12న ‘యువత పోరు’కు తరలిరండి
నగరంపాలెం: వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ‘యువత పోరు’కు విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు పెద్దఎత్తున తరలిరావాలని వైఎస్‌ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ఆదివారం బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్లను మాజీ మంత్రి అంబటి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు షేక్ నూరి ఫాతిమా (తూర్పు). బాలవజ్రబాబు (తాడికొండ), అంబటి మురళీకృష్ణ (పొన్నూరు), దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి), మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజ నారాయణ, వైఎస్‌ఆర్‌సీపీ స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు వినోద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ రాష్ట్రంలోని యువత, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేసేందుకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ కింద రూ.4,600 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికీ వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులను యాజమాన్యాలు కళాశాలల నుంచి బయటకు పంపుతున్నాయని ఆరోపించారు. చదువుకోవాల్సిన వారు కూలీలుగా, వ్యవసాయ పనులకు వెళ్లే విషమ పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పిస్తోందని మండిపడ్డారు. వెంటనే పెండింగ్ బకాయిలను తీర్చి విద్యార్థులకు, యాజమాన్యాలకు ఊరటనివ్వాలని డిమాండ్ చేశారు. బకాయిలు రూ.4,600 కోట్లు ఉండగా, ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అతి తక్కువగా చూపించారని ఆరోపించారు. ప్రస్తుతం బకాయిలను తీర్చే పరిస్థితులు కనిపించడంలేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కుంగదీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పేద ప్రజానీకానికి విద్యను దూరం చేస్తున్నారని విమర్శించారు. దీనికిగాను రాష్ట్ర ప్రభుత్వం భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
‘సూపర్ సిక్స్’ ఊసే లేదు
ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలు ఊసే లేదని, సెవన్ కూడా లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా దాన్ని విస్మరించారని విమర్శించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని, దాని ఊసు కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌లో గవర్నర్‌తో పచ్చి అబద్ధాలను మాట్లాడించారని విమర్శించారు. ఏపీలో వైద్య కళాశాలల తీరు మరింత దారుణంగా మారిందని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్యంపై ఏ రాష్ట్రంలో పెట్టని విధంగా ప్రత్యేక దృష్టి సారించారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు ఉండరాదనే ఉద్దేశంతో వైద్యులు మొదలుకుని ఇతరత్రా పోస్టులన్నింటినీ భర్తీ చేయించారని అన్నారు. జిల్లాకు ఒక వైద్య కళాశాలను ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వైద్య కళాశాలలను నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. కూటమిలోని పెద్ద భూస్వాములకు ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు ఎలా అందుతాయని ఆయన ప్రశ్నించారు.
విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు జయప్రదం చేయాలి రూ.4,600 కోట్ల ఫీజు బకాయిలను సర్కారు విడుదల చేయాలి పేద ప్రజలకు విద్య, వైద్యాన్ని దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి రూ.3 వేలు, 20 లక్షల ఉద్యోగాల కల్పన శూన్యం వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు పాలకుల కుటిల యత్నాలు వైఎస్‌ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి
Comments
Please login to add a commentAdd a comment