అజ్ఞాత మహనీయుడు | Yellapragada Subbarao Services People By Dr Vara Prasad Reddy | Sakshi
Sakshi News home page

అజ్ఞాత మహనీయుడు

Published Sun, Dec 26 2021 1:18 AM | Last Updated on Sun, Dec 26 2021 1:21 AM

Yellapragada Subbarao Services People By Dr Vara Prasad Reddy - Sakshi

డాక్టర్‌ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు 1930ల నాటికే బయోకెమిస్ట్రీ పాఠ్యపుస్త కాల్లోకి ఎక్కింది. ఆయన పరిశోధనంతా విదేశాల్లో సాగినా, భారతీయ శాస్త్ర జ్ఞానంపై ఆయనకు అపారమైన నమ్మకం. భారతదేశం పరాయిపాలనలో వుండగా సుబ్బారావు విదేశీయుల వద్ద చదువు కున్నారు. విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్య మంలో భాగంగా ఖద్దరుతో నేసిన సర్జికల్‌ ఏప్రాన్‌ వేసుకుని మెడికల్‌ కాలేజీకి హాజరయ్యారు. ప్రొఫెసర్‌ బ్రాడ్‌ఫీల్డ్‌ ‘గాంధీ వైస్‌రాయ్‌ అయ్యాక వేసుకుందువు గానిలే’ అని వేళాకోళం చేశాడు. ‘వైస్‌రాయ్‌ స్థాయికి గాంధీ ఎప్పుడూ దిగ జారడు’ అన్నాడీయన. ఈ మాట అన్నది 1920 ప్రాంతంలో. ఆ ప్రొఫెసర్‌ కసి పెట్టుకుని ఎంబీబీఎస్‌ డిగ్రీ ఇవ్వకుండా అంత కంటే తక్కువదైన ఎల్‌ఎమ్‌ఎస్‌ డిగ్రీ ఇచ్చాడు. దాంతో మద్రాస్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో ఉద్యోగం రాలేదు. ఆయుర్వేద కాలేజీలో చేరవలసి వచ్చింది. ఎన్నో ప్రయత్నాల తర్వాత హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌లో డిప్లోమా కోర్సుకి అడ్మిషన్‌ ఇచ్చారు కానీ ఫిజిషియన్‌గా కాదు, కెమిస్ట్‌గా. కోర్సు పూర్తి చేశాక జూని యర్‌ ఫ్యాకల్టీ మెంబర్‌గా ఉద్యోగం ఇచ్చారు. 

వాళ్ల ఇంట్లో అనారోగ్యం, దరిద్రం రెండూ ఉన్నాయి. సుబ్బారావు నాన్నగారికి దరిద్రం వలన అనారోగ్యం, దానివలన ఉద్యోగం పోయింది. ఈయనకు 18 ఏళ్ల వయసులో నాన్నగారు పోయారు. ఆయన సోదరులకు కూడా అనారోగ్యమే. ఇంకో ఏడేళ్లకు హార్వర్డ్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ వచ్చి వెళదామ నుకుంటూండగా అన్నయ్య, పెద్ద తమ్ముడు రోజుల తేడాతో ‘స్ప్రూ’ వ్యాధితో పోయారు. మెడిసిన్‌ పూర్తి చేసే అవకాశం కనబడని సందర్భంలో కాకినాడ వెళ్లి అప్పు చేయబోయారు. ‘అప్పెందుకు, మేం చదివిస్తాం, చదువయ్యాక మా అమ్మాయిని పెళ్లి చేసుకో’ అని ఒక కుటుంబం ముందుకొచ్చింది. అతనికి పెళ్లిమీద ధ్యాస లేదు. చదువుకోసం సరేనన్నారు. 

సుబ్బారావు స్కూలు ఫైనల్‌ రెండు సార్లు ఫెయిలయ్యారు. ఇంటర్‌లో ఆయన సబ్జక్ట్‌ మేథ్స్‌. మరి మెడికల్‌ సైంటిస్టు కావడానికి ఇవేమైనా అడ్డు వచ్చాయా? ఆట్టే మాట్లాడితే ఆయన ఎంబీబీఎస్‌ కూడా కాదు. ఆయన చేసిన రీసెర్చి పేపర్లు ఆయన సమ్మతితోనే తక్కినవాళ్ల పేర పబ్లిష్‌ అయ్యాయి. ఆయన కనిపెట్టిన అంశాలపై ముందుకు వెళ్లి రీసెర్చి చేసిన శిష్యులకు నోబెల్‌ ప్రైజులు వచ్చాయి. ఆయనకు రీసెర్చి అంటే ఎంతో పిచ్చి. లీడర్లీ కంపెనీలో 15,000 డాలర్ల జీతం ఇస్తామన్నారు. అప్పట్లో ఆయనకు హార్వర్డ్‌ యూని వర్శిటీలో కేవలం 2,700 డాలర్ల జీతం మాత్రమే. ఒక్కసారిగా పెద్ద అవకాశం. అప్పులన్నీ తీరిపోతాయి. ఎగిరి గంతేయాలి కానీ తను చేసే ఎక్స్‌పెరిమెంట్స్‌కు కొత్త బిల్డింగ్‌ ఇచ్చే మాటైతే సగం జీతానికే పని చేస్తానని అన్నారు. రీసెర్చి అంటే ప్రాణం పెట్టే లీడర్లీ ప్రెసిడెంట్‌ విలియం బ్రౌన్‌బెల్‌ కొత్త బిల్డింగూ ఇచ్చాడు, ఆఫర్‌ చేసిన జీతమూ ఇచ్చాడు.

బాడీ ఫ్లూయిడ్స్‌లో, టిష్యూస్‌లో ఫాస్ఫరస్‌ మోతాదు ఎంత ఉండాలి అని బేరీజు వేసే అంశంపై ఆయన దృష్టి సారించి సైరస్‌ ఫిస్కేతో కలిసి ఒక పద్ధతి కనిపెట్టారు. 
టెక్నికల్‌గా దాన్ని ర్యాపిడ్‌ కేలోరిమెట్రిక్‌ మెథడ్‌ అన్నా, వాడుకలో దానికి ఫిస్కే–సుబ్బారావ్‌ మెథడ్‌ అని పేరు వచ్చింది. ఇంత గొప్ప పరిశోధన చేసేనాటికి ఆయనకు నిండా 30 ఏళ్లు లేవు. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ బయొలాజికల్‌ కెమిస్ట్రీస్‌ వార్షిక సదస్సులో 1924లో దీన్ని డిమాన్‌స్ట్రేట్‌ చేశారు. మన శరీరంలో శక్తిని నిల్వచేసే ఫాస్పోక్రియాటిన్, అడినాసిన్‌ ట్రైఫాస్ఫేట్‌ (ఏటీపీ) కనుక్కున్నారు.

రెండవ ప్రపంచయుద్ధంలో పసిఫిక్‌ తీరంలో యుద్ధ రంగంలో వున్న అమెరికా సైనికులు మలేరియా, ఫైలేరియాసి స్‌తో బాధపడి చికిత్సకై వచ్చినపుడు వారు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడి మట్టి శాంపుల్స్‌ తెప్పిం చారు. ఎందుకంటే వ్యాధి ఒకేలా ఉన్నా, దాని తీవ్రతలో, అది శరీరంపై చూపే ప్రభావంలో తేడా ఉంది. సైనికుడి శరీరం లోని ఇమ్యూనిటీకి తోడు ఇంకా ఏదో ఫ్యాక్టర్‌ ఉండి ఉంటుంది అనుకున్నారు. అందుకని అక్కటి మట్టి తెప్పించి దానిలో నేచురల్‌గా ఉండే ఫంగస్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌ ఏజంట్స్‌ ఏవైనా వున్నాయా అని పరీక్ష చేశారు. ఇలా చేయడం అప్పటికి చాలా కొత్త. దీని కారణంగానే ప్రపంచంలో తొలి టెట్రాసైక్లిన్‌ యాంటీబయాటిక్‌ – ఆరియోమైసిన్‌ కనిపెట్టబడింది. 

1994లో సుబ్బారావుగారి శతజయంతి జరిగిన సంద ర్భంలో ఆయన పేర మన ప్రభుత్వం స్టాంపు విడుదల చేసింది. అదే సంవత్సరం టెట్రాసైక్లిన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ డాక్సీసైక్లిన్‌ గుజరాత్, మహారాష్ట్రలలో చెలరేగిన ప్లేగును అరికట్టడానికి ఎంతో ఉప యోగపడింది. బెంజమిన్‌ డగ్గర్‌తో కలిసి ఆయన 1945లో టెట్రాసైక్లిన్‌ కనిపెట్టారు. ఆయన పోయిన సంవత్సరమే అంటే 1948లో అది మార్కెట్‌లోకి వచ్చింది. ఇన్నేళ్లలో కొన్ని కోట్ల మందిని కాపాడి ఉంటుంది. 

సుబ్బారావు అమెరికాలో వున్నా ట్రాపికల్‌ ఏరియాస్‌లో, ముఖ్యంగా తను పెరిగిన రాజమండ్రి, కాకినాడలలో ఎక్కువగా ఉన్న ఫైలేరియా గురించి పరిశోధన కేంద్రీకరించి హెట్రజన్‌ ఔషధం కనిపెట్టారు. అప్పట్లో మన దేశంలో ఎక్కువగా ఉన్న టీబీని అరికట్టడానికి ఐసోనికోటినిక్‌ ఆసిడ్‌ హైడ్రాజైడ్‌ కని పెట్టారు. తన సోదరులను పొట్టన పెట్టుకున్న ‘స్ప్రూ’ను అరికట్టడానికి ఫోలిక్‌ యాసిడ్‌ను లివర్‌లోని బ్యాక్టీరియా నుండి విడదీశారు. అది రక్తహీనతతో బాధపడే మన భారతీయులకు ఎంతో అవసరం. క్యాన్సర్‌కు కీమోథెరపీ వాడకం గురించి ఇప్పుడు సామాన్య జనానికి కూడా తెలుసు. కీమోథెరపీ ఏజంట్లలో తొలితరం డ్రగ్‌ మెథోట్రెక్సేట్‌ను డెవలప్‌ చేసినది సుబ్బారావు, ఆయనతో బాటు సిడ్నీ ఫార్బర్‌!

ఆంధ్రప్రాంతంలో ‘బెరిబెరి’ (నంజు వ్యాధి) కూడా తీవ్రమైన వ్యాధే. దానికై ఆయన థయామిన్‌ తయారీపై దృష్టి సారించారు. ఈయన వచ్చేసరికి పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్‌ తప్ప యాంటీబయాటిక్స్‌ ఏమీ తెలియవు. 8 ఏళ్లల్లో ఆయన ఇన్ని డిస్కవరీస్‌ చేయడానికి కారకుడయ్యారు. 1948లో ఆయన చనిపోక పోయి ఉంటే యింకా ఎన్ని గొప్ప ఔషధాలు దక్కేవో!

అప్పట్లో రీసెర్చి అంటే ఇంగ్లండ్‌కు వెళ్లేవారు. కానీ ఆయన  అమెరికాకు వెళ్లారు. మెడికల్‌ కాలేజీలో ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌ చూపిం చిన పక్షపాత బుద్ధి వలన! ఆయన డిస్కవరీల పేటెంట్లన్నీ అమెరి కాకు వెళ్లాయి. అది అమెరికాకు గెయిన్, బ్రిటన్‌కు లాస్‌.  ఆయన చనిపోయాక ఆయన లైబ్రరీని లీడర్లీ వాళ్లు ఆయన పేర ఆంధ్ర యూనివర్సిటీకి డొనేట్‌ చేద్దామనుకున్నారు. అక్కడ దాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం, ఆవశ్యకత ఎవరికీ లేదని గుర్తించి తమ కంపెనీలోనే ఆయన పేర లైబ్రరీ పెట్టి అక్కడే ఉంచేశారు.

-డాక్టర్‌ కె.ఐ. వరప్రసాద్‌ రెడ్డి
వ్యాసకర్త శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకుడు, ‘పద్మభూషణ్‌’ గ్రహీత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement