మువ్వా చిన బాపిరెడ్డి ట్రస్టుకు ‘వాలాగ్రో’ విరాళం
పెదపరిమి(తాడికొండ): ఆశ్రమం పేరిట వృద్ధులకు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ పేరిట మువ్వా చిన బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ గొప్ప సహాయ సహకారాలు అందిస్తోందని వాలాగ్రో బయో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్షియల్ హెడ్ రామకృష్ణ ప్రశంసించారు. శనివారం హైదరాబాదుకు చెందిన ఆ సంస్థ సభ్యులు తుళ్లూరు మండలం పెదపరిమిలోని మువ్వా ట్రస్టు క్యాంపస్‌ను సందర్శించారు. సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.8.70 లక్షల చెక్కును ట్రస్టు సభ్యులు వంగా సాంబిరెడ్డి, మున్నంగి శ్రీనివాసరెడ్డిలకు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పాతికేళ్లకు పైగా ట్రస్టు నిబద్ధతతో పని చేయడం అభినందనీయమని తెలిపారు. ట్రస్ట్ చైర్మన్ ఎంవీ రామిరెడ్డి మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా విద్య, వైద్యం, మహిళా సాధికారత అంశాలపై తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ అందిస్తూ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1000 మంది శిక్షణ పొందగా, 700 మందికి పైగా ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. వృద్ధులకు అధునాతన సదుపాయాల ద్వారా సొంతింటి వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వాలాగ్రో కంపెనీ హెచ్‌ఆర్ హెడ్ తుమ్మూరు రఘురామిరెడ్డి, కంపెనీ ఉద్యోగులు నరేంంద్ర, శ్యామ్, సురేంద్ర, పలువురు ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment