
గుంటూరు మెడికల్: మనిషి దైనందిన జీవితంలో చేసే పనులన్నీ కూడా బ్రెయిన్ ద్వారానే జరుగుతాయి. జ్ఞానేంద్రియాలకు ఇది ముఖ్యమైన కేంద్రం. మెదడు పనిచేయకపోతే మనిషి జీవచ్ఛవం లెక్కే. శరీరంలోని కీలకమైన అవయవాలన్ని కూడా మెదడు ఇచ్చే ఆదేశాల ద్వారానే పనిచేస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధుల వల్ల, ప్రమాదాల్లో గాయపడటం వల్ల మెదడు దెబ్బతిని, మెదడు పనిచేయక మనిషి చనిపోవటం జరుగుతుంది. మెదడును పరిరక్షించుకోకపోతే ఎలాంటి అనర్ధాలు వస్తాయి, మెదడు గురించి అవగాహన కల్పించేందుకు 1996 నుంచి 120 దేశాల్లో ప్రతి ఏడాది మార్చి 13 నుంచి 19వ తేదీ వరకు బ్రెయిన్ అవేర్‌నెస్ వీక్ నిర్వహిస్తున్నారు.
బ్రెయిన్ సమస్యల బాధితుల వివరాలు
గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో ప్రతిరోజూ 150 మంది, న్యూరో సర్జరీ విభాగంలో వంద మంది వివిధ రకాల మెదడు సంబంధిత సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జిల్లాలో 50 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు ఉన్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వివిధ రకాల మెదడు సంబంధిత సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. చిన్న వయస్సు మొదలుకొని పెద్ద వారి వరకు అందరికి బ్రెయిన్ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. ప్రాథమిక దశలోనే వీటిని గుర్తించే ఆధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు నేడు అందుబాటులో ఉన్నాయి.
మెదడుకు ఇబ్బందికర పరిస్థితులు...
ప్రమాదాల్లో తలకు గాయాలవ్వటం. పక్షవాతం. మెదడులో ట్యూమర్లు ఏర్పడడం. పార్కిన్‌సన్స్ వ్యాధి. యాంగ్జటీ, డెమెన్షియా, డిప్రెషన్ కారణాల వలన మెదడు దెబ్బతింటుంది. తలనొప్పి, వాంతులు అవడం, చూపులో తేడాలు, నడకలో తడబాటు, జ్ఞాపకశక్తి లోపించడం, ఏదైనా విషయాలపై ఏకాగ్రత చూపించలేకపోవడం, చెవిలో శబ్దాలు వినిపించడం, మనిషి అసాధారణంగా ప్రవర్తించడం లాంటి లక్షణాలు కనిపిస్తే మెదడుకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయనే విషయం గుర్తించాలి.
బ్రెయిన్ ట్యూమర్స్‌పై అప్రమత్తత..
మెదడులో ఏర్పడే కొన్ని గడ్డలు క్యాన్సర్‌గా మారి ప్రాణాలు తీస్తాయి. ఆపరేషన్ చేసి తొలగించవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో ఫిట్స్ వస్తాయి. వైద్యుల సలహా మేరకు ఫిట్స్ రాకుండా మందులు వాడుతూ ఉండాలి. చేతులు, కాళ్లు పనిచేయకపోతే పక్షవాతం అని భావిస్తారు. బ్రెయిన్‌లో గడ్డ ఉండటం వలన కూడా ఇలా జరగవచ్చు. అన్ని వయస్సుల వారికి బ్రెయిన్ ట్యూమర్‌లు వస్తాయి. సిటిస్కాన్, ఎంఆర్‌ఐ స్కానింగ్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్‌లను నిర్ధారిస్తారు.
మెదడు గురించి..
♦ మనిషి శరీరంలో బ్రెయిన్ మొత్తం బరువు రెండు శాతం.
♦ 18 ఏళ్ల వయసు వరకు బ్రెయిన్ ఎదుగుతూ ఉంటుంది.
♦ పగలు కంటే రాత్రి వేళల్లోనే మెదడు ఎక్కువ చురుకుగా పనిచేస్తుంది.
♦ మెదడులో 75 శాతం నీరు ఉంటుంది.
♦ మెదడు 1300 నుంచి 1400 గ్రాముల బరువు ఉంటుంది.
♦ అప్పుడే పుట్టిన పిల్లల్లో 350 నుంచి 450 గ్రాముల బరువు ఉంటుంది.
♦ శరీరం మొత్తం వినియోగించుకునే శక్తిలో 20 శాతం వినియోగించుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment