తెలుగులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి
తెనాలి రూరల్: తెనాలి ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కోర్టులో ఓ కేసు(686/23)కు సంబంధించిన తీర్పును న్యాయమూర్తి తెలుగులో చెప్పారు.ప్రో నోటుకు సంబంధించిన కేసులో న్యాయమూర్తి తీర్పును తెలుగులో వెలువరించారని, రానున్న వారం రోజులు తెలుగులోనే చెప్పనున్నారని కోర్టు వర్గాలు తెలిపాయి.
21న కుంభమేళాకు ప్రత్యేక బస్సు
పట్నంబజారు: భక్తుల కోరిక మేరకు కుంభమేళాకు మరో స్పెషల్ హైటెక్ బస్సును ఈనెల 21వ తేదీన ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ఆర్‌ఎం ఎం. రవికాంత్ తెలిపారు. మొత్తం ఎనిమిది రోజుల ప్రయాణం ఉంటుందని పేర్కొన్నారు. 21వ తేదీ ఉదయం 10 గంటలకు బస్సు బయలుదేరి ప్రయాగ్‌రాజ్ చేరుకున్న అనంతరం అక్కడ నుంచి అయోధ్య, వారణాసి వెళ్లి తిరిగి వస్తుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో 91927 సర్వీస్ నంబర్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఒక్కో టికెట్ ధర రూ. 8,300గా నిర్ణయించినట్లు తెలిపారు. భోజనాలు, వసతి ఖర్చుల బాధ్యత ప్రయాణికులేదనని చెప్పారు. వివరాల కోసం 7382897459, 7382896403 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
రేపు వాహనాల వేలం పాట రద్దు
పట్నంబజారు: రవాణా శాఖకు పన్నులు చెల్లించకుండా నిర్బంధంలో ఉన్న వాహనాలకు ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన బహిరంగ వేలం పాటను రద్దు చేసినట్లు డీటీసీ కె. సీతారామిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఆర్టీఏ కార్యాలయంలో ఉన్న 31 వాహనాల వేలాన్ని పలు శాఖాపరమైన కారణాలతో నిలిపి వేసినట్లు పేర్కొన్నారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై సమీక్ష
నరసరావుపేట టౌన్: మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి సోమవారం స్థానిక న్యాయస్థాన భవనాల ఆవరణలో పోలీసు అధికారులతో న్యాయమూర్తులు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మార్చి 8న స్థానిక న్యాయస్థానం భవనాలు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు స్థానిక అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.మధుస్వామి తెలిపారు. ఈ సందర్భంగా అదాలత్‌లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు అధికారులకు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి చట్టపరమైన అంశాలను వివరించారు. పోలీసులు కేసులు పరిష్కారానికి సంబంధించి లేవనెత్తిన పలు సందేహాలను నివృత్తి చేశారు. న్యాయమూర్తి ఆర్.ఆశీర్వాదం పాల్, వన్‌టౌన్ ఎస్‌ఐ అరుణ, టూటౌన్ ఎస్‌ఐ లేఖ ప్రియాంక, రొంపిచర్ల ఎస్‌ఐ మణి కృష్ణ, నకరికల్లు ఎస్‌ఐ సిహెచ్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు
త్రికోటేశ్వరునికి బంగారు రుద్రాక్షలు బహూకరణ
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారికి నాదెండ్ల మండలం కమ్మవారిపాలెంకు చెందిన భక్తుడు చండ్ర శ్రీనివాసరావు రూ.16లక్షల విలువైన బంగారు రుద్రాక్షలను బహూకరించాడు. ఆలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా బంగారు రుద్రాక్షలను ఆలయ అర్చకులకు అందజేశారు. ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొన్నారు.
పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
నరసరావుపేట రూరల్: తిరునాళ్ల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సూచించారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని సోమవారం ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి ఆయన దర్శించుకున్నారు.
తెలుగులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి
Comments
Please login to add a commentAdd a comment