కారం మిల్లులపై విజిలెన్స్ దాడులు
నగరంపాలెం: గుంటూరు నగరంలోని పలు కారం మిల్లుల్లో విజిలెన్స్, ఇతర ప్రభుత్వశాఖ అధికారులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. సుమారు రూ.21లక్షలకు పైగా విలువ చేసే కారం పొడి, మిరప కాయలు, పసుపు, ధనియాలు సీజ్ చేశారు. గుంటూరు రీజినల్ విజిలెన్స్ ఎస్పీ డి.సూర్యశ్రావణ్‌కుమార్ ఆదేశాల మేరకు చిలకలూరిపేటరోడ్డు శ్రీలక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ (కారం మిల్లు)లో విజిలెన్స్, తూనికలు–కొలతల శాఖ, వ్యవసాయ శాఖ, ఆహార నియంత్రణ, కార్మిక శాఖ అధికారులు సంయుక్తంగా సోదాలు చేశారు. ఎటువంటి రశీదులు, రికార్డుల్లేకుండా మిల్లు యాజమాని బండారు రవీంద్రకుమార్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మిర్చియార్డు దగ్గర్లోని మోహన్‌లాల్ మహేంద్ర కుమార్ – కంపెనీ నుంచి ఎక్కువ మొత్తంలో మిర్చికి బిల్లుల్లేకుండా తీసుకొచ్చి కారం పొడి తయారీ చేస్తున్నట్లు బహిర్గతమైంది. కొన్ని ట్రేడర్స్‌కు చెందిన స్టాక్స్ బిల్లులు లేకపోవడంతో, రూ.17.43 లక్షల విలువ చేసే 13,915 కిలోల కారం పొడి, రూ.3.14 లక్షల ఖరీదైన 1,815 కిలోల మిరపకాయలు, రూ.12 వేల విలువైన 75 కిలోల పసుపు, రూ.1.06 లక్షల ఖరీదు చేసే 1,320 కిలోల దనియాలకు స్టాక్ రిజిస్టర్, బిల్లులు లేకపోవడాన్ని తనిఖీల్లో గుర్తించారు. తదుపరి చర్యలకై కారం, మిరపకాయలు, పసుపు, ధనియాలు సీజ్ చేశారు. ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలకు స్టాంపింగ్ లేకపోవడంతోపాటు ప్యాకింగ్ లైసెన్స్ లేకుండా ప్యాకింగ్ చేయడంపై యాజమానిపై కేసు నమోదు చేశారు. కార్మికశాఖ కూడా కార్మికుల హాజరు పట్టిక, ఇతరత్రా వివరాలు సేకరించి చర్యలకు ఉపక్రమించారు. విజిలెన్స్ సీఐ కె.చంద్రశేఖర్,ఏఓ ఆదినారాయణ, తూనికలు, కొలతల శాఖ ఏసీ కొండారెడ్డి, ఫుడ్ ఇన్స్‌పెక్టర్ రవీంద్రారెడ్డి, కార్మిక అధికారి సాయి పాల్గొన్నారు.
సుమారు రూ.21 లక్షలకు పైగా విలువచేసే కారం పొడి, పసుపు, ధనియాలు సీజ్
Comments
Please login to add a commentAdd a comment