12వ పీఆర్సీ చైర్మన్‌ను తక్షణమే నియమించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: పన్నెండో వేతన సవరణ సంఘాని(పీఆర్సీ)కి తక్షణమే చైర్మన్‌ను నియమించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సంఘ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తొమ్మిది నెలల క్రితం అధికారంలోకి రాక ముందు, తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తామని, సకాలంలో డీఏలు ఇస్తామని హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. ఇప్పటికీ 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించకపోవడం దారుణమన్నారు. 12వ పీఆర్పీ చైర్మన్‌ను నియమించి, విధి విధానాలను అప్పగించి, సంఘాలతో చర్చలు జరిపి ఐఆర్ ప్రకటించి అమలు చేసేందుకు మరింత జాప్యం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన మూడు డీఏలు ఇప్పటికీ చెల్లించలేదని, మరొక డీఏ జూలైకి రాబోతుందని, ఇప్పటికై నా డీఏలను తక్షణం చెల్లించాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం 2017లో ఇచ్చిన మెమో 57ని ఇంతవరకు అమలు చేయకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా యూటీఎఫ్ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుందని హెచ్చరించారు. సంఘ రాష్ట్ర ప్రచురణ విభాగ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాలలను అన్ని హంగులతో ఏర్పాటు చేయాలని, మిగిలిన ప్రాథమిక పాఠశాలలను యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. 60 మంది విద్యార్థులు దాటిన ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేసి, మిగిలిన యూపీ పాఠశాలను యధావిధిగా కొనసాగించాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియాలను కొనసాగిస్తూ ప్లస్ 2 పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలన్నారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్, జిల్లా సహధ్యక్షురాలు వై. నాగమణి, కోశాధికారి ఎండీ దౌలా, జిల్లా కార్యదర్శులు ఆదినారాయణ, సాంబశివరావు, గోవిందయ్య, ఆంజనేయులు, షకీలా బేగం, కేదార్ నాధ్, రంగారావు, ప్రసాద్, ఆడిట్ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, కోటిరెడ్డి, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment