పట్నంబజారు: గుంటూరులో నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కలకలం రేపింది. భారీగా నకిలీ నోట్లు బయటపడటంతో ఒక్కసారి పోలీసుశాఖ ఉలిక్కి పడింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు శనివారం నకిలీ నోట్ల ముఠాను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. అందులో పాతగుంటూరు బాలాజీనగర్‌కు చెందిన ఇద్దరు ఉన్నారనటంతో ఇక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. సుమారు రూ.కోటికి పైగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరంలో దొరికిన ఇద్దరు గుంటూరు వాసులు కాదని తేల్చారు. విశాఖపట్నం సమీపంలోని అక్కయ్యపాలేనికి చెందిన కర్రి మణికుమార్, తొండంగి మండలం బెండపూడి గ్రామానికి చెందిన దోనేపూడి మధు నకిలీ నోట్ల ముఠాలో సభ్యులుగా ఉన్నారు. గత 15 నుంచి 20 రోజులుగా బాలాజీనగర్ ఆరో లైనులో ఒక వృద్ధురాలి నివాసం ఖాళీగా ఉన్న క్రమంలో రూ.3 వేల అద్దె అయితే రూ.6 వేలు ఇస్తామంటూ చిన్న గదిని వారు తీసుకున్నారు. నాలుగు రోజుల క్రితం రాజమహేంద్రవరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాలాజీనగర్‌లో ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడకు తరలించారు. మణికుమార్, మధుతోపాటు అక్కడ కొంత మందిని నిందితులను పట్టుకున్న నేపథ్యంలో తలదాచుకునేందుకు ఇక్కడకు వచ్చారా..? లేక నోట్లు మార్పిడికి సంబందించి ఎవరినైనా కలిశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నోట్ల మార్పిడికి వచ్చి ఉంటే.. ఏదైనా మెషీన్‌లు, నోట్లు రాజమహేంద్రవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయమై పాతగుంటూరు పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. కేవలం వీరిద్దరే ఉన్నారా.. మరెవరైనా వచ్చారా? అనే కోణంలో పాతగుంటూరు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికులతో సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు.
గుంటూరులో అరెస్ట్ చేసి తీసుకెళ్లిన
రాజమహేంద్రవరం పోలీసులు
స్థానికులకు సంబంధాలపై
విచారిస్తున్న పాతగుంటూరు పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment