జిల్లా బాస్‌ పక్కనే ఉన్నా.. పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అడ్డగోలుగా అవినీతి | - | Sakshi
Sakshi News home page

జిల్లా బాస్‌ పక్కనే ఉన్నా.. పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ అడ్డగోలుగా అవినీతి

Published Thu, Aug 24 2023 1:52 AM | Last Updated on Thu, Aug 24 2023 11:41 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, గుంటూరు: జిల్లా పోలీసు బాస్‌కు కళ్లూ, చెవులుగా ఉండాల్సిన స్పెషల్‌బ్రాంచ్‌పై అవినీతి మరకలు అంటుకున్నాయి. అడ్డగోలుగా అవినీతి చేసి, కలిసి వాటాలు పంచుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు నెపాన్ని ఒకరిపైకి మరొకరు నెట్టుకుంటున్నారు. ఇదీ గుంటూరు జిల్లా స్పెషల్‌ బ్రాంచ్‌ (ఎస్బీ) దుస్థితి. ఇటీవల అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఎస్బీ సీఐ నరసింహారావును వీఆర్‌కు పంపగా, మరో ఉన్నతాధికారిని పక్కన పెట్టి ఆ స్థానంలో వేరేవారిని నియమించారు. వీరిపై విచారణ జరుపుతున్నారు. సింగిల్‌ నంబర్‌ లాటరీ నిర్వాహకుల నుంచి వసూళ్లే దీనికి కారణమని భావిస్తున్నారు. అయితే వీటిన్నికంటే ముందు ముఖ్యంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్కడి పోలీసు అధికారుల సహాయ సహకారాలతో పేకాట ఆడిస్తున్నారన్నదే ప్రధాన ఆరోపణ అని సమాచారం.

పేకాటకు అనధికార అనుమతులు
అసాంఘిక కార్యకలాపాలతోపాటు పోలీస్‌ స్టేషన్‌లలో జరిగే అవినీతిని స్పెషల్‌ బ్రాంచ్‌ నేరుగా జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లాలి. అయితే జిల్లాలో జరుగుతున్న అనేక అంశాలను జిల్లా బాస్‌ దృష్టికి తీసుకువెళ్లకుండా కప్పిపుచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు గెస్ట్‌హౌస్‌లలో ఒక అధికారి సహకారంతో పేకాట ఆడించారని సమాచారం. పొన్నూరు, తెనాలి ప్రాంతాల్లో నూ అక్కడి అధికారుల సాయంతో పేకాట శిబిరాల నిర్వహణకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. గత నెలలో ఓ పండగ రోజు పొన్నూరు పరిధిలో పేకాట ఆడించారనే ఆరోపణల నేపథ్యంలోనే సీఐను వీఆర్‌కు పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఒక్క రోజే పేకాట నిర్వహించారా లేదా ప్రతినెలా ఆడించారా అనేది విచారణలో తేలనుంది. ఇండెంట్లపై కూడా విచారణ చేస్తున్నారు.

కొన్నిరోజులుగా సిబ్బంది విచారణ
ఈ క్రమంలో కొద్ది రోజుల నుంచి జిల్లాలోని పలు సబ్‌ డివిజన్లల్లోని పోలీస్‌స్టేషన్లల్లో విధులు నిర్వర్తించే ఎస్‌బీ సిబ్బందిని దఫాల వారీగా ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. ఎప్పటి నుంచి ఎస్‌బీలో పని చేస్తున్నారు, ఇటీవల పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోటు చేసుకున్న పరిణామాలేంటి అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇరవై రోజుల క్రితం ఎస్‌బీ కార్యాలయంలో విధులు నిర్వర్తించే హెడ్‌కానిస్టేబుల్‌ (పాత రైటర్‌)ను వీఆర్‌కు పంపించారు. పొన్నూరు నుంచి వచ్చిన ఓ కానిస్టేబుల్‌నూ అదే బాట పట్టించారు. పొన్నూరులో రహస్యంగా చేపట్టిన పేకాట శిబిరం విషయమై తెలిసి, సమాచారం ఇవ్వలేదనే ఆ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. ఇక కొద్ది నెలల క్రితం బదిలీపై వచ్చిన ఎస్‌బీ ఉన్నతాధికారికీ ‘మరక’ అంటించారనే చర్చ నడుస్తోంది. బుధవారం తెనాలి సబ్‌ డివిజన్‌ పరిధిలోని సిబ్బందిని పిలిచి ఉన్నతాధికారులు మాట్లాడారు. అక్కడి పరిణామాలపైనా ఆరాతీశారు.

నర‘హింస’రావు లీలలు..
స్పెషల్‌ బ్రాంచ్‌లో సీఐగా పనిచేసిన నరసింహారావు లీలలపై ఎస్బీ సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో సింగిల్‌ నంబర్‌ నిర్వహించే బడా వ్యాపారులంతా నెలనెలా కప్పం కట్టాల్సిందేనని సమాచారం. సీఐతోపాటు మరో అధికారి, కొందరు సిబ్బంది కుమ్మకై ్క ఈ వ్యవహారం చక్కబెట్టినట్లు తెలిసింది. సీఐ వేధింపులు తట్టుకోలేని కొందరు ఆయనకు నర‘హింస’రావుగా పేరు పెట్టారని చెబుతున్నారు. నెలవారీ మామూళ్ల వసూలుకు కింది స్థాయి సిబ్బందిని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. నెలవారీ మామూళ్లలో సబ్‌డివిజన్ల పరిధిలోని పలువురు అధికారులకు కొంత ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

నువ్వంటే..నువ్వు
ఇప్పుడు ఎస్బీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సీఐ నరసింహారావు, విచారణ జరుగుతున్న మరో అధికారి ఆ నెపాన్ని ఒకరిపై మరొకరు వేసుకుంటున్నట్టు సమాచారం. సిబ్బంది మాత్రం ఇప్పటి వరకూ ఈ శాఖలో జరుగుతున్న వ్యవహారాన్ని విచారణ అధికారి ముందు బయటపెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విచారణపైనా ప్రభావం చూపించేలా ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని జిల్లా ఎస్పీ సీరియస్‌గా తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేయవచ్చు.

జిల్లా బాస్‌ పక్కనే ఉన్నా..
నిత్యం జిల్లా బాస్‌ పక్కనే ఉంటూ ఇటువంటి అవినీతికి పాల్పడటం, ఆరోపణలు వెల్లువెత్తడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆయా స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న అవినీతిని ఎప్పటికప్పుడు ఆ స్టేషన్‌ పరిధిలోని స్పెషల్‌బ్రాంచ్‌ సిబ్బంది పంపించినప్పటీ ఎస్బీ సీఐతో పాటు మరో వ్యక్తి కలిసి ఆ విషయాలు ఎస్పీ దృష్టికి వెళ్లకుండా నిలువరించినట్లు సమాచారం. దీంతో పాటు ఆయా స్టేషన్‌ అధికారులు, సిబ్బందిని పిలిపించి వారిని భయపెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడేవారని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement