నేడు గుంటూరుకు వైఎస్ జగన్
వై.ఎస్.జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
పట్నంబజారు (గుంటూరుఈస్ట్) : వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు చెప్పారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్చి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడంతోపాటు, రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని వివరించారు. రైతులకు అండగా తానున్నాననే భరోసా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మిర్చియార్డుకు వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు చేరుకుంటారని, మిర్చిని అమ్ముకునేందుకు వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారని వివరించారు.
కూటమి ప్రభుత్వం విఫలం
కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలో సీఎం చంద్రబాబు రైతులకు ఒక్క మేలు అయినా చేశారా అని అంబటి ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో బాబు విఫలమయ్యారని విమర్శించారు. ధాన్యం బస్తా ధర రూ.1200 నుంచి 1300, మిర్చి క్వింటా ధర రూ. 13వేలు కంటే పలకడం లేదని ధ్వజమెత్తారు. కంది, మినుము, పత్తి పంటలకూ మద్దతు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతుల సమస్యలపై కలెక్టర్లకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందించినా సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని గుర్తుచేశారు. పొగాకు పంట విషయంలో రూ.వందల కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో పంట కొనుగోలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతోందన్నారు. వైఎస్ జగన్ రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వస్తున్నారని, ఇది బహిరంగ సభ కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.
రైతుల సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ గుంటూరు, నరసరావుపేట పార్లమెంట్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కూటమి నేతల కళ్ళు తెరిపించేందుకు, రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ గుంటూరుకు వస్తున్నట్లు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, డెప్యూటీ మేయర్, పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పట్పంబజారు(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరు రానున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి, రోడ్డు మార్గంలో గుంటూరు మిర్చి యార్డుకు చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు మిర్చి యార్డు వద్దకు వచ్చి 11 గంటల వరకు మిర్చి రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని, వారితో మాట్లాడతారు. అనంతరం 11 గంటలకు గుంటూరు మిర్చి యార్డు నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
మిర్చియార్డులో రైతుల సమస్యల విననున్న జననేత వివరాలు వెల్లడించినవైఎస్సార్ సీపీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment