క్యారమ్స్‌కు కేరాఫ్ జలీల్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): కొందరికి క్రీడలు సాధనం కాగా మరికొందరు దానినే జీవితంగా భావిస్తారు. అటువంటి వారికి సమాజంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానముంటుంది. ఈ కోవలోకే వస్తారు గుంటూరుకు చెందిన ప్రఖ్యాత క్యారమ్స్ ప్లేయర్, శిక్షకుడు షేక్ అబ్దుల్ జలీల్. తొలినాళ్లలో జీవనోపాధి కోసం క్యారమ్స్ క్రీడను సాధనంగా ఎంచుకున్నారు. ప్లేయర్ గా రాణించినా అవగాహనా లోపంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని త్రుటిలో కోల్పోయారు. అయితే క్యారమ్స్‌ను మాత్రం ఆయన జీవితంలో ఒక భాగంగా చేసుకుని దానికి ఐపీఎల్ స్థాయి హోదా తీసుకొచ్చేందుకు రాజీలేని పోరాటం చేశారు. తొలిసారి రాష్ట్రంలో పేరొందిన క్రీడాకారులను రూ.లక్షలు వెచ్చించి కొన్ని జట్లు కొనుగోలు చేశాయి. క్యారమ్స్‌లో అంతర్జాతీయ క్రీడాకారుడిగా, శిక్షకుడిగా, మెంటార్‌గా, ప్రమోటర్‌గా విభిన్న పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న జలీల్ ఈ నెల 17 నుంచి 21 వరకు ఢిల్లీలో జరగనున్న 52వ జాతీయ నేషనల్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌కు చీఫ్ రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయనకు నియామక ఉత్తర్వులు అందాయి. రాష్ట్రంలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తి జలీలే కావడం గమనార్హం.
క్రీడాకారునిగా ...
1991లో క్యారమ్స్ క్రీడలో సాధన ప్రారంభించిన జలీల్ 1995లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగారు. అదే ఏడాది స్థానిక ఎల్‌వీఆర్ క్లబ్‌లో జరిగిన ఇండో–శ్రీలంక చాంపియన్‌షిప్‌లో చక్కని ప్రతిభ కనబరిచారు. తన కెరీర్‌లో సుమారు 15 జాతీయ స్థాయి టోర్నమెంట్స్‌తోపాటు పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల ను ఆడి ప్రపంచ ప్రఖాత క్రీడాకారులతో తలపడ్డారు. ప్రస్తుతం జాతీయ క్రీడాకారిణిగా కొనసాగుతున్న షేక్ హుస్నా సమీరాకు కోచ్ జలీలే. హుస్నా సమీరా ఇటీవల గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది.
రిఫరీగా...
1995 నుంచి జలీల్ క్యారమ్స్ ప్లేయర్‌గా కొనసాగుతూనే రిఫరీగా చేస్తున్నాడు. ఈ క్రమంలో 2012లో ఎల్‌వీఆర్ క్లబ్‌లో జరిగిన ఇండో–శ్రీలంక చాంపియన్‌షిప్‌తోపాటు 2013లో ఏడు దేశాలు పాల్గొన్న 17వ సార్క్ చాంపియన్‌షిప్, 5వ ఏషియన్ చాంపియన్‌షిప్‌కు నిర్వహణా కార్యదర్శిగా పనిచేశారు. భారత క్యారమ్స్ జట్టుకు కోచ్‌గానూ వ్యవహరించారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన డెక్కన్ ప్రీమియర్ క్యారమ్స్ లీగ్ (డీఏపీసీఎల్)లో ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్‌తో కలసి పోటీలను అద్భుతంగా విజయవంతం చేశారు. ప్రస్తుతం జలీల్ ఇంటర్నేషనల్ రిఫరీ హోదా కలిగి ఉన్నారు. అతని శిష్యులు నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు.
క్యారమ్స్ ప్రతి ఇంట్లోకి వెళ్లాలి
క్యారమ్స్ అందరికీ చక్కని ఆటవిడుపు. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సాధన చేయొచ్చు. ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తుంది. కార్పొరేట్ స్థాయిలో ఆదరణ లభిస్తుంది. అనేక పేరొందిన టోర్నమెంట్స్‌ను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించాం. ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్‌తోపాటు, స్థానిక క్లబ్‌లు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నాయి. 52వ జాతీయ నేషనల్ క్యారమ్స్ చాంపియన్‌షిప్‌కు చీఫ్ రిఫరీగా ఎంపికకావడం సంతోషంగా ఉంది.
– షేక్ అబ్దుల్ జలీల్, ఆంధ్ర క్యారమ్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
52వ జాతీయ నేషనల్ క్యారమ్స్
చాంపియన్‌షిప్‌కు చీఫ్ రిఫరీగా ఎంపిక
రిఫరీగా, శిక్షకుడిగా, పర్యవేక్షకునిగా రాణింపు
క్యారమ్స్‌కు కేరాఫ్ జలీల్
Comments
Please login to add a commentAdd a comment