ఏపీకి చేరుకున్న మయన్మార్‌లో చిక్కుకుపోయిన వ్యక్తులు
గన్నవరం: మయన్మార్ దేశంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు భారత ప్రభుత్వ చొరవతో మంగళవారం సురక్షితంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, ప్రొద్దుటూరుకు చెందిన మరో నలుగురు వివిధ ఏజెన్సీలు ద్వారా వర్క్ వీసాపై ఉద్యోగాలు నిమిత్తం మయన్మార్ వెళ్లారు. వర్కింగ్ వీసాల గడువు తీరినప్పటికీ వెనక్కి రాకుండా వీరంతా మయన్మార్‌లోనే స్థిరపడిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన మయన్మార్ అధికారులు సదరు ఏడుగురు పాస్‌పోర్ట్‌లు, వీసాలను స్వాధీనం చేసుకుని భారత ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే మయన్మార్ అధికారులతో సంప్రదింపులు జరిపి అక్కడ చిక్కుకుపోయిన ఏడుగురిని న్యూఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడ వీరిని సమగ్ర విచారణ అనంతరం కేంద్ర ప్రభుత్వ అధికారులు మంగళవారం రాత్రి ఎయిరిండియా విమానంలో గన్నవరం పంపించారు. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో వీరిని గన్నవరం సీఐ బీవీ. శివప్రసాద్, ఎస్‌ఐ శ్రీధర్‌లు రిసీవ్ చేసుకున్నారు. అనంతరం ఏడుగురిలో ఐదుగురిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమండ్రి, ప్రొద్దుటూరుకు చెందిన ఇరువురిని బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సీఐ తెలిపారు. మయన్మాన్ నుంచి వచ్చిన వారి పేర్లు ఎస్‌కె. ఖాహప్, షేక్ గౌస్‌మస్తాన్, సిహెచ్. త్రిదేవ్, అఫ్రిది, రాజేష్‌కుమార్, షాంషేర్ బాషా, జోయల్ సన్నిగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment