పార్ట్ టైం.. ఫుల్ చీటింగ్!
పట్నంబజారు ఇంటి వద్దే పని అని చెప్పడంతో చాలామంది వెంటనే లింకులు క్లిక్ చేసి బోల్తా పడుతున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చార్జీలు, అడ్వాన్స్, సెక్యూరిటీ డిపాజిట్ వంటి పేర్లతో విడతల వారీగా ఖాతాలను సైబర్ నేరగాళ్లు ఖాళీ చేస్తున్నారు. లింకులపై క్లిక్ చేశాక ఫోనులోని ఫొటోలు సేకరించిన సైబర్ దుండగులు మార్ఫింగ్ చేసి.. బ్లాక్ మెయిల్‌కు దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల గుంటూరు లాలాపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఒక మహిళకు కూడా ఓ దరఖాస్తు పంపిన దుండగులు అన్నిరకాలుగా ఫోన్‌లో అనుమతులు కోరారు. ఆమె ఇవ్వడంతోపాటు ఫొటోలను అప్‌లోడ్ చేశారు. రోజుల వ్యవధిలోనే బెదిరింపులకు దిగి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆమె చెల్లించకపోవటంతో మార్ఫింగ్ ఫొటోలతో వేధించారు.
విడతలవారీగా లాగేశారు..
పాత గుంటూరుకు చెందిన ఒక నిరుద్యోగి ‘పార్ట్ టైం ఉద్యోగం’ పేరుతో వచ్చిన ఆన్‌లైన్ లింక్ క్లిక్ చేశాడు. ఫార్మాలిటీ ప్రకారం అని తొలుత రూ.3 వేలు అడగటంతో కట్టాడు. తర్వాత ఈ చలానా.. ఆ ఫీజు అని చెప్పి సుమారుగా రూ.80 వేల వరకు దుండగులు లాగేశారు. నెల రోజుల పాటు ఈ తంతు సాగింది. అప్రూవల్ వస్తుందని.. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ అంటూ పలు కారణాలతో డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగం మాత్రం రాలేదు. వారి సెల్‌ఫోన్ నెంబర్లు స్విచ్ఛాప్ అయ్యాయి. అప్పటికిగానీ మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
● బ్రాడీపేటకు చెందిన ఒక బీటెక్ విద్యార్థిని సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం వెతికారు. సైబర్ నేరగాళ్లు వల విసిరారు. వారికి ఫొటోలు, మార్కుల జాబితాలు పంపింది. ఆ తర్వాత రూ.20 వేలు అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ఉద్యోగం ఇస్తున్నట్లు నమ్మించారు. రెండు నెలలపాటు రూ.10 వేలు చొప్పున జీతం ఇచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తామని రూ.50 వేలు కట్టించుకుని మోసగించారు.
ఉద్యోగాల పేరుతో సైబర్ నేరగాళ్ల వల
లింక్‌లపై క్లిక్ చేస్తే అంతే సంగతులు
వివిధ చార్జీల నెపంతో డబ్బు వసూలు
బాధితుల్లో ఉన్నత విద్యావంతులే అధికం
పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్తులు నిండా ముంచుతున్నారు. నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఆశల వల విసిరి పెద్దమొత్తంలో కొల్లగొడుతున్నారు. పలు కోణాల్లో ప్రజలను టార్గెట్ చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. రోజుకో సైబర్ నేరం జరుగుతున్నా చాలామంది అవగాహన పెంచుకోవడం లేదు.
అప్రమత్తత అవసరం
సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ లింక్‌లపై క్లిక్ చేయకూడదు. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అప్రమత్తత చాలా అవసరం. ఉద్యోగ ప్రకటనలు, రీచార్జి ఆఫర్లు తదితర వాటిని ఎవరూ నమ్మొద్దు.
– ఎస్. సతీష్‌కుమార్, ఎస్పీ, గుంటూరు
పార్ట్ టైం.. ఫుల్ చీటింగ్!
Comments
Please login to add a commentAdd a comment