ఆడపిల్లల నిష్పత్తి పెంచాలి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి
గుంటూరు మెడికల్ : మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉంటుందని, పెంపునకు కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి చెప్పారు. గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు, జెండర్ వైలెన్స్‌పై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రు నిర్వాహకులు, వైద్యులతో సమావేశం జరిగింది. జిల్లా మల్టీ మెంబెర్ అప్రాప్రియేట్ అథారిటీ సభ్యులు, సలహా సంఘసభ్యులకు, ప్రసూతి వైద్య నిపుణులు సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని చెప్పారు. జీజీహెచ్ గైనకాలజి ప్రొఫెసర్ డాక్టర్ పి.జయంతి మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లు నిర్వహించాల్సిన రిజిస్టర్లు, జిల్లాకు పంపాల్సిన రిపోర్టులు, పాటించాల్సిన నియమాల గురించి వివరించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగమణి మాట్లాడుతూ పీసీపీఎన్‌డీటీ చట్టం అతిక్రమిస్తే విధించే శిక్షల గురించి వివరించారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, తెనాలి డెప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అన్నపూర్ణ, డెమో ఎ.జయప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment