గ్రీన్‌గ్రేస్‌పై తప్పుడు ఆరోపణలు
కొరిటెపాడు (గుంటూరు వెస్ట్): గ్రీన్‌గ్రేస్ ప్రాజెక్టుపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని వైఎస్సార్ సీపీ నేత అంబటి మురళీకృష్ణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై పోటీ చేసి గెలిచిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్ రెండుమూడు నెలల నుంచి పలు రకాల ఆరోపణలు చేస్తున్నారన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఈ ఆరోపణలపై పత్రికాముఖంగా స్పందించడంతో తాను వివరణ ఇస్తున్నట్లు వివరించారు. 2015లో భజరంగ్ జూట్‌మిల్లుకు రెసిడెన్షియల్ సైట్ 5.28 ఎకరాల్లో ఒక హైరైజ్ ప్రాజెక్టు నిర్మించాలని అప్పటి ఆదిత్య కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్ణయించిందని, మొదటగా ఐదు ఫ్లోర్లకు అనుమతి తీసుకోవాలని అనుకొని, మున్సిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. వారు ప్లాన్‌కు ముందు రైల్వే ట్రాక్ సైట్ 60 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో ఉంది కనుక 164 చదరపు గజాల స్థలం గిఫ్ట్‌గా ఇవ్వమని కార్పొరేషన్ వారు ఎండార్స్‌మెంట్ ఇవ్వడంతో తాము అంగీకరించి ఆ మేరకు స్థలం ఇచ్చామన్నారు. నల్లపాడు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో 164 గజాలు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు గిఫ్ట్ డీడ్‌గా రిజిస్టర్‌చేసి ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో ఐదు అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతి ఇస్తూ 36వ పాయింట్‌గా కార్పొరేషన్ వారు రోడ్డు వేయడానికి తనను అడిగిన 164 గజాలు ఉచితంగా ఇచ్చాం గనుక రూ.19.30 లక్షలు సెట్‌బ్యాక్‌లో రిలాక్సేషన్ కింద ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించారు.
ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్సు కూడా తీసుకున్నాం
తర్వాత హైరైజ్ భవనాలు నిర్మించాలని నిర్ణయించి 2015 మే 26న 111 మీటర్ల హైట్ వరకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్‌ఓసీ తీసుకున్నామని, 2015లోనే స్టేట్ ఎన్విరాన్‌మెంటల్ అథారిటీ నుంచి క్లియరెన్స్ తీసుకున్నామని అంబటి మురళీకృష్ణ వివరించారు. ఈ ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ 600 ప్లాట్లకు తీసుకున్నామని, ప్రస్తుతం తాను నిర్మిస్తుంది 510 ప్లాట్లని, దీనికి ఐదు సంవత్సరాలు వ్యాలిడిటీ ఉందని, తరువాత గజిట్ ద్వారా మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చని వివరించారు. తరువాత కోవిడ్‌లో ఒక సంవత్సరం సడలించడం వల్ల, 2026 వరకు అనుమతిలో ఉందని అంబటి పేర్కొన్నారు. ఆ తరువాత ఒక్కో టవర్‌కు ఒక్కోటి చొప్పున 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్‌సర్వీసెస్ నుంచి ఫైర్ ఎన్‌ఓసీలు నాలుగు తీసుకున్నామని, ఒక్కో టవర్‌కు ఒకటి చొప్పున ఈ ఎన్‌ఓసీలు తీసుకున్న దరిమిలా 25 నవంబరు 2025లో రెండు సెల్లార్లు, ఒక గ్రౌండ్ ఫ్లోర్, 14 లివింగ్ ఫ్లోర్లకు అనుమతి తీసుకున్నట్టు వివరించారు. ఇది తీసుకున్న తరువాత 2020లో ప్రాజెక్టును ప్రారంభించామని, తర్వాత మూడు టవర్లకు వేర్వేరుగా రేరా అనుమతులు తీసుకున్నామని పేర్కొన్నారు. 2020లో 179 జీఓ ప్రకారం పోస్టు వెరిఫికేషన్ తొలగించి ఆటో వెరిఫై బై సూపర్‌వైజరీ చెక్ రూల్ ప్రకారం.. జీఎంసీ, డీటీసీపీ అధికారులు పరిశీలించి ఫైనల్ ప్లాన్‌గా ప్రకటించారన్నారు. 2020లో 96,000 స్క్వేర్ మీటర్‌లకు అనుమతి తీసుకుని అందులో ఐదు ఫ్లోర్‌లకు రూ.75 లక్షలు ఫీజు, తరువాత 2020లో 15 ఫ్లోర్‌కు రూ. 4.35 కోట్లు చెల్లించామన్నారు. హైరైజ్ బిల్డింగ్ కనుక పర్మినెంట్ ప్లాన్‌గా ఆమోదించామని పేర్కొన్నారు. ఆ తర్వాత 2024లో తాను ఒక టవర్‌లో కొన్ని మార్పులు చేయడం వల్ల మరో రివైజ్ ప్లాన్ తీసుకున్నట్టు వివరించారు. దీన్ని ఆన్‌లైన్‌లో తీసుకుని దీనికి రూ.1.27 కోట్లు ఫీజు చెల్లించామని, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా బాకి లేదని పేర్కొన్నారు. అనుమతులు తీసుకున్నప్పుడు 15 శాతం బిల్డింగ్ ఏరియాను మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేశానని, భవిష్యత్‌లో నిబంధనలు అతిక్రమిస్తే ఆ 15 శాతానికి సమానమైన ఫ్లాట్లు వాళ్లు తీసుకుని తనకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారని వివరించారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కొత్త జీవో ప్రకారం కొన్ని షార్ట్‌ఫాల్స్ ఉన్నాయని, తనకు ఒక షార్ట్‌ఫాల్ నోటీసు ఆన్‌లైన్‌లో ఇచ్చారని, దీంట్లో రకరకాల సాయిల్ టెస్ట్ రిపోర్ట్, రివైజ్డ్ ఫైర్ ఎన్‌ఓసీ, తరువాత రైల్వే శాఖ నుంచి ఎన్‌ఓసీ కావాలని తొలిసారి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపిత విమర్శలు వచ్చిన దగ్గర నుంచి రైల్వే ఎన్‌వోసీ కావాలంటూ పట్టుపట్టారని పేర్కొన్నారు. రైల్వేశాఖ ఎన్‌ఓసీ ప్రాసెస్‌లో ఉండగా తనకు నోటీసు ఇచ్చారన్నారు. షార్ట్‌ఫాల్ సబ్‌బిట్ చేయని 1187 మందికి నోటీసులు ఇవ్వకుండా తనకు మాత్రమే ఇవ్వడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, స్టాప్ నోటీసు ఇచ్చిన తర్వాత చట్టాన్ని గౌరవించి పనులు నిలిపివేశానని అంబటి స్పష్టం చేశారు. రైల్వే ఎన్‌ఓసీ విషయం కోర్టులో పెండింగ్‌లో ఉందని తీర్పు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. అన్ని నిబంధనల మేరకే చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
వైఎస్సార్ సీపీ నేత అంబటి మురళీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment