మంగళగిరి టౌన్: మంగళాద్రిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా గురువారం పరమ పద నాథుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా ఆత్మకూరుకు చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు.
వట్టిచెరుకూరు హాస్టల్
వార్డెన్‌ను సస్పెండ్ చేయండి
మంత్రి సవిత ఆదేశం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు బీసీ హాస్టల్ విద్యార్థి కిశోర్ చెరువులో పడి దుర్మరణం పాలవ్వడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులపై పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ శారదారాణిని తక్షణమే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. చేతికందికొచ్చిన కొడుకు మృతి చెందడం బాధాకరమని, మృతుడి తల్లిదండ్రుల కడుపుకోత వర్ణాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు మంత్రి సవిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుర్ఘటనకు గల కారణాలపై విచారణకు ఆదేశించామని తెలిపారు.
రాజధాని ముఖ ద్వారంలో మరో దారుణం
● గుర్తు తెలియని వ్యక్తిని
కొట్టి చంపిన స్థానికులు
● ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
తాడేపల్లి రూరల్: రాజధాని ముఖ ద్వారమైన కె.ఎల్.రావు కాలనీలో మద్యం మత్తులో కొంతమంది యువకులు దారుణానికి పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తిని గురువారం రాత్రి విచక్షణా రహితంగా కొట్టి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. ప్రకాశం బ్యారేజ్ మంగళగిరి రోడ్డులో కేఎల్‌రావు కాలనీ హోసన్నా ప్రార్థన మందిరం ఎదుట కింద భాగంలో రాత్రి 7.30 సమయంలో ఓ యువకుడు రోడ్డుపై సంచరిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో మద్యం తాగి రోడ్డుపై తిరుగుతున్న ఓ ఆటోడ్రైవర్ కుమారుడు అతడితో గొడవకు దిగాడు. సరిగా సమాధానం చెప్పకపోవడంతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. అక్కడే ఉన్న కొంతమంది స్నేహితులు కూడా ఆ యువకుడిపై మరోసారి దాడిచేశారు. కాళ్లు పట్టుకుని ఏడ్చినా సరే వదలకుండా కాళ్లతో, చేతులతో పిడిగుద్దులు గుద్దడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి ఎవరు అనేది కూడా అక్కడ ఉన్న వారికి తెలియదు. ఇదిలా ఉండగా కాలువలో చనిపోతే పైకి తీసుకు వచ్చినట్లు చిత్రీకరించారు. ఎట్టకేలకు స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులు మాత్రం ఎవరు కొట్టారు అనే విషయాన్ని వెల్లడి చేసేందుకు భయభ్రాంతులకు గురవుతున్నారు.