గుంటూరు రూరల్: అప్పులబాధతో పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వరగాని బాబూరావు(60) వ్యవసాయం చేస్తున్నాడు. అతడి భార్య స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటపని చేస్తుండేది. వీరికి ఇద్దరు మగ, ఒక ఆడపిల్ల ఉంది. ముగ్గురికి వివాహాలు జరిపించారు. బాబూరావు తనకున్న 40 సెంట్ల భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని అందులో పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు. పంటలకు మద్దతు ధరలు లేక, పంటలు నష్టపోవటంతో అప్పులపాలయ్యాడు. దీంతో ఈనెల 13వ తేదీన తన చిన్నకుమారుడు రాజుకు ఫోన్‌చేసి తాను వ్యవసాయం వలన నష్టపోయి అప్పులపాలయ్యానని, అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై తమ పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఫోన్‌చేసి చెప్పాడు. బంధువులతో కలిసి పొలంవద్దకు వెళ్ళి చూడగా అప్పటికే పురుగుల మందుతాగి ఆపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే 108లో చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు.. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment