జీజీహెచ్‌లో జలగలు
గుంటూరు మెడికల్: జీజీహెచ్‌లో కళ్ల ముందే రక్తంతో సిబ్బంది వ్యాపారం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రైవేటు బ్లడ్ బ్యాంక్‌ల వారికి రక్తం, ప్లాస్మాను నిస్సిగ్గుగా అమ్ముకుంటున్నారు. నాలుగు రోజుల కిందట నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చాడు. డాక్టర్ల సూచనల మేరకు అతడికి ప్లాస్మా కావాలని కుటుంబ సభ్యులు బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లారు. ఎవరైనా రక్తాన్ని ఇస్తేనే ప్లాస్మా ఇస్తామని సిబ్బంది కరాఖండిగా చెప్పారు. రక్తదానం చేసేందుకు బంధువులు లేకపోవడంతో వారు జీజీహెచ్ నుంచి ప్లాస్మాను ఉచితంగా తీసుకోలేకపోయారు. దీంతో బాలుడు చనిపోయాడు. ప్లాస్మా తమకు అందించకపోవడం వల్లే ఇన్‌ఫెక్షన్ ఎక్కువై చనిపోయాడంటూ జిల్లాకు చెందిన ఓ మంత్రికి బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు అమ్మకం
జీజీహెచ్‌లో రోగులకు ఉచితంగా రక్తం ప్లాస్మా ఇవ్వాలి. అయితే, బ్లడ్ బ్యాంకు అధికారులు తమ వద్ద అధిక మొత్తంలో బ్లడ్, ప్లాస్మా ఉందని, దాన్ని వినియోగించకపోతే పాడవుతుందని చెబుతూ ప్రైవేటు బ్లడ్ బ్యాంక్‌లకు అమ్ముతున్నారు. ఈ విధంగా వచ్చిన నిధుల్ని నిబంధనల ప్రకారం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) అకౌంట్‌కు జమ చేయాలి. అయితే, బ్లడ్ బ్యాంక్‌లో ఇవేమి జరగడం లేదు. సిబ్బంది తమ అకౌంట్లలో జమ చేసుకుని ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
దాతల విరాళాలు మాయం
జీజీహెచ్‌లో రక్తపు బ్యాగులు నిల్వ చేసేందుకు గతంలో ఇద్దరు దాతలు స్టోరేజ్ ఫ్రిజ్‌లను ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే, సిబ్బంది తాము తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తామంటూ డబ్బులు తీసుకుని వాడేసుకున్నారు.
దొంగ బిల్లులతో స్వాహా
జీజీహెచ్‌లో రక్తదానం చేసిన వారికి శక్తి వచ్చేందుకు గ్లూకోజ్ వాటర్, జూస్, బిస్కెట్లు, స్నాక్స్ ఇవ్వాలి. రక్తదాతలకు ఏమీ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా దొంగ బిల్లులు సృష్టించి నిధులు కొల్లగొడుతున్నారు. నిబంధనల ప్రకారం బ్లడ్ బ్యాంక్‌లో పెథాలజిస్టు ఉండాలి. గుంటూరు వైద్య కళాశాలలో ఆ వైద్య విభాగం ఉంది. జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ ఇన్‌చార్జిగా పెథాలజిస్ట్ కాకుండా కేవలం సివిల్ అసిస్టెంట్ సర్జన్( సీఏఎస్) ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
బ్లడ్ బ్యాంక్‌లో వెలుగులోకి వస్తున్న అక్రమాలు అమ్మిన రక్తం డబ్బులను ఇష్టానుసారంగా వాడేస్తున్న సిబ్బంది జీజీహెచ్ పరువు మంట గలుపుతున్న బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అభివృద్ధి కమిటీకి నిధులు జమ చేయడం లేదు
విచారించి చర్యలు తీసుకుంటాం
గుంటూరు జీజీహెచ్‌లో బ్లడ్ అమ్మకాల గురించి నా దృష్టికి రాలేదు. ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ రమణ యశశ్వి
ఆసుపత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment