీడియా గగ్గోలు పెట్టాయి. రేట్లు తగ్గిస్తే, ఒప్పందం అమలు చేయకపోతే పెట్టుబడులు రావని వాదించాయి. కానీ ఇప్పుడు విద్యుత్ చార్జీలు పెంచితే అమ్మో ఎలా పెంచు తారని ప్రశ్నిస్తున్నాయి.
నిజానికి బొగ్గు కొరత సమస్య అంతర్జాతీయంగా ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తర్వాత ఇది తీవ్రం అయింది. చైనా సైతం కరెంటు కోతలతో ఉంది. గుజరాత్‌లో వారంలో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ ఇచ్చిన కథనం ప్రకారం దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో ఈ సమస్య వచ్చింది. పరిశ్రమలు అధికంగా ఉండే గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర విద్యుత్ సరఫరా చేయడానికి సతమతమవుతున్నాయి. అతి ఎక్కువ ఖరీదుకు విద్యుత్ కొనుగోలు చేసి మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆ కథనం వివరిం చింది. పరిస్థితి ఇలా ఉంటే ఒక్క ఏపీలోనే చీకట్లు అలుముకున్నా యనీ, మిగిలిన రాష్ట్రాలు వెలుగులు చిమ్ముతున్నాయనీ ఒక పత్రిక విద్వేషపూరిత కథనాన్ని ఇచ్చింది. గతంలో అసలు కరెంటు కోత లేనట్లు పిక్చర్ ఇస్తున్నారు. 2017లో కర్నూలు ఆస్పత్రిలో కరెంటు సమస్య వల్ల ఇరవై మంది మరణించిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. నంద్యాలలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర బాబును కరెంటు కోతలపై ఒక వ్యక్తి బహిరంగ సభలో ప్రశ్నిస్తే అత నిపై తీవ్ర ఆగ్రహం చూపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది.
విద్యుత్ సరఫరా ఈ నెలాఖరుకు మెరుగు అవుతుందని ఏపీ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కోతలున్నా, చార్జీలు పెరిగినా ప్రజలు మౌనంగా భరిస్తారని అనుకోరాదు. ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు అమలు చేసినా, సంక్షేమ స్కీములు ప్రవేశపెట్టినా, చివరికి కరెంటు, నీరు, రోడ్లు వంటి అత్యవసర విషయాలలో ఇబ్బం దులు వస్తే, ప్రజలు వీటినే ప్రస్తావిస్తుంటారు. అందువల్ల ప్రభుత్వం కూడా ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. కొత్తగా వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మేరకు జాగ్రత్తగా పనిచేసి విద్యుత్ కొరత లేకుండా చేస్తారని ఆశిద్దాం!
కొమ్మినేని శ్రీనివాసరావు ,వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment