పెళ్లి కొడుకుగా మల్లేశ్వరుడు
మంగళగిరి టౌన్: మంగళగిరి గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 18 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం స్వామి పెళ్లి కుమారుడి ఉత్సవం శోభాయమానంగా నిర్వహించారు. స్వామికి గణపతి పూజ, పంచామృత అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని పెళ్లికుమారుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన చంద్రిక జ్యూయలర్స్ అధినేత జంజనం నాగేంద్రరావు, విజయలక్ష్మి దంపతులు ఈ ఉత్సవానికి కైంకర్యకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్లు బోగి కోటేశ్వరరావు, సీతారామ కోవెల ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వాకా మంగారావు తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి జె.వి.నారాయణ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు.
శతాధిక వృద్ధురాలి కన్నుమూత
కొల్లిపర: కొల్లిపర గ్రామంలో 105 సంవత్సరాలు కలిగిన కొల్లి కాంతమ్మ సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కాంతమ్మ భర్త కొల్లి సుబ్బారెడ్డి స్వాత్రంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. జైలు శిక్ష అనుభవించారు. కాంతమ్మకు ఒక కొడుకు, ఇద్దరు కుమారైలతోపాటు మనమలు, మనవరాళ్లు, మునిమనమలు ఉన్నారు. ఈమె ఐదు తరాలను చూసింది.
ఏఎన్‌యూ దూరవిద్య పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూర విద్యా కేంద్రం గత ఏడాది నవంబరులో నిర్వహించిన ఎంఏ తెలుగు ప్రథమ, ద్వితీయ, తృతీయ నాలుగో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశామని పీజీ పరీక్షల విభాగ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోదండపాణి తెలిపారు. పరీక్ష ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్‌యూసీడీఈఐఎన్‌ఎఫ్‌ఓ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 28 ఆఖరు తేదీగా నిర్ణయించామని వివరించారు.
ఎం ఫార్మసీ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించునున్న ఎం.ఫార్మసీ వన్ బై టూ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను సీఈఏ శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 చివరి తేదీ. రూ.100 ఆలస్య రుసుముతో ఈ నెల 27 వర కు చెల్లించవచ్చునని, పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. పరీక్ష ఫీజు తదితర వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని వివరించారు.
రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ మేనేజర్ మృతి
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కనకదుర్గ వారధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బ్యాంకు మేనేజర్ చనిపోయిన ఘటనపై మంగళవారం తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం చీరాలకు చెందిన కొక్కిలిగడ్డ వీర వెంకటేశ్వరరావు (40) కృష్ణాజిల్లా పెడనలోని ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి లారీ వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై భార్య అపర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
అమరేశ్వరుని సేవలో క్యాట్ న్యాయమూర్తి
అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుని మంగళవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) న్యాయమూర్తి లతా భరద్వాజ్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు న్యాయమూర్తికి స్వాగ తం పలికారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట క్యాట్ మెంబర్ వరణ్‌సింధు కౌముది, అధికారులు ఉన్నారు.
పెళ్లి కొడుకుగా మల్లేశ్వరుడు
పెళ్లి కొడుకుగా మల్లేశ్వరుడు
Comments
Please login to add a commentAdd a comment