శ్రీధరం.. సంతృప్తికరం | - | Sakshi
Sakshi News home page

శ్రీధరం.. సంతృప్తికరం

Published Wed, Mar 12 2025 8:07 AM | Last Updated on Wed, Mar 12 2025 8:03 AM

శ్రీధ

శ్రీధరం.. సంతృప్తికరం

సాక్షి ప్రతినిధి, గుంటూరు: పొగాకుకు ఎన్నడూ రానంత ధరలు రావడం, రైతులందరూ సంతోషంగా ఉండటం తనకెంతో తృప్తినిచ్చిందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు తెలిపారు. ఏడున్నరేళ్ల సుదీర్ఘకాలం పొగాకు బోర్డులో సేవలు అందించిన శ్రీధర్‌బాబు తన సొంత క్యాడర్‌ ఉత్తరాఖండ్‌కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పొగాకు బోర్డులో తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. తాను వచ్చేసరికి పొగాకు బోర్డు ఏటా రూ.27 కోట్ల నష్టాల్లో ఉండగా ప్రస్తుతం ఫిబ్రవరి నాటికే రూ.95 కోట్ల ఆదాయంతో అన్ని వ్యవసాయ బోర్డులలో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు.

చిరస్మరణీయంగా 2023–24 సీజన్‌

2023–24 పొగాకు అమ్మకాల సీజన్‌ రైతులకు చిరస్మరణీయంగా నిలిచిందని శ్రీధర్‌ పేర్కొన్నారు. గతంలో రైతులకు 15 రోజులకు చెల్లింపులు జరిగేవని, ఇప్పుడు వాటిని తొమ్మిది రోజులకు తగ్గించి త్వరగా రైతులకు నగదు అందేలా చూస్తున్నామని వెల్లడించారు. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు జమయ్యేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు వరుసగా రెండేళ్లపాటు రైతులకు సహాయ నిధి నుంచి పది వేల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పించామని పేర్కొన్నారు. గతంలో అధిక ఉత్పత్తి పై జరిమానాలు ఉండేవని, దీని వల్ల రైతులు అనధికారిక పంటలు వేయకుండా చూడటంతోపాటు పొగాకు బోర్డుకు ఆదాయం వచ్చేదన్నారు. అయితే కోవిడ్‌ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పొగాకు పంట తగ్గిన నేపథ్యంలో అక్కడ ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఇక్కడ ఎక్కువ పంటకు అనుమతి వచ్చేలా చూడంతోపాటు అధిక ఉత్పత్తి చేసిన రైతులపై విధించిన జరిమానాలను ఎత్తివేసి, 76.84 మిలియన్‌ కిలోల అదనపు పొగాకును విక్రయించే అవకాశం కల్పించామని వివరించారు. దీని ద్వారా రైతులకు రూ.184 కోట్ల మేర ప్రయోజనం దక్కిందన్నారు.

ఎన్నడూ లేనంత ధర

2023–24లో 215.35 మిలియన్‌ కిలోల పొగాకు విక్రయం జరగగా, రెండు దశాబ్దాలలో ఎప్పుడూ రానంత అత్యధిక ధర పలికిందని శ్రీధర్‌ పేర్కొన్నారు. గత ఏడాది సగటు ధర రూ. 288.65 పలికిందని, అంతకుముందు ఏడాది రూ. 225.73తో పోలిస్తే రూ.62.92 పెరుగుదల నమోదైందన్నారు. ఎన్నడూ లేనివిధంగా గరిష్ట ధర రూ. 411 పలకడం ఇదే మొదటిసారి అన్నారు. కర్ణాటకలో తాజాగా మొదలైన పొగాకు అమ్మకాలలో కూడా సగటున 288 రూపాయలకు కొనుగోళ్లు జరుగుతున్నాయన్నారు. 2023–24 సీజన్‌లో పొగాకు ఎగుమతుల విలువ రూ. 12,005.89 కోట్లు చేరిందని, 2024–25లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీధర్‌ పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో మరింత మెరుగైన ధర

2024–25 సీజన్‌లో మరింత మెరుగైన ధరలు వస్తాయని శ్రీధర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ రైతులు తన పట్ల చూపించిన ఆదరణ మరువలేనిదని పేర్కొన్నారు. ఉత్తర కాశీ కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీ అయినప్పుడు అక్కడ ప్రజలు రోడ్డుపైకి వచ్చి తనను బదిలీ చేయవద్దని ఆందోళనలు చేశారని, ఇక్కడ రైతులు కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ చూపించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

పొగాకు బోర్డులో రికార్డు స్థాయి ధరలు ఉత్పత్తిలో అత్యున్నతం నష్టాల నుంచి లాభాల్లోకి నడిపిన ఈడీ శ్రీధర్‌బాబు సొంత క్యాడర్‌ ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న సందర్భంగా ‘సాక్షి’తో మాటామంతీ

మౌలిక సదుపాయాలకు పెద్దపీట

తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత వేలం కేంద్రాలలో మౌలిక సదుపాయాల కోసం రూ. 38.92 కోట్లు ఖర్చుచేసినట్టు శ్రీధర్‌ చెప్పారు. ఎన్నడూ లేని విధంగా విడి పొగాకు, స్క్రాప్‌ అమ్మకాలకు కూడా అధిక ధరలు వచ్చాయని పేర్కొన్నారు. టుబాకో బోర్డును ఆధునికీకరించి పరిశ్రమగా అభివృద్ది చేసేందుకు శ్రీకారం చుట్టామని చెప్పారు. విదేశాలలో పొగాకు మార్కెట్‌ను పరిశీలించి వచ్చిన తర్వాత తాను చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించి రైతుల పక్షాన తీసుకున్న నిర్ణయాలు రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడ్డాయన్నారు. పొగాకు డిమండ్‌ పెరిగి రైతులకు ఆదాయంతోపాటు ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం కూడా పెరిగిందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శ్రీధరం.. సంతృప్తికరం 1
1/1

శ్రీధరం.. సంతృప్తికరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement