బ్యాంకు అభివృద్ధికి విశ్రాంత ఉద్యోగులే పునాదిరాళ్లు
కొరిటెపాడు(గుంటూరు): ఖాతాదారులు, పారిశ్రామికవేత్తల సహకారంతో వ్యాపారపరంగా అత్యున్నత శిఖరాలు చేరుకున్న బ్యాంకుల అభివృద్ధికి విశ్రాంత ఉద్యోగులు, అధికారులు పునాదిరాళ్లని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) జోనల్ హెడ్ ఎస్.జవహర్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్‌లో భాగమైన ‘యూనియన్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ (ఏపీ, తెలంగాణ)’ మూడేళ్లకు ఒకసారి జరుపుకునే సదస్సును ఆదివారం సాయంత్రం బ్రాడీపేట పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆవుల వెంకయ్య మాట్లాడుతూ ఐదు లక్షల కోట్ల రూపాయల పైగా టర్నవర్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ అభివృద్ధిలో లక్షలాది మంది ఉద్యోగులు, అధికారుల శ్రమ ఉందని తెలిపారు. విశ్రాంత ఉద్యోగుల ప్రధాన సమస్యలైన 1995 నుంచి పెన్షన్ అప్డేషన్‌తో పాటు మెడికల్ అలవెన్సులపై జీఎస్టీ 18 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలని కోరారు. అన్ని ప్రధాన సమస్యలపై ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ మేనేజ్‌మెంటు నేరుగా విశ్రాంత ఉద్యోగులతోనే చర్చించాలని డిమాండ్ చేశారు. అనంతరం యూబీఐ జోనల్ హెడ్ జవహర్ ఫర్జాన్ దంపతులను, రెండు రాష్ట్రాల నాయకులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. సమావేశంలో విశ్రాంత యూబీఐ విశ్రాంత జోనల్ అధికారులు టి.ఎల్.వి. రావు, డాక్టర్ కొసరాజు రవీంద్రనాథ్, పుల్లారావు, నాయకులు కొండలరావు, యల్లారావు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.వి. రమణ, హరిబాబు, శ్యామ్, కె. శ్రీనివాసరావు, సుబ్బారావు, లలిత అన్నపూర్ణ పాల్గొన్నారు.
అసోసియేషన్ నూతన కార్యవర్గం
గౌరవాధ్యక్షుడిగా పీబీ రాఘవేంద్రరావు, అధ్యక్షుడిగా ఎ.వెంకయ్య, ఉపాధ్యక్షులుగా టి.వసంతా దేవి, పీసీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా ఎస్‌వీ సుబ్బారావు, సహాయ కార్యదర్శులుగా ఎస్.ఆర్.ఎస్. శ్యామ్, షేక్ అన్వర్ ఖాసిం, కోశాధికారిగా లలిత అన్నపూర్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
యూబీఐ జోనల్ హెడ్ సయ్యద్ జవహర్
Comments
Please login to add a commentAdd a comment