రంగనాథరావుకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం
పెదకాకాని: గుంటూరు విశ్వనాథ సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం కళారంగానికి చెందిన ప్రముఖులకు అందించే విశ్వనాథ సంస్కృతి పురస్కార వేడుకను శుక్రవారం గుంటూరు జిల్లా నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించారు. 2025 సంవత్సరానికిగాను కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరానికి చెందిన ప్రముఖ బొమ్మలాట కళాకారులు, బొమ్మలాట కళకు పునరుజ్జీవనం కలిగించిన కీర్తిశేషులు ఎంఆర్ రంగనాథరావుకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం, ప్రముఖ రంగస్థలం నటుడు దర్శకుడు రౌతు వాసుదేవరావుకు సూర్యకాంతం స్మారక రంగస్థలం పురస్కారం అందజేశారు. వారి తరఫున వారి కుమారుడు బొమ్మలాటలో వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఎంఆర్ శ్రీనివాసరావుకు అందజేశారు. సభానంతరం ఎంఆర్ శ్రీనివాస్ నిర్వహణలో ఎనిమిది మంది కళాకారుల బృందం, శ్రీకృష్ణ తులాభారం బొమ్మలాటను ప్రదర్శించారు. ప్రదర్శన కన్నడ భాషలో సాగినప్పటికీ కథనం, సంగీతం ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. విశ్వనాథ సాహిత్య అకాడమీ చైర్మన్ డాక్టర్ మద్దినేని సింహ కౌటిల్య చౌదరి మాట్లాడుతూ విశ్వనాథ సాహిత్య అకాడమీ ద్వారా వివిధ భాషలకు చెందిన కళాకారులను సత్కరిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ నాటక రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు, పి.సత్యనారాయణ రాజు, రావెల సాంబశివరావు, కళారత్న భూసురుపల్లి వెంకటేశ్వర్లు, మోదుగుల రవికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment