నగరంపాలెం: మారు తాళాలతో అర్ధరాత్రి సమయాల్లో మోటారు సైకిళ్లను దొంగలించే నలుగురిని వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ వెల్లడించారు. సుమారు రూ.11 లక్షల ఖరీదు చేసే 22 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ట్రైనీ ఐపీఎస్ దీక్ష, జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం)తో కలసి జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. పెదపలకలూరు రత్నగిరికాలనీ వాసి వెలివోలు వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశ్ బీటెక్ చదివాడు. గతంలో హౌసింగ్ కార్పొరేషన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తించారు. సుమారు 25 దొంగతనాలు చేయగా, 22 మోటారుసైకిళ్లు, మూడు సంచులు దొంగలించాడు. అతడిపై నలభై కేసులు ఉన్నాయని అన్నారు. వెంకటేశ్‌కు ముప్పాళ్ల మండలం లంకెలకూరపాదు గ్రామస్తుడు వ్యవసాయ పనులు చేసే ఎం.సీతారెడ్డి రెండేళ్ల క్రితం పరిచమయ్యాడు. సీతారెడ్డి ద్వారా ఓఎల్‌ఎక్స్‌లోని ఏడు బైక్‌లను విక్రయించాడు. తద్వారా వచ్చిన సొమ్ములో కొంత నగదు కమిషన్ రూపంలో సీతారెడ్డికి వెంకటేశ్ ఇచ్చేవాడని దర్యాప్తులో గుర్తించారు. వీరిద్దరి వద్ద రూ.6 లక్షల ఖరీదు చేసే 12 మోటారుసైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ మండలం సంగంజాగర్లమూడి గ్రామస్తుడు ఎండీ అబ్దుల్‌రషీద్ కూలీ పనులకు వెళ్లేవాడు. ఆటోడ్రైవర్లతో కలిసి మద్యం, గంజాయికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో తెనాలికి చెందిన పాత నేరస్తుడు భరత్(ప్రస్తుతం నరసరావుపేట జైల్లో ఉన్నాడు)తో పరిచయం ఉంది. భరత్ వద్ద చోరీలు చేయడంలో శిక్షణ పొందాడు. అనేకసార్లు చోరీలు చేసి జైలుకెళ్లాడు. అతడిపై పలు పీఎస్‌ల్లో 26 దొంగతనం కేసులున్నాయి. గతంలో గుంటూరు జిల్లా కారాగారంలో పరిచయమైన గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం ప్లాట్స్‌లో ఉండే చల్లా గోపితో కలిసి నేరాలకు పాల్పడ్డాడు. అర్ధరాత్రుళ్లు సుమారు రెండు గంటల సమయంలో బైక్‌ల హ్యాండిల్స్ విరగొట్టడం లేదా మారు తాళాలతో చోరీలకు చేసేవాడు. నంబరు ప్లేట్‌లు తొలగించి గ్రామాల్లో వారికి తక్కువ ధరకు విక్రయించడం లేదా తనఖా పెట్టేవాడని గుర్తించారు. చల్లా గోపీ 2020లో మిత్రుడైన శారదాకాలనీకి చెందిన మిట్టు, మిత్రులతో కలసి దోపిడీకి పాల్పడి, జైలుకెళ్లి వచ్చాడు. అతడిపై 11 కేసులున్నాయి. వీరిద్దరి వద్ద రూ.5 లక్షల ఖరీదు చేసే పది మోటారుసైకిళ్లను సీజ్ చేశారు. ఈ నలుగుర్ని గుజ్జనగుండ్ల కూడలి, నారాకోడూరులో పట్టుకుని అరెస్ట్ చేశామని అన్నారు. జిల్లా ఏఎస్పీ కె.సుప్రజ (క్రైం), సీఐలు ఎండీ.అల్తాఫ్‌హుస్సేన్, బి.శ్రీనివాసరావు, జె.అనురాధ, చేబ్రోలు పీఎస్ ఎస్‌ఐ డి.వెంకటకృష్ణ, పలువురి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, రివార్డులు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment