పండ్ల వ్యాపారి హత్య
తెనాలి రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో పండ్ల వ్యాపారి హత్యకు గురైన ఘటన ఆదివారం సాయంత్రం తెనాలిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ చినరావూరుకు చెందిన షేక్ రబ్బాని(36) చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్లు విక్రయిస్తుంటాడు. అతడి మేనకోడలు కరీమాను పినపాడుకు చెందిన షేక్ గౌస్‌బాజీకి వచ్చి వివాహం చేశారు. దంపతుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో మేనకోడలికి రబ్బాని మద్దతుగా నిలుస్తున్నాడు. ఇది మనసులో పెట్టుకున్న గౌస్‌బాజీ రబ్బానీని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం సాయంత్రం కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. స్థానికులు అతన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్‌బాబు, ఎస్‌ఐ ప్రకాశరావు వైద్యశాలకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
పట్నంబజారు: ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టి యువకుడు మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చినగంజాం గ్రామానికి చెందిన చింతా రాము (19) కొత్తపేటలోని కుగ్లర్ ఆసుపత్రి వద్ద నివాసం ఉంటున్నాడు. అదే ప్రాంతంలో ఒక ప్రైవేటు ల్యాబ్‌లో డెలివరీ బోయ్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం అరండల్‌పేటలో పని నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రధాన రహదారిపై డివైడర్‌ను ఢీకొన్నాడు. అతి వేగంగా ప్రయాణిస్తుండటంతో డివైడర్‌పై ఉన్న ఇనుప చువ్వలపై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని తల్లి కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు బాబూరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చీటీ పాటల పేరుతో
రూ.15లక్షలు మోసం
లక్ష్మీపురం: చీటీ పాటల పేరుతో నగదు వసూలు చేసుకుని తిరిగి ఇవ్వకుండా పారిపోయిన నిర్వాహకులపై అరండల్‌పేట పోలీసులు శనివారం అర్ధరాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాలకొండయ్య కాలనీకి చెందిన విజయలక్ష్మి, ఆమె కుమారుడు అనిల్ చీటీ పాటలు వేస్తుంటారు. తల్లీకొడుకులు ఇద్దరు ఆ ప్రాంతంలో 40 మంది నుంచి రూ.15లక్షలు వసూలు చేసి, ఎవరికీ చెప్పా పెట్టకుండా పారిపోయారు. దీంతో బాధితులు దిక్కుతోచక అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో శనివారం రాత్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment