శరవేగంగా బందరు పోర్టు నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

శరవేగంగా బందరు పోర్టు నిర్మాణం

Published Wed, Oct 4 2023 1:12 AM | Last Updated on Wed, Oct 4 2023 11:26 AM

సాగుతున్న సౌత్‌ వాటర్‌ బ్రేక్‌ పనులు  - Sakshi

సాగుతున్న సౌత్‌ వాటర్‌ బ్రేక్‌ పనులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: మచిలీపట్నం వాసుల దశాబ్దాల కల సాకారమవుతోంది. పోర్టునిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు పనులు పరుగెడుతున్నాయి. పోర్టు నిర్మాణం పనులు పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగులు వేశారు. ఇందులో భాగంగా మే 22వ తేదీన పనులను ప్రారంభించారు. గతంలో చంద్రబాబు నాయుడు పోర్టు పనులకు శంకుస్థాపనలు చేసి ప్రజలను మభ్యపెట్టారు. అలా కాకుండా ముఖ్యమంత్రి ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకొని ఏకంగా పనులనే ప్రారంభించారు.

దీంతో పనులు చేసేందుకు ఎలాంటి ఆటంకం లేకపోవడంతో పోర్టు పనులు జెట్‌ స్పీడ్‌తో ముందుకు సాగుతున్నాయి. మెయిల్‌ సంస్థ పనులు నిర్వహిస్తోంది. పనులు పూర్తి చేసేందుకు 30 నెలల కాల వ్యవధిని నిర్ణయించారు. పోర్టునిర్మాణానికి సంబంధించి సరిహద్దులు గుర్తించి మార్కింగ్‌ చేశారు. బీచ్‌ రోడ్డు నుంచి బ్రేక్‌ వాటర్‌ వరకు తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టారు. శాశ్వత రోడ్డు నిర్మాణానికి సంబంధించి సర్వే పనులు పూర్తి అయ్యాయి. లేబర్‌ క్యాంపులు, ఆఫీసులు, అకడమిక్‌ బ్లాక్‌లు, వెయింగ్‌ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు.

నేలను పటిష్టం చేసేందుకు..
పోర్టు నిర్మాణపు పనులు జరిగే ప్రాంతంలో ల్యాబ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బెర్తు నిర్మాణం కోసం నేల గట్టిదనాన్ని పరిశీలించి, నేలను పటిష్టం చేస్తున్నారు. అక్కడ పెద్ద స్థాయిలో బొగ్గు, ఇనుము నిల్వ చేస్తారు. కాబట్టి ఆ బరువును తట్టుకొనే విధంగా నేలను గట్టి పరుస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు రూ.350 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు పనులను నేరుగా సమీక్షిస్తున్నారు. దీంతో పాటు జిల్లా కలెక్టర్‌ రాజాబాబు, స్థానిక శాసనసభ్యులు పేర్ని నాని, అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, కలిసి క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించి పనుల వేగం పెరిగేలా చర్యలు తీసుకొంటున్నారు.

పనులు తీరు ఇలా...
సౌత్‌ బ్రేక్‌ వాటర్‌కు సంబంధించి 2,075 మీటర్ల పనులు జరగాల్సిండగా ఇప్పటి వరకు 765 మీటర్ల పనులు చేశారు. అంటే 3.60 లక్షల టన్నుల కొండరాళ్లను పరిచారు.

నార్త్‌ బ్రేక్‌ వాటర్‌కు సంబంధించి 250మీటర్ల మేర పనులు జరగాల్సిండగా ఇప్పటికే ఆమేర పనులు పూర్తయ్యాయి. ఇక్కడ 54,254 మెట్రిక్‌ టన్నుల రాళ్లను పరిచారు.

సముద్రం ఒడ్డున డ్రెడ్జింగ్‌ పనులు ప్రారంభించి, 1.82లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకాలు చేశారు.

బెర్తులు, ఫెర్టిలైజర్‌ యార్డు, అడ్మిన్‌ బిల్డింగ్‌, కోల్‌యార్డు, గోడౌన్‌ నిర్మాణం జరిగే ప్రాంతంలో 5మీటర్ల మేర ఎత్తును లేపాల్సి ఉండగా, ఇప్పటికే 1.62లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిని ఫిల్లింగ్‌ చేశారు. ఈ నిర్మాణాలు జరిగే ప్రాంతంలో భూమి కుంగిపోకుండా 21 లక్షల మీటర్ల మేర పీవీడీ (ఫ్రీ ప్యాబ్రికేటెడ్‌ వర్టికల్‌ డ్రెయిన్స్‌) రన్నింగ్‌ లైన్స్‌ పనులు పూర్తయ్యాయి.

ప్రహారికి సంబంధించి ఇప్పటికే 219 ఫైల్స్‌ పూర్తి చేశారు. కస్టమ్స్‌ బిల్డింగ్‌కు సంబంధించిన పనులు సాగుతున్నాయి.

పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతాన్ని చదును చేసే ప్రక్రియ పూర్తి అయ్యింది. అప్రోచ్‌ చానల్‌, రోడ్డు, రైలు కనెక్టివిటీ పనులు సాగుతున్నాయి.

ప్రాజెక్టు నిర్మాణం ఇలా..

మొదటి దశలో కార్గో రవాణా కెపాసిటీ

: 35.12 మిలియన్‌ టన్నులు

ప్రాజెక్టు విలువ : రూ. 5,153.73కోట్లు

బెర్తుల సంఖ్య

: 4(3–జనరల్‌కార్గో, 1–కోల్‌)

డ్రెడ్జింగ్‌ : –16.40 ఎంసీడీ

షిప్‌లు : 80,000 డీడబ్ల్యూటీ

భూసేకరణ : 1922 హెక్టార్లు

పోర్టు నిర్మాణం జరిగే ప్రాంతం

: 1688.82 హెక్టార్లు

రోడ్డు కనెక్టివిటీ కోసం

: 234.15 హెక్టార్లు

పనుల వేగం పెంచాం..
పోర్టు నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతం చేశాం. పనులకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమతులు వచ్చాయి. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు పనులు సాగే విధంగా, పోర్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమీక్షిస్తున్నాం. భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యింది. అక్కడ సౌత్‌, నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ పనులతోపాటు, ప్రహారి, కస్టమ్స్‌ బిల్డింగ్‌, బెర్తులు, కోల్‌యార్డు, జరిగే ప్రాంతాల్లో రిక్రమేషన్‌, పీవీడీ పనులు సాగుతున్నాయి.

– రాజాబాబు, కలెక్టర్‌, కృష్ణా జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
సాగుతున్న కస్టమ్‌ బిల్డింగ్‌ పనులు 1
1/3

సాగుతున్న కస్టమ్‌ బిల్డింగ్‌ పనులు

సౌత్‌ వాటర్‌ బ్రేక్‌లో ఐరన్‌ స్టోర్‌ చేస్తున్న దృశ్యం2
2/3

సౌత్‌ వాటర్‌ బ్రేక్‌లో ఐరన్‌ స్టోర్‌ చేస్తున్న దృశ్యం

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement