రైలు ఢీకొని మహిళ మృతి
తెనాలి రూరల్: రైలు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని కొలకలూరు రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. జీఆర్పీ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గుడివాడకు చెందిన బొద్దులూరి పద్మావతి(53) ఒంగోలులో బంధువుల వివాహానికి వెళ్లేందుకు సోదరితో కలసి కొలకలూరు రైల్వేస్టేషన్‌కు వచ్చింది. టికెట్ తీసుకుని ఒకటో నంబరు ప్లాట్‌ఫాం దిగి పట్టాలు దాటుతుండగా, విజయవాడ నుంచి చైన్నై వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పొగ మంచు కారణంగా రైలు కనబడకపోవడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని తెనాలి జీఆర్పీ పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాంకర్ ఢీకొని వృద్ధురాలి మృతి
పట్నంబజారు: ట్యాంకర్ ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టాభిపురం 2వ లైనులోని సాయి సునంద టవర్స్‌లో నివసించే దంటు కమల (70) ఆదివారం పాల ప్యాకెట్ తీసుకునేందుకు రోడ్డు మీదకు వచ్చింది. పట్టాభిపురం ప్రధాన రహదారిలో పెట్రోల్ కొట్టించుకుని రోడ్డుపై వస్తున్న సెప్టిక్ ట్యాంకర్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరిది కృష్ణప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
పట్నంబజారు: అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావుపేటకు చెందిన అంకాల ప్రత్యూష (23) ఏడాది కిందట ఆనందపేటకు చెందిన అంకాల పవన్ కల్యాణ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రత్యూష కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుంది. పవన్ కల్యాణ్ మార్కెట్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం అలవాటు ఉన్న కల్యాణ్‌తో మృతురాలు ప్రత్యూషకు తరచూ వివాదం జరుగుతుండేది. ఈనెల 15 రాత్రి పవన్ తాగి వచ్చి భార్యతో ఘర్షణ పడ్డాడు. అతడు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రత్యూష్ ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతురాలి తల్లి కుమార్తె మృతిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువకుల మధ్య ఘర్షణ
పట్నంబజారు: ఘర్షణలో ఒక వర్గంపై మరో వర్గం కర్రలు, సర్జికల్ బ్లేడ్‌లతో దాడిచేసి గాయపరిచిన సంఘటనపై కేసు నమోదైంది. పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెహ్రూనగర్ జీరో లైనులో నివాసం ఉండే గద్దె శివకేశవ, అఖిల్ మధ్య కొంతకాలంగా ప్లెక్సీలకు సంబంధించి వివాదం ఉంది. శివకేశవ, అఖిల్‌లు రెండు వర్గాలుగా విడిపోయి పలుమార్లు ఘర్షణ పడిన పరిస్థితులున్నాయి. ఆదివారం సాయంత్రం శివకేశవ, మణికంఠ, వాసులు కాకాని రోడ్డులోని వాసవీ క్లాత్ మార్కెట్ వద్ద నిలబడి ఉన్నారు. ఈ సమయంలో అఖిల్, పండు, నారాయణ, దయాకర్, మధుతో పాటు మరో ఎనిమిది మంది వారిపై దాడిచేసి కర్రలతో కొట్టి, విచక్షణరహితంగా సర్జికల్ బ్లేడ్‌లతో దాడికి పాల్పడ్డారు. శివకేశవ, మణికంఠలకు గాయాలయ్యాయి. ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని మహిళ మృతి
Comments
Please login to add a commentAdd a comment