రౌడీషీటర్ల ఆగడాలు సహించేదే లేదు
నగరంపాలెం: జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఈ పక్రియ చేపట్టారు. నగరంపాలెం పీఎస్, పట్టాభిపురం పీఎస్, అరండల్‌పేట పీఎస్ పరిధిలోని రౌడీషీటర్లకు పశ్చిమ డీఎస్పీ అరవింద్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీషీటర్లు మంచి ప్రవర్తనతో మెలగాలని సూచించారు. చెడు అలవాట్లకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. వివాదాలు, పంచాయితీలు, దందాలు, బెదిరింపులు, కిడ్నాపులు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఇక నుంచి కుటుంబ సభ్యులతో రౌడీషీటర్లు కౌన్సెలింగ్‌కు హాజరవాల్సి ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఎదుట కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. చిన్న నేరాల్లోనైనా పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వ పథకాల నిలిపివేతకు సిఫారసు చేస్తామని చెప్పారు. ఫోన్, ఆధార్ కార్డుల నంబర్లు, ఇళ్ల చిరునామాలు పోలీస్ డేటాబేస్‌లో ఉన్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంటుందని అన్నారు. తీరు మారని రౌడీషీటర్లపై నమోదైన పాత కేసులను త్వరితగతిన విచారణ చేపట్టి, శిక్షలు పడేలా చేస్తున్నామని వెల్లడించారు. నిత్యం నేరాలు, అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగించి, జిల్లా బహిష్కరణ చేస్తామన్నారు. మంచి ప్రవర్తనతో మెలిగితే ఉన్నతాధికారులకు సిఫారసు చేసి, రౌడీషీట్లను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నేరాలకు పాల్పడితే పీడీ చట్టం, బహిష్కరణ తప్పదని డీఎస్పీ హెచ్చరిక జిల్లావ్యాప్తంగా అన్ని పీఎస్‌లలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
Comments
Please login to add a commentAdd a comment