రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మేడికొండూరు: ఆటోను వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని పేరేచర్ల కాల్వ సమీపంలో జరిగింది. పేరేచర్ల నుంచి మేడికొండూరు వైపు వెళ్తున్న ఆటోను గుంటూరు నుంచి సత్తెనపల్లి వైపు వెళ్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మోటార్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
చీరాల: మోటార్ల చోరీ కేసులో ఇద్దరిని ఈపురుపాలెం పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు. చీరాల రూరల్ మండలం కావూరివారిపాలెంలోని పొలాల్లో నీళ్ల మోటార్లు చోరీకి గురికావడంతో గ్రామానికి చెందిన అక్కల సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన అక్కల గోపిరెడ్డి, కావూరి గోపిరెడ్డి నిందితులని తేలింది. ఇద్దరు మద్యం, వ్యసనాలకు అలవాటుపడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు పొలాల్లోని మోటార్లను చోరీ చేసి అమ్ముకుంటున్నారు. ఈనెల 15, 17తేదీల్లో ఫిర్యాది అక్కల సాంబయ్య, అతని పక్కనే ఉన్న గుండుబోయిన ఏసురాజు పొలంలో, అదే గ్రామానికి చెందిన అక్కల వెంకటరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి, కావూరి శివారెడ్డిలకు చెందిన పొలాల్లోని ఐదు మోటార్లను చోరీ చేశారు. దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితులను శుక్రవారం సాయంత్రం కావూరివారిపాలెం వై.జంక్షన్ వద్ద అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment