కమిషనర్ నోట ధూళిపాళ్ల మాట
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదంగా మారింది. ఒక అపార్టుమెంట్ కోసం ప్రెస్‌మీట్ పెట్టడం, గతంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఏం మాట్లాడారో వాటినే వల్లె వేయడం ఆశ్చర్యం కలిగించింది. గత ఎన్నికల్లో పొన్నూరు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థ్ధిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్మాణంలో ఉన్న గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్‌పై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర ఆరోపణలు చేశారు. అనుమతులు లేకుండా కడుతున్నారంటూ, దాన్ని అడ్డుకోవాలంటూ విలేకరుల సమావేశాలు పెట్టారు. అప్పటి నుంచి మున్సిపల్ అధికారులు గ్రీన్‌గ్రేస్ అపార్టుమెంట్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత షార్ట్ ఫాల్ నోటీసులు ఇచ్చారు. అయితే, దీనికి సంబంధించిన అన్ని అనుమతులను సంస్థ మున్సిపల్ కార్పొరేషన్‌కు అందజేసింది. ఫైర్ ఎన్‌ఓసీ, ఎన్విరాన్‌మెంటల్ ఎన్‌వోసీతో పాటు అన్ని అనుమతులు, ఫీజులు ఎప్పటికప్పుడు చెల్లించి అప్‌డేట్‌గా ఉన్నారు.
కమిషనర్ వెనుక అదృశ్య శక్తులు?
రైల్వే ఎన్‌వోసీ విషయానికి వస్తే కార్పొరేషన్ నిబంధనల ప్రకారం 13 మీటర్లు సరిపోతుంది. అయితే రైల్వే 14 మీటర్లు ఉండాలనడంతో గ్రీన్ గ్రేస్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నిర్ణయం వెలువడేవరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే కాకుండా మరో రెండు రిట్ పిటిషన్లు ఇదే అంశంపై కోర్టులో ఉన్నాయి. ఇవన్నీ ఉండగానే కార్పొరేషన్ అధికారుల బృందం సోమవారం గ్రీన్ గ్రేస్ అపార్టుమెంట్‌లలో తనిఖీలు చేసింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోర్టులో ఒక అంశం ఉండగా దానికి సంబంధించి ఎవరూ కొనుగోలు చేయవద్దంటూ ఉచిత సలహాలు ఇవ్వడం, అధికారికంగా ప్లాన్ ఉన్నా అది ఇల్లీగల్ అంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అన్ని షార్ట్‌ఫాల్స్‌ను అధిగమించిన తర్వాత కూడా దానికి అసలు ప్లానే లేదని కమిషనర్ చెప్పడం వెనుక ఎవరు ఉన్నారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
షార్ట్ ఫాల్‌లో 1,187 భవనాలు
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1187 భవనాలు షార్ట్ ఫాల్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇందులో రాజకీయ పలుకుబడి ఉన్నవారు, అధికార పార్టీకి చెందిన వారిని పక్కన పెట్టి మిగిలిన వారిలో తమకు ఉపయోగపడే వారిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చారు. వీరి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటిలో ఏ ఒక్క భవనం పనులు కూడా నిలిపి వేయలేదు. గుంటూరు నగరంలోనే ఈ 1187 భవనాల నుంచి రూ. 150 నుంచి రూ. 200 కోట్ల వరకూ టౌన్ ప్లానింగ్ సిబ్బంది వసూలు చేసి ఉంటారని ఒక అంచనా. ఇంత అవినీతి జరిగితే చర్యలు తీసుకోకుండా 1187లో ఒకటైన గ్రీన్ గ్రేస్‌పై కమిటీ వేయడం, నివేదిక రాకముందే కమిషనర్ మీడియా ముందుకు రావడం, అక్కడ ప్లాట్లు కొనుగోలు చేయవద్దని సలహాలు ఇవ్వడం చూస్తుంటే మొత్తం ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నట్లు అర్థం అవుతోంది.
కోర్టులో ఉన్న గ్రీన్ గ్రేస్‌పై కమిషనర్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్లాన్ ఉన్నా అది ఇల్లీగల్ అంటూ వాఖ్య అన్ని షార్ట్ ఫాల్స్‌ను అధిగమించిన గ్రీన్ గ్రేస్ యాజమాన్యం
Comments
Please login to add a commentAdd a comment